Previous Page Next Page 
ది సెల్ పేజి 28


    తనకు నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. తనగురించి చెప్పుకున్నా వినేవాళ్ళు లేరని నిర్ధారణ అయ్యింది.
    కాలచక్ర పరిభ్రమణంలో తానొక విధి వంచితుడు. ఇంకెక్కడ తలదాచుకోవాలి. శేష జీవితాన్ని ఎలా గడపాలి. నాటి రచ్చబండలూ లేవు, గ్రామ చావిడులు లేవు, నీడనిచ్చే చెట్లు లేవు. ఇదివరకు ధర్మసత్రాలు వుండేవి__ అవి ఇప్పుడు మచ్చుకైనా ఉన్నాయా అన్న మీమాంస...
    "ఇక్కడ ధర్మసత్రం ఎక్కడ ఉంది బాబు" భరత్ భూషణ్ ఓ అపరిచిత వ్యక్తిని అడిగాడు.
    అతను ఒకసారి భరత్ భూషణ్ వేపు వింతగా చూసి "ఏ దేశం మనది... ఐ మీన్ ఏ ప్రాంతం మనది_ ఇంకెక్కడి ధర్మ సత్రాలు - భేతాళకథలు, కాశీ మజిలీ కథల్లో వున్నాయి. ప్రస్తుతం హాస్టల్స్ వున్నాయి_ఇంతకీ నీదే కులం_ ఐ మీన్ నీకు ఏ కులపు హాస్టల్ కావాలి?_" అన్నాడా వ్యక్తి.
    ఈసారి విస్తుపోవటం భరత్ భూషణ్ పని అయ్యింది.
    భరత్ భూషణ్ నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి "డబ్బులేకపోతే, పోయి గుడిలో పడుకో ముసలోడా" అంటూ చిరాగ్గా వెళ్ళిపోయాడా వ్యక్తి.
    ఉచితసలహా బాగానే వుంది. అవును గుడిలో చాలా ప్రశాంతంగా వుంటుంది. శేషజీవితం గుడిలో గడిపివేయవచ్చు అన్న ఆశతో బయలుదేరాడు.
    గుడిలో దీపాలు వేలుగుతున్నట్లు లేదు. గుడిగంటలు మ్రోగుతున్నట్లు లేదు. కాని అది దేవుడి గుడే! ఏ దేవుడో! చిక్కగా చీకటిపడింది.
    గుడిని సమీపించాడు. గుడి తలుపులు మూసి వున్నాయి. దానిముందువున్న అరుగులమీద సన్యాసులు కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. కొందరు తత్వాలు పాడుతుంటే; మరికొందరు గంజాయి దమ్ము లాగుతున్నారు.
    అరుగుమీద ఒక మూలగా ఖాళీగా వుంటే, దుమ్ముదులిపి తువాలు పరచాడు. నడుం వాల్చబోయాడు.
    అంతే! వెంటనే యుద్ధం మొదలయ్యింది. "ఎవడ్రానువ్వు_ మా జాగాలో చేరావు? బుక్కా పకీరుగాడిలా వున్నావు, మీకు మసీదులుండగా మా గుడే కావాల్సివచ్చిందా..."
    ఒకళ్ళతరువాత ఒకళ్ళు తలోమాట అంటుంటే వినడానికి కర్ణకఠోరంగా వుంటే కండువా భుజాన్న వేసుకొని అరుగు దిగాడు.
    దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిందట! ఇదా? కులాలు గోత్రాలు_మతాలు...ప్చ్...
    సర్వసంగ పరిత్యాగులైన సంయాసులే మతాల గురించి మాట్లాడుతుంటే ఇక సామాన్యుని సంగతి ఏమిటి? వీళ్ళు సన్యాసులా? సన్నాసులా?
    అసలు ముందు మనుషులమనే విషయాన్నే వీరు విస్మరిస్తున్నారు. స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో "కులం; మతం; విభేదాలే వుంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా?
    స్వాతంత్ర్యానంతరం ఇంత దౌర్భాగ్యపరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది స్వార్థపరశక్తుల కుహనా సంస్కృతా? లేక ప్రజల మనస్తత్వం ఇలా మారుతుందా?
    హిందువులు గుడిలో, ముస్లిమ్ లు మసీదులో, క్రైస్తవులు చర్చిలో మాత్రమే తలదాచుకోవలెనని ఏ మత సాహిత్యంలో, సంప్రదాయాలలో చదివినట్టు తనకు గుర్తురావడం లేదే. తన అజ్ఞాతవాసంలో ఈ దేశంలో మత నమ్మకాలలో కూడా మార్పులు చేర్పులు వచ్చాయా?
    ఏమిటీ పిచ్చి? వీళ్ళూ మనుషులేనా? మనుషులలో మానవత్వం ఎక్కడ?
    వృద్ధాప్యంలో వున్న భరత్ భూషణ్ ఆలోచనలో యువశక్తిని మించి ఆశయాలు, ఆదర్శాలు వెలుగెత్తి చాటుతున్నాయి. అతని వయస్సుకే వృద్ధాప్యంకాని అతని ఆలోచనా ధోరణి రానురాను ఆవేశం, ఆందోళన, ఆగ్రహంతో కూడుకుంటున్నది.
    అతను గమ్యంలేని ప్రయాణం చేస్తున్నాడు. అతని ఆలోచనలలో పెనుతుఫాన్ ప్రారంభమయ్యింది.
    "నా దేశపరిస్థితులు ఇలా వున్నాయే! నేను కలలుగన్న దేశం ఇదేనా! నా దేశప్రజలు వీళ్ళేనా!_
    ఇటువంటి పరిస్థితులు చూడటానికేనా! చూసి కళ్ళనీళ్ళు నింపుకోటానికేనా ఆశతో ఇంతకాలం జీవించి వుంది_
    అదృశ్యం చూసిన భరత్ భూషణ్ కి ఆశ్చర్యం కలిగింది.
    అక్కడ "స్వాతంత్ర్య సమరయోధుల విశ్రాంతి మందిరము" అన్న స్థూపం వుంది. కాని అక్కడ కట్టడాలు ఏవీలేవు ఖాళీ స్థలం వుంది. చుట్టూ తీగకంచె వేసివుంది.
    స్వాతంత్ర్యసమరయోధులు తనలా ఇంకా ఎవరన్నా బ్రతికి వున్నారా!
    అక్కడ స్వాతంత్ర్యసమర యోధుడు తను ఒక్కడే వున్నాడు. అలా అనుకోగానే చాలా గర్వంగా అనిపించింది.
    హుందాగా తీగ కంచను దాటి ఖాళీ స్థలంలోకి ప్రవేశించాడు.
    లోపల చుట్టూ వెదికాడు స్వాతంత్ర్యసమరయోధులు తనలాంటివారు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని. నిర్మానుష్యంగా ఉంది. స్వాతంత్ర్య సమరంలో సమిధలై పోయారు మహాత్ములు, మహర్షులు. కాలగర్భంలో కలసిపోయారు.
    "నా దేశానికి భావస్వాతంత్ర్యం వచ్చేంతవరకు, నా దేశంలో మనుషులందరూ ఏకోదరులుగా బ్రతికేంతవరకు ఓ భగవాన్ నాకు జవసత్వాలు ప్రసాదించు. నా కలం బలం పెరిగేటట్టు దీవించు. నా దేశానికి అసలు-సిసలైన స్వాతంత్ర్యం రావాలి? అందాకా నన్ను బ్రతికించు. హే భగవాన్ నన్ను బ్రతికించు_ బ్రతికించు ...."
    భరత్ భూషణ్ లో ఆలోచనలు ఒకదానివెంట ఒకటి తరుముతుంటే ఆక్రోశిస్తున్న అతనిలోని యువ మనసును సమాధానపరచలేని ముసలి హృదయం చలనహీనమయ్యింది.
    స్వాతంత్ర్య సమరయోధుల విశ్రాంతి మందిర ఖాళీ స్థలంలో స్వాతంత్ర్య సమరయోధుని శరీరం కుప్పలా పడివుంది.
    దానిచుట్టూ ఉన్న తీగకంచ జైలు వాతావరణానికి దర్పణంగా కనిపిస్తున్నది__

                                                           *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS