శ్లో|| న యాచే గజాళిం న వా వాజీరాజిం
నవిత్తేషు చిత్తం నమే కించిదస్తి
ఇయం సుస్తనీ మస్తకన్యస్తహస్తా
లవంగీ కురంగీ దృగంగీకరోతు. 264
సుసర్ల బ్రహ్మన్న శాస్త్రి
ఈతఁడు కృష్ణామండలమున పెదకళ్ళేపల్లి వాస్తవ్యుఁడు.
శ్లో|| క్షేత్రం దాశరథిః భిలం నిజపదస్ప ర్శేన దోషోజ్షితం
తర్కజ్ఞస్య హి గౌతమీతటజుషో విప్రస్య స ప్రత్యదాత్
గోదాసప్తక తీరసంస్థితి జుషాం షడ్డర్శనీదర్శినాం
శ్రీతిమ్మ క్షితిపో భిలం తదకర స్పర్శం విధత్తే ధునాః|| 265
శ్లో|| తద్దిత స్తద్దిత స్త్వద్దిత స్త్వద్దితః
సద్దిత స్సద్దితో మద్దితో మద్దితః
ఏక ఏవ హ్యసౌ తిమ్మ రాజప్రభు
స్త్వద్దిత స్త్వద్దిత స్సద్దితో మద్దితః|| 266
నడిమింటి మంగళేశ్వరశాస్త్రులు
విశాఖపట్టణం జిల్లా పార్వతీపురము తాలూకాలోని నాగూరను నగ్రహారమున మీఁదఁ బెర్కొన్న నడిమింటి మంగళేశ్వర శాస్త్రులను సుద్డండ విద్వాంసుఁడు జన్మించేను. ఇప్పటికి నేనుబది యేండ్ల క్రిందటి వఱకు నీతఁడు జీవించి యుండెను. విశాఖపట్టణ మండల మందేగాక సర్వాంద్రదేశ మందును నీ పండిత ప్రకాండుని పేరు ప్రఖ్యాతమయినది. వ్యాకరణశాస్త్రమం దీయన మహాపండితుఁడు. తెనాలి రామలింగనివిధము వాఁడు. సుకవి. సంస్కృత భాషాపరిచయము గోరు బాలురకయి సమాసకుసుమావళి యసు పేద నీయన రచియించిన లఘుగ్రంధము మనదేశమున బహువ్యాప్తి కలది. సంస్కృతభాషా భ్యాసము సేయు ప్రతి విద్యార్ధియు నా గ్రంధప్రతిని జదువుచున్నాఁడు.
1. బొబ్బిలి సంస్తానమునకు వీరి యగ్రహారము చేరువనున్నది. ఆ కారణమున బొబ్బిలి ప్రభువులతో నీయనకుఁ దఱచుగా సమాగమము కల్గు చుండేడేడిది. నక్క యెడమ వైపు నుండి కుడి వైపునకుఁ బోయిన మంచిదా కుడి వైపు నుండి యెడమ వైపునకు ఁబోయిన మంచిదా యని యొకనాఁడు బొబ్బిలి రాజుగారు విద్వద్గిష్టిలో మంగళేశ్వర శాస్త్రులు గారి నడిగిరి. శాస్త్రులుగారిట్లు బదులు చెప్పిరి! అది కఱవలేదు గదా!! కఱవ కుండ నెటు పోయినను మంచిదే.
2. బొబ్బిలి రాజుగారు మీకు ఊరు + ఇచ్చేద మనుచున్నారని తదాస్థానో ద్యోగియగు తన మిత్రుఁడొకఁడు చెప్పఁగా దాని తత్త్వ మెఱిఁగిన యీయన యిట్లు బదులు చెప్పెను. "మీరాజుగా రిప్పుడూ ఊరిస్తూనే వుంటారు లెండి".........
3. బొబ్బిలిరాజుగారు సీతారామపురమును పేరు గల తమ సంస్థానగ్రామమున వేంచేసియున్న గోపాలస్వామియే యజమానుడుగా నొకప్పుడు యజ్ఞము చేయించినారట. ఆ యజ్ఞమునకు విచ్చేయను మన మంగళేశ్వర శాస్త్రులు గారికిని ఆహ్వానపత్రిక వచ్చెను. దాని కీయన యిట్లు బదులు వ్రాసి పుచ్చేను. 'ప్రభూ! శ్రీవేణుగోపాలస్వామివారు స్వయముగాఁ జేయుచున్న యజ్ఞమును దర్శింప నేను దప్పక రావలసినవాఁడనే కాని నాకిక్కడ నొక్క చిక్కు తటస్థించినది. మాగ్రామమున రేగాలమ్మయని గ్రామదేవత కలదు. ఆమెను మా యూరనే నెలకొని యున్న పోతురాజను దేవర కిచ్చి పెద్దలు పెండ్లి చేసినారు. రేగాలమ్మ యేన్నాళ్ళకును సమర్తాడయ్యేను. పోతురాజు బ్రహ్మచర్యమున నిల్వఁజాలక తనకిట్టి యసందర్భ వివాహ మేల చేయవలెనని మా గ్రామము వారి మీఁద మహాగ్రహవిష్ణుఁడై యున్నాడు. మేమెందఱము పోతురాజుగారి వలన భీతి గొని యున్నాము. మా యదృష్టవశమున నీనాటికి రేగాలమ్మ పెద్ద మనుష్యురాలయింది. మీరు శ్రీ వేణుగోపాలస్వామి వారి యజ్ఞమునకుఁ బెట్టించిన సుముహూర్తము చాల దొడ్డదగుటచే మేము నదే సుముహూర్తమున సౌభాగ్యవతియగు రేగాలమ్మకు గర్భాధానమంగళము జరిపింప నిదివఱకే నిర్ణయించి పోతురాజుగారి నాశ్వాసపఱచి ప్రయత్నములు జరుపుచున్నాము. గ్రామమునఁ బెద్దవాఁడనగుటచే నేనా శుభకార్యమున కుండి తీఱవలయును. అప్పుడుండకున్నను, సుముహూర్తము మార్చినను బోతురాజుగారికి మహాగ్రహము వచ్చును. ఈ కారణమున శ్రీ స్వామి వారి యజ్ఞనమునాకు రాజాలనందుకు నన్ను క్షమింపవేఁడెదను.
4. బొబ్బిలి సంస్థాన గ్రామ వాస్తవ్యులగు నొకరియింటఁ గొంత సొమ్ము దొంగలు దోచుకొని పోయిరట. దానిని విచారింప రాజుగారి కాయింటి యతఁడు విన్న వించుకొనెను. కన్నము త్రవ్వక చేసిన దొంగఱికము విచారింప సాధ్యము కాని దనియు నట్టి దొంగఱికములను గూర్చి యింక మీఁద దమకు విన్నపము లంపుకొనరాదనియు ద్రోసి పుచ్చి యట్లె దండూర వేయించిరట. దాని మీఁద నీ కవి చెప్పిన శ్లోకము:
శ్లో|| చొరస్పద్మోర్ధ్వ భేదాదర రవిఘటనా త్తత్ప్ర ఘాణా వ్రఖానా,
దేడూకచ్చేదనాద్వావిశతి యది గృహంతత్రనో నోవిచారః,
కింత్వస్మాకం సురంగా కలనయితి పురే ఘోషయామాసయస్మా
త్తస్మా దేతత్సురంగాధిప ఇతి బిరుదం ప్రోచురేతత్పరస్థాః. 267
5. తురుష్కులను గూర్చి యీయన యీ క్రింది శ్లోకమును జెప్పేనట!
శ్లో|| తురక! కరకశ్చైవ ద్వావెతౌమలమోచకౌ,
తురకొదర్శనాదేవ కరకస్తు నిషేవణాత్. 268
6. ఈయనకు రుక్మేశ్వరశాస్త్రులను అన్నగారు గొప్ప విద్వాంసుఁడుండేను. వీరిరువురును రాజకార్యవశమున నొకప్పుడు విశాఖపట్టణము వచ్చి యక్కడ శిష్యులతో స్వయంపాకము చేసికొనుచుండిరి. ఒకనాఁడు రుక్మేశ్వర శాస్త్రులు తమ్మునితో నిట్లనియె. "అబ్బీ, కూరగాయలకై బాజారునకు వెళ్ళుచున్నాను. నే నేకూర తెచ్చినను యేదో యాక్షేపము చేయుచుందువు. నీకు సరిపడు పదార్దములు నాకు తెలియకున్నవి; నేడేమి తెమ్మందువో చెప్పుము" అనెను. మంగళేశ్వర శాస్త్రులు కోపంతో నే తెమ్మన్నది తెచ్చేదరేని మాణిక్యము తెండు, అనెను. రుక్మేశ్వరశాస్త్రులు చెప్పిన శ్లోకము:--
శ్లో|| మాణిక్య క్రయణం లోకే మంగళాయ భవేత్కిల,
మంగళే సహజే స్మాకం మాణిక్యా త్కిం ప్రయోజనమ్. 269
7. మంగళేశ్వర శాస్త్రి గారికి గోపాలశాస్త్రి యను కుమారుఁడు ప్రయోజకుఁడు విద్వాంసుఁడుండేను. తండ్రి జీవించి యుండగానే యాతఁడు చనిపోయెను. ఎప్పుడును ఎల్లరను వెక్కిరించు స్వభావమే కలవాడగుటచేత గ్రామస్థులందరు నీయనను లోలోన ద్వేషించుచుండిరి. ఈయనను సాధింప వారికెన్నడును తఱి దొరకకుండేను. ఇప్పుడురా సమయ మనుకొని వారెవ్వరును శవమును మోయ రారైరి. అట్టి దుఃఖసమయ మందు కూడా యీతని చాతుర్యము కుంఠితము కాలేదు. ఇట్లనేనట: ----- కొడుకు గోపాలశాస్త్రి బ్రతికి నిర్వాహకుఁడే . చచ్చీ నిర్వాహకుఁడే యైనాడే: -- ఈ కధను విశ్వగుణాదర్శాది గ్రంధకర్త శేషయమక చక్రవర్తి అర్మాణి పాలెం వెంకటాచార్యుల పేరఁ గొందరు చెప్పుచున్నారు.
8. విజయనగర ప్రభువైన నారాయణగణపతి సన్ని ధానమునకు సమ్మానము వడయుటకై యోకప్పు డొక మాధ్వ పండితుడు వచ్చెనట. రాజుగారాయన వైదుష్యోన్మేషమును బరీక్షింపను బండితసభ కూర్పించిరి. ఎందరో పండితు లందు వచ్చి యుండిరి. మంగళేశ్వర శాస్త్రులను బ్రచ్చన్నముగా నచ్చటికి వచ్చి యుండెను. మధ్వ పండితుడు మత విషయోపన్యాసము చేయననుజ్ఞగొని యద్వైతవిశిష్టాద్త్వైతములను ఖండింప నారంభించెను. అద్త్వైతము శాబ్దప్రమాణ బాధితమని చెప్పుచు "భిదాసత్యం భిదాసత్యం భిదాసత్యమ్" అని శ్రుతి వాక్యమున్నట్టు వైదికస్వరముతోఁ బల్కెనట. తోడనే మంగళేశ్వర శాస్త్రులు "భిదాసత్య మితి యోవదతి స చండాలో భవతి స చండాలో భవతి స చండాలో భవతి" యని యంతకంటె రంజకముగా మచ్చస్వరముతో శ్రుతిరీతిని బఠించెనట! అందఱు నబ్రపడి యీయన కేసి చూచిరి. రాజుగా రభిముఖులైరి. ఎక్కడిదీ శ్రుతి వాక్య మని యడిగిరి. మంగళేశ్వర శాస్త్రులు లిట్లు పలికెను : 'ప్రభూ ! మన మధ్వాచార్యులు గారు సెలవిచ్చిన శ్రుతివాక్యము పూర్వపక్షవాక్యము. ఇది సిద్దాంతవాక్యము. రెండును ఒక యనువాకమందలివె. తొమ్మిదవ యట్టమున నున్నవి. వారు పూర్వపక్ష గ్రంధము వఱకే చదువుకొన్నారు కాఁబోలును!' కనుక నీ గ్రంధము వారు దహరింప ఁ జాలక పోయినారు. నేను తొమ్మిదవ యట్టమును బూర్ణముగా నేకరువు పెట్టఁగల్గుడును,మ అనెను. మాద్వా చార్యులు గారి ముఖము మకమక లాడెను. అంతకుముందు ప్రఖ్యాతిని బట్టి వినుకలి మాత్రమె కలిగి యున్న మంగళేశ్వర శాస్త్రులు నప్పుడు కనుకలి కలిగినందులకు సంతోషించి నారాయణగజపతి చేరిక యొసఁగి గౌరవించెను. అప్పుడు మంగళేశ్వర శాస్త్రులు లీ శ్లోకముతో రాజు నాశీర్వదించెను.
