"సోమదేవుని విషయమై ఏమి నిర్ణయించారు?" ప్రశ్నించింది రాణి. రాజు పధకాన్ని వివరించాడు. సూరమాంబ సంతోషంతో తల ఊపింది.
సోమదేవుడు బందీగా విజయనగరానికి పోయినదగ్గర నుండీ వేమాంబ అన్నం ముట్టడం లేదు.
"సోమదేవుడు మనకు దక్కే వేళకు ఈ పిచ్చిపిల్ల మనకు దక్కదేమో!" అంటూ కన్నీరు పెట్టుకుందామె.
కవిరాజు నలుదిక్కుల పరికించాడు. వేమాంబ లేదు.
"ఆమె ఇంతవరకూ శయనాగారం విడిచి ఎటూ రాలేదు. మీ ఓదార్పు ఆమెకిప్పుడు అవసరమే. రాణి సూచించింది.
సావులు సర్వ స్వతంత్రులు. రాజులకుఇ అందరికన్నఅంతరంగికులు శ్రీనాధయ్య రాజు ప్రోత్సాహంతో వేమాంబ శయనాగారాన్ని ప్రవేశించాడు.
తలుపులన్నీ మూసి వున్నాయి. చుట్టూ తెరలు దించి వున్నాయి. లోపల చీకటిగా వుంది. ఒక దాసీ కవిరాజును చూచి లోపల దీపం వెలిగించి దారి చూపింది.
"ఈ గదిలో దీపాలెందుకు. తీసెయ్యండి" అరిచింది వేమ.
"అమ్మా! ఈ కొండవీటి రాజ్యానికి నీవే మణి దీపానివి. నీకు వెలుగుతో పనిలేకపోయినా, నీ వెలుగు దేశానికి కావాలి" అన్నాడు కవిరాజు. వేమాంబ దిగ్ర్భాంతురాలై సంభ్రమంతో లేచి నిలిచింది. కవిరాజు పాదాలకు తాకి లేచింది.
"శ్రీనాధయ్యగారూ! ఈ దురదృష్టవంతురాలి ముఖాన్ని చూడాలని వచ్చారా? మసిబొగ్గును మాణిక్యంగా మలచడం మీ కవులకు అలవాటే! కాని విధాత చిన్నచూపుకు గురైన ఈ దీనురాలు మీ పొగడ్తలకు అనర్హురాలు" అన్నదామె తలవొంచుకుని.
ఆమె చుబుకాన్ని పట్టుకుని ముఖాన్ని ఎత్తి కన్నీరు కాశ్మీరు శాలువతో తుడిచాడాయన. ఆమె ముఖం ఉబ్బి ఉంది. తుడిచిన కొద్దీ ఊరే కన్నీరు శ్రీనాధయ్య స్పర్శతో కూడ ఆగలేదు.
"కుమారీ! నీ జీవితంలో వెన్నెల వెల్లివిరుస్తుంది. సోముడు తిరిగి వస్తాడు. నేను తీసుకువస్తాను. నీవు కన్నీరు పెట్టుకుంటే మూలగూరమ్మ మీద వొట్టు" అన్నారాయన ఉబికి వస్తున్న పుత్రికా వాత్సల్యంతో.
ఈ మాటు వేమాంబ స్వయంగా కన్నీరు తుడుచుకుంది. ఉబికి వస్తున్న ఎక్కిళ్ళను ఆపుకుంది.
"గురుదేవా! అవచితిప్పయ్యను విజయనగరానికి పంపినప్పుడే యీ కొండవీటి రాజ్యం మీకు ఋణపడింది. ఇప్పుడు యీ రాజ్య రమా, వ్యక్తిగతంగా నేనూ మీకు ఆజన్మాంతమూ ఋణపడి వున్నాము" అన్నది.
"తల్లీ! ఎక్కడో కాశీపట్నంలో పుట్టిన నేను కొండవీటి ప్రభువుల రసజ్ఞత వల్ల ఈ రాజ్యానికి విద్యాధికారి నయ్యాను. నాకీ అధికారమిచ్చిన మీకే నేను ఋణపడి ఉన్నాను." ఉచిత రీతిలో సమాధాన మిచ్చాడాయన. వేమాంబ యిప్పటికి కొంత తేరుకుని లోకంలోకి వచ్చిపడింది. దాసీలు మొత్తం దీపాలన్నీ వెలిగించారు.
నేను సంభ్రమంతో ఉందటం వల్ల 'కవిరాట్ట' ను కూర్చోమని కూడా అనలేదు. ఆమె ఇప్పుడు క్షమాపణలు చెప్పుకుని శ్రీనాధయ్యను ఆశీనుణ్ని చేసి తనూ కూర్చుంది.
"అమ్మా! సప్తమి నాటికి నేను విజయనగరం బయలుదేరుతున్నాను. ఇది పెద్దియజ్వ నిర్ణయించిన ముహూర్తం. ఆయన జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతులు. కనుక నా ప్రయాణంలోని ఉద్దేశాలు పూర్తిగా నెరవేరుతాయని ఆశతో ప్రయాణమవుతున్నాను.
విజయనగరం విషయం ఎత్తేసరికి ఆమె ముఖం తిరిగి మ్లాన సముద్రంలో పడింది.
"గురుదేవా! మీ ప్రయాణం సఫలం కావాలని నేను మూలగూరమ్మను అర్పిస్తాను. మీర్ తిరిగి వచ్చేవరకూ నిత్య పూజలు జరుగుతాయి" అన్నదామె.
"పిసరంత వెన్నెల వెంటపెట్టుకు రండి" అన్నదామె అచ్చ తెలుగులో. ఆమె భావగాంభీర్యమూ, రసజ్ఞతా కవి రాజును అచ్చెరువు గొలిపాయి. ఔను, సర్వజ్ఞుని కుమార్తె కదా!
"వేమా! నీవెంత తెలుగుతేటను ప్రవహింపచేస్తున్నావంటే నాకెంతో సంతోషంగా వుంది. ఎలా నేర్చావమ్మా!"
"మీముందు కూర్చుంటే కటిక రాళ్ళైనా కవిత్వం చెబుతాయి!" అంటూ సమాధాన మిచ్చిందామె. కవిరాజు పులకించాడు.
"అమ్మా! నేను రాజకార్యంలోనే కాదు, మరొక లక్ష్యాన్ని కూడ వెంటపెట్టుకు పోతున్నాను"
"ఏమిటది? నేను తెలుసుకోవచ్చునా?"
"తప్పకుండా తల్లీ నీకు చెప్పాలనే వచ్చాను. నీ వెంట పిసరంత వెన్నెల వెంటపెట్టుకు రావాలంటే సోముణ్ని తీసుకురావాలి కదా! కనుక విజయనగర రాజుల్ని విద్యలో మెప్పించి వరం పొందాలి. అందుకొక పథకం తయారుచేశాను. విజయనగరంలో మమ్మకవి అని వొక మహానుభావుడున్నాడు. అతడు విద్యానగరానికి విద్యాధికారి. అతని నీడన కన్నడ పండితుడొకడు గౌడుల కుటుంబాలకు చెందిన వాడున్నాడు. అతడి పేరు అరుణగిరి గౌడ అనుకుంటాను. జనశృతిలో అతడు గౌడభట్టు. అతడొక డిండిమా (ఢక్క)ని తయారుచేశాడు. తనను గెలిచినవారు ఆ ఢక్కను పగులగొట్టవచ్చును అని సవాలు చేశాడు. ఇంతవరకూ విద్యానగరం వెళ్ళిన వాళ్ళెవరూ ఆ పని చేయలేకపోయారు. మేము ఆ పని సాధించామా! పనులన్నీ సానుకూలమే! సకల సద్గుణా నికురంబ శారదాంబ! ఆ సరస్వతీడేవి నాకు యెల్లప్పుడూ ప్రసన్నురాలే! ఆ ధైర్యంతోనే వెళుతున్నాను. ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధాళువై ఆలకించింది వేమ. అప్పటికి గాని తను సోమదేవుడిని విడిపించుకుని వచ్చేందుకు శ్రీనాధుడు యెంత తీవ్ర యత్నం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేడు. ఆమె కన్నులు కృతజ్ఞతలతో మెరిశాయి. చివ్వున లేచి ఆయన పాదాలను పదేపదే స్పృశించింది.
