"కానీ ఆంటీ! నేనేమీ మీలా నష్టపోలేదు. మీరు మీ జీవితాన్ని చేజేతులా పాడుచేసుకున్నారు." సూటిగా అంది అనూష.
"అవును. తెలిసి చేసిన దానికి ఎవరైనా అనుభవించవలసిందే! కానీ, మీరు తెలిసీ తెలియని వయసులో వున్నారు. మీరు కూడా నాలా మీ జీవితాలను నాశనం చేసుకోకూడదనే నా కన్నీటి గాధను చెపుతున్నాను..." బిందుమాధవి కళ్ళు చెమర్చాయి.
ఆమె మనసు మరల గతంలోకి వెళ్ళింది.
* * * *
వేంకటేశ్వరుని సాక్షిగా శోభనాద్రి బిందుమాధవి మెడలో మూడు ముళ్ళూ వేశాడు.
ఆ క్షణం నుంచి ఆమెమీద అతనికి సర్వ హక్కులు ఏర్పడినాయి.
ఆ తరువాత ఒక రోజున జరిగిన సంఘటన బిందుమాధవి జీవితాన్ని మరొక మలుపు తిప్పింది.
ఆ రాత్రి....అన్ని రాత్రుల్లా యధావిధిగా కలలా మిగిలిపోతే ఆమెకు ఎంతో ఆనందించేది. కాని ఆ రాత్రి ఆమె పాలిట కాళరాత్రి అయింది!
"బిందూ! ప్లీజ్, నా మాట కాదనకు. మన నుదుటిరాత మారాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా అంతా నీ చేతుల్లోనే వుంది."
సుతిమెత్తగా మాట్లాడుతున్న శోభనాద్రిని ఆ క్షణంలో చూడడానికే అసహ్యం వేసిందామెకు.
అతని వ్యూహం పూర్తిగా అర్థమయిందామెకు. తనివితీరా ఏడవాలని ఉంది. కాని కళ్ళలో నీరు ఇంకిపోయింది. ఉన్నపళాన చనిపోతే ఎంత బాగుణ్ణు! కాని చావు రాదే!
కళ్ళ ముందే జరుగుతున్న దారుణాన్ని చూస్తూ ఇంకా తను ఎందుకు బతికి ఉందా అని ఆమె మనసు ఆక్రోశించింది. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని స్థితిలో శిలలా ఉండిపోయింది.
"థాంక్యూ బిందూ! థాంక్యూ!" ముద్ద ముద్దగా మాట్టాడి పక్క గదిలోకి వెళ్ళాడు.
"మౌనం అంగీకారమే! మీరిక లోపలకు వెళ్ళవచ్చు. అయితే ముందు మనం అనుకున్న ప్రకారం ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి, డబ్బివ్వండి!" ఆశగా చేయి జాచాడు శోభనాద్రి.
"భలేవారే! నీ మాట కాదంటానా?" అంటూ సూట్ కేసు తెరిచి నోట్ల కట్టలను అతని చేతికి అందించాడు ప్రచురణ కర్త విశ్వనాథ్. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి గదిలోకి వెళ్ళాడు.
బయట శోభనాద్రి గడియ పెట్టాడు.
బిందుమాధవిలో చలనం వచ్చింది.
మరికొద్ది క్షణాలు అక్కడే, అలాగే ఉంటే ఏం జరుగుతుందో ఊహించడానికే జుగుప్సాకరంగా ఉంది.
కర్తవ్యాన్ని గుర్తించింది. వెంటనే పెరటి వైపు పరుగెత్తి గోడ ఎక్కి అవతలి వైపుకు దూకింది.
కొంచెం దూరంలో మెయిన్ రోడ్డు కనిపించింది. దూరంగా వేగంగా వస్తున్న చిన్న కారును గమనించింది బిందుమాధవి.
హఠాత్తుగా చిన్నకారుకు ఎదురు వచ్చిన బిందుమాధవిని గుద్ది ఒక్క చిన్న జర్క్ ఇచ్చి ఆగిపోయింది కారు.
ఆమె ఆ షాక్ కు స్పృహ కోల్పోయింది.
తరువాత జరిగిన సంఘటనలను అనూష, సాహితి చూచాయగా ఆలోచించసాగారు.
సాహితి తండ్రి రావుగారు ఆమెను ఆసుపత్రిలో చేర్పించి రక్షణ కల్పించడం, అతని మరణానంతరం బిందుమాధవి సాహితి ఆలనాపాలనా చూడటం అంతా సాహితికి గుర్తు వచ్చింది.
జీవన సంద్రంలో ఎన్నో ఆటుపోట్లను భరించి, ధైర్యంగా, ఒంటరిగా ఈ సమాజంలో మనగలుగుతున్నది బిందుమాధవి.
ఆమెకున్న ధైర్యంలో, ఆమె ఎదుర్కొన్న సమస్యలలో తనవి ఏపాటివి?
ఆమె జీవితంలోని చేదు అనుభవాలు వినడానికే భయంకరంగా ఉన్నాయి. ఇక అనుభవంలో ఎలా ఉంటాయో ఊహించలేననుకుంది అనూష.
"ఆంటీ! మరి శోభనాద్రి...." అతని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో అడిగింది అనూష.
"ఇంకెక్కడి శోభనాద్రి? జరిగిన సంఘటనకు ముసలి గుండె కాస్తా ఆగిపోయింది. అతని పాపం అలా పండింది!" అంది కసిగా బిందుమాధవి.
విశ్వనాథ్ కొడుకు సమ్రాట్ అంటే బిందుమాధవి ఎప్పుడూ మండిపడటానికి కారణం బోధపడింది సాహితికి.
అయినా తండ్రి లక్షణాలు కొడుక్కు రావాలని ఎక్కడుంది? బిందుమాధవి లేనిపోనివి ఊహించుకుని, తన భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందుతున్నదనుకుంది సాహితి.
"గతాన్ని గుర్తుచేసి మిమ్మల్ని బాధపెట్టినట్టున్నాను. ఇక నేను వెళతాను ఆంటీ!" అంటూ అనూష కుర్చీలోంచి లేచింది.
సరిగ్గా అదే సమయంలో శ్రీపతి, ఇన్ స్పెక్టరు వీరేష్ రంగప్రవేశం చేశారు.
"అనూష ముఖం వెలవెలబోయింది.
బిందుమాధవి వాళ్ళిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.
అనూష బిందుమాధవి ఆంతర్యాన్ని అర్థం చేసుకుంది.
తనను నమ్మించి తన తండ్రిని, ఇన్ స్పెక్టరును పిలిపించడంలో బిందుమాధవికి కలిగే లాభమేమిటో ఎంత ఆలోచించినా ఆ సమయంలో అర్థం కాలేదామెకు.
పరిస్థితిని గమనించి వడివడిగా గుమ్మం దాటింది అనూష.
ఒక్క ఉదుటున వచ్చిన శ్రీపతి దారికి అడ్డు నిలిచి, ఆమె చేయి పట్టుకున్నాడు.
అనూష తండ్రి పట్టును విదిలించుకోడానికి ప్రయత్నించింది.
"ఉండు అనూషా! మీ నాన్నగారితో మాట్లాడుదువు!" పరిస్థితిని గమనించి అంది బిందుమాధవి.
అనూష ఆమెవైపు తీక్షణంగా చూసింది. "నాన్ సెన్స్! నేను ఎవరితోనూ మాట్లాడవలసిన అవసరం లేదు. నా దారిన నన్ను వెళ్ళనివ్వండి!" ఆవేశంగా అంది.
"నోరు మూసుకుని ఇంటికి పద! ఇంతవరకు చేసిన నిర్వాకం చాలు!" శ్రీపతి ఆవేశంగా అంటూ, ఆమె చేయి పుచ్చుకుని కారు దగ్గరకు లాక్కువెళ్ళడానికి ప్రయత్నించాడు.
"చూడమ్మా అనూషా! మీ నాన్నగారు చెప్పినట్టు వినడం మంచిది. మీ కుటుంబం గొడవలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవడం ఉత్తమం. వెంటనే నువ్వు మీ నాన్నగారి వెంట ఇంటికి వెళ్ళడం బాగుంటుందని నా సలహా!" నచ్చచెపుతున్నట్టు ఇన్ స్పెక్టర్ వీరేష్ అన్నాడు.
