Previous Page Next Page 
డేంజర్ డేంజర్ పేజి 28

   
    కీర్తి ఫోను పెట్టేసి బూత్ లోంచి బైటికి వచ్చింది.    
    త్రీ టైమ్స్ బీమ్ బీమ్ అన్నా, వాళ్ళు నో...నో... ఫోర్ టైమ్స్ అని చెప్పినా ఈ కోడ్ ఎవరికీ తెలియదు. కోడ్ ని డీకోడ్ చేయటానికి కూడా వీలు కాని కోడ్ అది.    
    కీర్తి ముందుగ ఫోన్ లో కోడ్ వుపయోగించింది. వెంటనే వాళ్ళు నాలుగు సార్లు వాచీలో శబ్దం బీమ్ బీమ్ అని పించటం వల్ల ఫోర్ టైమ్స్ అనిచెప్పారు. అది కరెక్ట్ కావటంతో మరోపావుగంటలో మీ ముందు వుంటానని కీర్తి తెలియజేసింది. అప్పుడు వాళ్ళనుంచి వచ్చేది వకేవక మాట.    
    "ఎదురు చూస్తూవుంటాము."    
    అంటే వున్న పళాన వచ్చేయ వచ్చు అని.    
    "పది నిముషాలలోరాలేవా!"    
    అంటే మాత్రం వేషం మార్చుకుని రమ్మని. ఈ రెండు కూడా కోడ్ లోని భాగమే.    
    బూత్ లోంచి బైటికి వచ్చి రిక్షా ఎక్కింది కీర్తి.    
    కీర్తికిప్పుడు చాలా వుషారుగ వుంది. ఆ వుషారుకి కారణం మళ్ళీ కేసుతగల బోతున్నదని.    
    కీర్తికి డ్యూటీ అంటే ప్రాణం.    
    కీర్తి రిక్షాదిగి పక్క వీధిలోకి నడిచి వెళ్ళింది వేషం మార్చుకోనవసరం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళకుండా సరాసరి ఆఫీసుకి వచ్చింది.    
    పెద్ద బిల్డింగ్ లో ఎరువులు, విత్తనాలు అన్ని గ్రామాలకి రవాణా చేసే సరుకు ఆ ఆఫీసులో నిలువవుంటుంది. ఆయింటి ముందు బోర్డ్ కూడా అలా రాశి వుంటుంది. కాని లోపల రహస్యంగ సమావేశం అయేది మాత్రం కొందరు సి.ఐ.డి.లు.    
    కీర్తి వెళ్లేసరికి డైరెక్టర్ చంద్రజిత్, ఒక పోలీసు ఆఫీసరు, స్పెషల్ సి.ఐ.డి అధికారినన్నాఘోష్, మరో సి.ఐ.డి యశ్వంత్ భట్టాచార్య ఏదో విషయం చర్చించుకుంటూ వున్నారు.    
    "నీ విషయమే అనుకుంటున్నాము." డైరెక్టర్ చంద్రజిత్ చిరు మందహాసం చేస్తూ అన్నాడు.    
    యశ్వంతు భట్టాచార్య తన పక్కనున్న చెయిర్ చూపించాడు కీర్తిని కూర్చోమని.    
    "చెప్పండి." అంది కీర్తి వెంటనే రంగంలోకి దిగుతూ.    
    స్పెషల్ సి.ఐ.డి అధికారి నన్నా ఘోష్ అందించిన రహస్య రిపోర్ట్ తాలూకా ఫైలు కీర్తి ముందువుంచి "ఒక్క సారి ఆ ఫైలు తిరగెయ్యి" అన్నాడు చంద్రజిత్.    
    కీర్తి ఫైలు తెరిచి మొత్తం దానిలో వున్న పది కాగితాలు జాగ్రత్తగా చూసింది. కాగితాలుగాక ఓ భవంతి ప్లాను ఓ ఫామిలీ తాలూకా ఫోటోలుకూడా అందులో వున్నాయి. వాటినికూడా చూసింది.    
    కీర్తి ఫైలు మూసేస్తూ చెప్పండి అంది.    
    "జానకీపురంలో మాజీ జమిందారు భవనం అది. విషయమేమిటంటే__డైరెక్టర్ చంద్రజిత్ చెపుతుంటే కీర్తి అడ్డుతగిలి "కేసుని వివరంగా చదివాను కదా! చెయ్యవలసింది చెప్పండి" అంది.    
    "గుడ్, టైమ్ వేష్ట్ చెయ్యవుకదా!" మెచ్చికోలుగ అని "ఈవెనింగు నన్నాఘోషు ఈ ఫైలు తయారుచేసి తీసుకొచ్చారు. ఈ కేసు నీకు అప్ప గించమనియశ్వంత్ భట్టాచార్య సూచించారు. ఉమానాథ్ నీకు సాయపడతానన్నారు. నీవు రేపే జానకీపురం వెళ్ళాలి" అన్నాడు చంద్రజిత్.    
    "నేను సిద్దంగానే వున్నాను. "కీర్తి ఉత్సాహంగ అంది.    
    "నాకు తెలుసు అందుకే ఈ కేసులో పనిచెయ్యటానికి నిన్ను ఎన్నుకున్నాము."    
    "థాంక్స్" అంది కీర్తి.    
    చంద్రజిత్ ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలన్నది వివరించాడు.    
    కీర్తి జాగ్రత్తగ వింది.    
    "యశ్వంత్ భట్టాచార్య నీతో వచ్చి నిన్ను అక్కడదిగబెట్టి తిరిగి సాయంత్రం వచ్చేస్తాడు. ఆయింట్లో వాళ్ళందరిమధ్య నీవు వంటరిగానే వుండాలి. మన తాలూకా వ్యక్తిని ఆ వూళ్ళో వుంచుతాము. నీవు ఏదైనా వార్త అందించ గలిగిన రోజు అతనికి అందిస్తే అది మాకు అతని ద్వారా అందుతుంది. ఈ వింత కేసుని నీ వొక్కదానివే పరిష్కరించ వలసిరావచ్చు అన్నింటికి సిద్దమయ్యే బయలుదేరాలి."    
    "నేను ఎప్పుడు దేనికైనా సిద్దమే. నాకు కావాల్సిందల్లా అది కేసు అవునా కాదా అంతవరకే" కీర్తి నవ్వుతూ అంది.    
    "గుడ్" చంద్రజిత్ తృప్తిగ తల పంకించాడు. "అనుమానాలు ఏమైనా వుంటే తీర్చుకుంటే యింక నలుగురం కలసి ప్లాను తయారుచేద్దాం" అన్నాడు.    
    "ప్రస్తుతం లేవు. మన ప్లానులో ఏదైనా అనుమానం వస్తే అప్పుడు మధ్యలో చర్చించుకుంటే సరిపోతుంది కదా!" కీర్తి అంది.    
    "అదేమంచిది" పోలీసు ఆఫీసరు ఉమానాథ్ అన్నాడు.    
    కీర్తి యిక్కడ బైలుదేరటం మొదలు అక్కడ చేయవలసింది ఏమేమిటన్నది మొదట చర్చించుకున్నారు. పధకం విఫలం అయితే చేయవలసింది ఏమిటి? తీసుకోవలసిన జాగ్రత్త గురించి మాట్లాడుకున్నారు నలుగురు కలసి.    
    జానకిపురంలో మాజీ జమిందారు రంగ మార్తాండ ఇంట్లో కీర్తి ఎలా ప్రవేసించేది చక్కటి పధకం తయారయింది. పధకం తయారు చేసేటప్పుడే అనుమానాలు తీర్చుకున్నారు.    
    "ఇంకేమీ సందేహాలు లేవుగా!" చంద్రజిత్ అడిగాడు.    
    "ఉహో" అంది కీర్తి.    
    "ఆ యింట్లో నీ పేరు...!" చంద్రజిత్ అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS