Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 29

   
    "రాణి" అంది కీర్తి.    
    "రాణి ఆ పేరు మీ వేషానికి నప్పదేమో!" ఉమానాధ్ అన్నాడు.    
    "నపప్దు కాబట్టే అంతమంచి పేరు ఎన్నుకున్నాను." కీర్తి నవ్వుతూ చెప్పింది.    
    "అంటే....!"
    వివరించింది కీర్తి.    
    ఉమానాథ్ నవ్వాడు "బాగుంది" అంటూ మెచ్చుకోలుగ కీర్తిని చూశాడు.    
    "ఆ వూళ్ళో రహస్యంగ వుండే సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్ గ నాయక్ ని డ్యూటీలో వేస్తాను" చంద్రజిత్ చెప్పాడు. ఆ తర్వాత నాయక్ ని పిలిచి కీర్తికి పరిచయం చేశాడు.    
    నాయక్ సన్నగ నల్లగ సామాన్య రూపంతోవున్నాడు అతని బాహ్య రూపానికి కానరాని తెలివితేటలకి ఎక్కడా సంబంధం లేదు. డ్యూటీ విషయంలో చాకులాంటి వాడు.    
    కీర్తి చాలా సార్లు చాలా కేసుల్లో చాలా మందితో కల్సి పనిచేసింది. కీర్తికి నాయక్ కొత్త.
    సమావేశం పూర్తి అయింది.    
    అందరూ వారివారి కుర్చీల లోంచి లేచారు.    
    కీర్తి యింటికి వెళ్ళి గంట తర్వాత తిరిగిరావాలి. ఆ  తర్వాత డ్యూటీలో చేరినట్లే. తను ఎక్కడికి వెళ్ళేది ఎవరితో చెప్పకూడదు. ఇన్ స్పెక్టర్ శివకాంత్ మిత్రుడే కావచ్చు అయినా వివరించకూడదు. అంత సీక్రెట్ గ వుండాలి.    
    అందరి వద్ద శలవు తీసుకుని కీర్తి యింటికి బైలుదేరింది.
    
                                    20
    
    జానకీపురం రైల్వేస్టేషను ఆ మధ్యనే కొత్తగ కట్టారు. ఆ స్టేషనులో ఆగే వన్నీ ప్యాసింజర్లే వకేవక్క ఎక్స్ ప్రెస్ మాత్రం యిలా ఆగి అలా బైలుదేరుతుంది.    
    ఎక్స్ ప్రెస్ రావటం ఆగటం వెంటనే బైలుదేరటం జరిగింది.    
    మొత్తం ఆరుగురు ప్రయాణీకులు ఎక్స్ ప్రెస్ దిగారు.    
    యశ్వంత్ భట్టాచార్య కీర్తి నాయక్ గాక మరో ముగ్గురు దిగిన వాళ్ళలో వున్నారు. మిగతా ముగ్గురు ఆవూరి వాళ్ళు.    
    యశ్వంత్ భట్టాచార్య ధోవతి కట్టుకుని దానిమీద బెల్టు పెట్టుకొని పాతకోటు వేసుకున్నాడు. అది తాతల నాటి పాతకోటు అయినా దానికున్న చమ్కీలని బట్టి ఖరీదైనదని తెలుస్తున్నది. చేతికి బంగారం మురుగులు ధరించాడు. పైకి ఎగ దువ్విన జుట్టుని తల వెనక భాగంలో ముడిపెట్టుకున్నాడు ఆజుట్టు పండివుంది. అయితే అది యశ్వంత్ భట్టాచార్య జుట్టు కాదు విగ్గు అంతే, చెవులకి పెద్దసైజు వంటి రాయి దిద్దువుంది పై పెదవిని కప్పుతూ గుబురు మీసాలు వున్నాయి.    
    ఈ వేషంలో యశ్వంత భట్టాచార్య ఓనాడు బాగా బతికి ఈ నాడు చితికి పోయిన పెద్ద కుటుంబీకుడిలా వున్నాడు.    
    కీర్తి మధ్య పాపిడి తీసుకుని పూర్వం వాళ్ళు దువ్వుకున్నట్లు తలని బాగా కిందకి అణిచి పెట్టి దువ్వి వక్క జడ వేసుకుంది. జడచివర కుప్పెలు ఎర్రని రిబ్బను రెండూ వున్నాయి. పల్లెటూరి వాళ్ళు సూనే బాగా పట్టిస్తారు. అలా పట్టించింది తలకి.    
    చెవలకి జూకాలు, చేతినిండా రంగు రంగు గాజులు కాళ్ళకి పట్టాలు, మెడలో రెండు గొలుసులు, కళ్ళ నిండా కాటుక, నుదుట కల్యాణం బొట్టు, ఈ అలంకరణతో వుంది. లంగా ఓణి ధరించింది.    
    ఇప్పుడు కీర్తి అచ్చమైన పల్లెటూరి పడతిలా వుంది.    
    ఈ వేషంలో వున్న కీర్తి అలవాట్లు ఏమిటంటే పైట చెంగు అడ్డు పెట్టుకుని బొటనవేలు నోటో పెట్టుకుని చీకటం, ఎవరైనా చూస్తే గబుక్కున నోట్లోంచి వేలుతీయటం, మరోపని ఏమిటంటే నోరుతెరుచుకుని అమాయకంగ ముఖంపెట్టి ప్రతిదీ చూడటం. తెలుగు తప్ప ఏ భాషరానిదానిలా మాట్లాడటం, సిగ్గుపడకుండా నిఠారున నిలబడి మగరాయుడిలా నడవటం.    
    నాయక్ అల్లరి చిల్లరగ తిరిగే కుర్రాడిలా తయారయాడు ఫోర్త్ ఫారందాకా చదివి, డిగ్రీ చదివినవాడిలాగా ఫోజు పెట్టే రకంల వున్నాడు. నల్లటి ప్యాంటు ఎర్రటిషర్టు, బజారులో ముప్పైనలభై రూపాయలకు దొరికే చౌక రకం ఫారెన్ వాచీ పెట్టుకున్నాడు. గళ్ళరుమాలు మెడకి కట్టుకున్నాడు. నల్లద్దాల కళ్ళజోడు జేబులోంచి పైకికనిపిస్తూవుంది. చామనచాయగ సన్నగ వుండే నాయక్ ఆవేషానికి సరీగ సరిపొయ్యాడు.    
    రైలు దిగుతూనే నాయక్ చేతిలో వున్న చిన్న పెట్టె వూపుకుంటూ ఊళ్ళోకి బయలుదేరి వెళ్ళిపోయాడు.    
    రైలు దిగిన తర్వాత వాళ్ళు ముగ్గురు కూడా పెట్టెబేడ పుచ్చుకుని వెళ్ళిపోయారు.    
    స్టేషనులో యశ్వంత్ భట్టాచార్య కీర్తి మిగిలారు. వాళ్ళ పక్కన చిన్న సూట్ కేసు ఒక సంచి వున్నాయి. మంచి నీళ్ళకి ఇత్తడి మరచెంబు వుంది. వాళ్ళు ఎప్పుడైతే వేషాలు మార్చుకున్నారో అప్పుడే అలవాట్లు, పేర్లు, భాష, మారి పొయ్యాయి.    
    "నేను రాను తాతయ్యా! వెళ్ళిపోదాం" గారాలు పోతూ అంది కీర్తి.    
    "నా బంగారు తల్లికదూ! ఓ సారి అక్కయ్య వాళ్ళింటికి వెళ్ళిచూసి వద్దాం. ఎంత పెద్దయింట్లో తెలుసా! చాలా బాగుంటుంది. అక్కయ్య నిన్ను చూడాలని మరీమరీచెప్పింది." బతిమిలాడుతున్నట్లుగ అన్నాడు యశ్వంత్ భట్టాచార్య.    
    కాసేపు బతిమిలాడించుకుని కీర్తి బయలు దేరింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS