Previous Page Next Page 
ప్రతీకారం పేజి 28


    "ఈ కేసు నువ్వు చెయ్యవద్దు. ఇది గెలవడం సాధ్యం కాదు. ఇది నీ మొదటి కేసు. మొదటి కేసు పోతే నీ భవిష్యత్తుకే దెబ్బ, అదే ఆలోచిస్తున్నాను. నా మాట విని ఈ కేసు వదులుకో." అన్నది రాధాదేవి సడలిపోతున్న నరాల్ని కూడదీసుకుంటూ.
    "నేను ఈ కేసు చేసి తీరాలి. గెలుస్తాను. తప్పక గెలుస్తాను. నువ్వు ఆశీర్వదించమ్మా! నీ ఆశీర్వాద బలంతో తప్పక గెలుస్తాను."
    రాధాదేవి మనస్సు కలుక్కుమన్నది. "వద్దమ్మా! నా మాట విను. ఈ కేసు చెయ్యకు. ఈ కేసు గెలవడం అంత సులభం కాదు. అనవసరంగా ఎందుకు బాధపడతావు? అతను నిరపరాధి కావచ్చు. కాని ఎంతమంది నిరపరాధులకు శిక్షలు పడటం లేదు? ఎవరెవర్ని రక్షిస్తావు?"
    "అలా అనకమ్మా! ఎవర్ని రక్షించగలిగినా రక్షించలేకపోయినా రవిని రక్షిస్తాను. రవికి శిక్ష పడటానికి వీల్లేదు. అలా జరగటానికి వీల్లేదు. నేను ఈ కేసు గెల్చి తీరతాను" ఆవేశంగా అన్నది ఇందిర.
    రాధాదేవి చివ్వున తలెత్తి కూతురి ముఖంలోకి చూసింది. ఏదో అనుమానం రాగా నిలువెల్లా కంపించిపోతుంది.
    ఇందిర రవిని ప్రేమిస్తోందా? రవి పేరు చెబుతున్నప్పుడు ఆ కళ్ళు ఎందుకలా వెలిగిపోతున్నాయి? హే భగవాన్!"
    రాధాదేవి పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్ళి భర్త ఫొటో ముందు నిలబడింది.
    "కాదు నా ఊహ నిజం కాదు. ఇందిర రవిని ప్రేమించడం లేదు! వారిద్దరి మధ్యా ఎలాంటి అనుబంధం లేదు. కేవలం ఇందిర కేసు చేస్తూంది. లాయరుగా తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది, అంతే...స్వామీ! నాకు బలాన్ని ఇవ్వు. ప్రతీకారం తీర్చుకుంటాను! నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నాలో ప్రతిక్షణం ప్రజ్వరిల్లుతున్న ఈ అగ్నిని చల్లార్చుకుంటాను" రాధాదేవి భర్త ఫొటోలోకి చూస్తూ ఆవేశంగా మాట్లాడుతోంది.
    కొంతసేపటికి ఆమెకు సేద తీరినట్టు అనిపించింది. కూతురు జ్ఞాపకం వచ్చి గబగబా గది బయటికి వచ్చింది. ఇందిర హాల్లో లేదు. గదిలో కూర్చుని "లా" పుస్తకాలు తిరగేస్తూంది. అది చూసిన రాధాదేవికి పిచ్చి ఆవేశం వచ్చింది. విసురుగా ముందుకొచ్చి టేబుల్ మీదవున్న పుస్తకాలను తీసి నేలకేసి కొట్టింది. ఇందిర తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూసింది.
    అమ్మకు ఇవ్వాళ ఏమయింది? ఎందుకంత ఆవేశపడి పోతుంది? అమ్మ తనను లా చదవమన్నది. తనకు డాక్టరీ చదవాలనివున్నా తల్లి మాట తీసెయ్య;లేకనే లా చదివింది. లాయరుగా ఒక నిరపరాధికి శిక్ష పడకుండా రక్షించినా మానవ జీవితం సార్థకమైనట్టే అని ఎప్పుడూ చెబుతూ వుండేది. అలాంటి అమ్మకు ఇవ్వాళ ఏమైంది?
    "ఇదుగో! మీ ఫరం నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే వచ్చి డ్యూటీలో చేరమన్నారు. లీవు పొడిగించడానికి వీల్లేదన్నారు. అసలు నువ్వు లీవు పెట్టి ఎందుకు వచ్చినట్టు? నేను ఇంతవరకూ ఇది మీ ఫరం వాళ్ళు అప్పగించిన కేసనే అనుకుంటున్నాను" కోపంగా రాధాదేవి ఇందిరకు ఉత్తరం అందించింది.
    ఇందిర ఉత్తరం చదివి నిర్లక్ష్యంగా పెదవి విరిచింది.
    "నేను రాజీనామా పంపించాలనుకుంటున్నాను"
    రాధాదేవి చివ్వున తలెత్తి కూతురి కళ్ళలోకి తీక్షణంగా చూసింది.
    "పిచ్చి వేషాలు వెయ్యకు. వెంటనే డ్యూటీలో చేరు"
    రాధాదేవి కంఠంలోని తీవ్రతకు ఇందిర ఆశ్చర్యపోయింది. ఉద్యోగం వదిలేసి రమ్మని ప్రతి ఉత్తరంలో రాసేది. అలాంటి అమ్మకు ఇవ్వాళ ఏమైంది. రాజీనామా ఇస్తానంటే సంతోష పడాల్సిన అమ్మ వీల్లేదంటుందేం? వెంటనే వెళ్ళి ఉద్యోగంలో చేరమంటోంది. ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి.
    "రేపే వెళ్ళి డ్యూటీలో చేరు" రెట్టించింది రాధాదేవి.
    "వెళ్ళను!" ఖచ్చితంగా అన్నది ఇందిర.
    "ఎందుకెళ్ళవు? ఈ బోడి కేసు కోసమేనా? నువ్వు ఈ కేసు చెయ్యడానికి వీల్లేదు. రేపే వెళ్ళిపోవాలి" ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నది రాధాదేవి.
    తల్లి కళ్ళలోకి లోతుగా చూసింది ఇందిర. ఇందిర చూపుల్ని తప్పించుకుంటూ గిర్రున వెనక్కు తిరిగి బయటకి వెళ్ళిపోయింది రాధాదేవి.
    తల్లి వెళ్ళినవేపే విస్మయంగా చూస్తూ నిల్చుండిపోయింది ఇందిర.
    ఆమె కళ్ళు ఏమిటి అలా వున్నాయి. ఆమె కళ్ళలో ఎవరిమీదనో కసి కక్కుతున్నాయి.
    తల్లి గురించి ఆలోచిస్తూ మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది ఇందిర.

                                             22

    చేతిలో న్యూస్ పేపరూ, పెద్ద బాల్ పట్టుకొని ఈల వేస్తూ గడపలో అడుగుపెట్టాడు అంజిబాబు. తలుపులు అసహ్యంగా బాధసాగాడు. తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. భర్తను చూసి రమ తెల్లబోయింది! మరుక్షణంలో ముఖం చిట్లించుకుంది. భర్త ముఖంలోకి కోపంగా చూసింది.
    కాని అంత నిర్లక్ష్యంగా భార్యను పక్కకు తోసి ఈల వేస్తూ లోపలకు వచ్చాడు.
    ఆమె కాపరానికి వచ్చిన ఈ ఆరు సంవత్సరాల్లో అంజిబాబు భార్యముందు ఎప్పుడూ ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదు. భార్యంటే చచ్చేంత భయం! ఆమె కను సైగల మీద నడుస్తూ ఉంటాడు. రమ కలిగిన ఇంటి బిడ్డ. బాగా కట్నం తెచ్చింది. అంజికి ఉద్యోగం లేదు. భార్య సొమ్ము తింటూ కూర్చునే మగ వాళ్ళందరిలాగే అంజి కూడా తనకో వ్యక్తిత్వం వున్నదనే విషయం మర్చిపోయి చాలాకాలం అయ్యింది. అటువంటి అంజి తన ముందు అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆమెకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించింది. వాకిట్లో ఎంతో కాలంగా కట్టిపడేసి ఉండే సాధుజంతువు ఒక్కసారిగా మనిషి భాషలో తిట్టడం ప్రారంభిస్తే యజమానికి కలిగేలాంటి భయమూ విస్మయమూ కలిగాయి రమకు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS