ఒక అయిదారుగురు మాత్రం టీ బంకు దగ్గర వున్నారు.
పుండరీకాక్షయ్య అక్కడవన్నీ పరిశీలించడం పూర్తి అయిన తరువాత, "ఇక్కడ పద్నాలుగో మైలురాయి ఏది అడిగాడు.
"ఇక్కడ పధ్నాలుగో మైలురాయి ఎందుకు వుంటుంది. తిరిగి ప్రశ్నించాడు ముత్యాలరావు.
"అదేమిటీ? మీరే చెప్పారుగా పధ్నాలుగో మైలురాయి దగ్గర దిగాలని!"
"ఇక్కడ దిగాలంటే, పధ్నాలుగో మైలురాయి దగ్గర దిగాలని బస్సు కండక్టర్ తో చెప్పాలి. అప్పుడు బస్సు ఇక్కడ ఆపుతారు. అంతవరకే నాకు తెలుసు. పధ్నాలుగో మైలురాయిని నేను ఎప్పుడూ చూడలేదు" అన్నాడు ముత్యాలరావు సమాధానంగా.
పుండరీకాక్షయ్య ఒక పట్టాన దేనినీ వదలడు.
"ఈ వూరి పేరేమిటి?" అన్నాడు.
"పధ్నాలుగో మైలురాయి!" తడుముకోకుండా జవాబిచ్చాడు ముత్యాలరావు.
"పధ్నాలుగో మైలురాయి అనేది గుర్తుగా వున్న రాయి పేరు. అంతేకాని వూరి పేరు ఎట్లా అవుతుంది?" అన్నాడు పుండరీకాక్షయ్య.
"వూరిపేరు కాకూడదని ఎక్కడయినా వుందా? రోకళ్ళ పాలెం, వానపాముల, గరికె పాలెం అలాంటి పేర్లు ఊర్లకి వుండగా ఇలాంటి పేరు ఈ వూరికి వుండకూడదని ఎక్కడ వుంది? ఈ వూరికి కూడా ఏదన్నా కధా కమామిషు వుందేమో, ఎవరినైనా అడిగి చూడండి తెలుస్తుంది" అన్నాడు ముత్యాలరావు.
"కాసిన టీ నోట్లో పోసుకుని గుంటూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో బంకులో కనుక్కుని వస్తాము. మీరు కూడా టీ త్రాగే టట్టయితే మాతో కూడా రండి. లేకపోతే ఇక్కడ కూర్చొని వుండండి" అన్నాడు పర్వతరావు.
"కాసేపు ఆగి చూస్తాను. మీరు వెళ్ళిరండి" అన్నాడు పుండరీకాక్షయ్య. రోడ్డు వారగా వున్న రాతి గుట్ట మీద కూర్చుంటూ.
పర్వతరావు, ముత్యాలరావు టీ త్రాగటానికి టీ బ్యాంకు దగ్గరకు వెళ్ళారు.
టీ బంకులో నుంచొని పునుగులు, బజ్జీలు తింటూ టీ త్రాగుతున్నారు పర్వతరావు, ముత్యాలరావు.
వారిద్దరినీ చూడంగానే తనుకూడా ఏదన్నా నోట్లో వేసుకుని, కాస్త టీ త్రాగుదామనిపించింది పుండరీకాక్షయ్యకి.
"బస్సులు మారి రావటం వల్ల టికెట్టుకి అనవసరంగా ఎక్కువ డబ్బు అయింది. బ్యాగ్ లో హల్వా, చెగోడీలు, ఇంక స్వీట్లు తదితర పదార్ధాలు వున్నాయి. తీపి వస్తువులు తను ఎలాగూ తినడు. చంద్రానికి పంపిస్తున్న వాటిలో నాలుగు చెగోడీలు తిని, ఒక గ్లాసెడు టీ త్రాగితే సరిపోతుంది కదా అనుకున్న పుండరీకాక్షయ్య పచ్చ బ్యాగ్ కున్న జిప్పు కొద్దిగా తెరిచాడు." పార్వతి ఎంతో కష్టపడి పిల్లవాడికి పదార్ధాలు చేసి పంపించింది. వాటిల్లోవి తను తీసుకు తినటం ఏమిటి? ఛా! అది మంచి పని కాదు. అయిన ఖర్చు ఎలాగూ అయింది. అప్పుడే ఏదయినా కాస్త తింటే సరి అనుకున్నాడు.
పార్వతికి కొడుకికి పంపుతున్న చెగోడీలను తినటానికి మనస్కరించలేదు పుండరీకాక్షయ్యకి. బ్యాగ్ జిప్ మళ్ళీ వేసేశాడు.
బ్యాగ్, గొడుగుతో మళ్ళీ టీ బంకు దగ్గరకి బయలుదేరాడు.
టీ బంకులో రెండే రెండు పునుగులు, బజ్జీలు తిని, అవి కాకుండా అక్కడ కాఫీ కూడా వుండటంతో, కాఫీ తాగాడు పుండరీకాక్షయ్య.
గుంటూరు వేపు వెళ్ళే బస్సు ఇంత క్రితమే వెళ్ళటం వల్ల మరోగంట దాకా రాదని తెలుసుకున్నారు. గంట కొచ్చిన రెండు గంటల కొచ్చినా చేసేదేమీ లేదు కనుక, లోకాభి రామాయణం మాట్లాడుకుంటూ అక్కడే కూర్చున్నారు.
ముప్పావు గంట తరువాత గుంటూరు వెళ్ళే బస్సు వచ్చింది. ముగ్గురూ బస్సు ఎక్కారు. వీళ్ళ ముగ్గురూ కాక, అక్కడే కూర్చున్న మరో ఇద్దరు కూడా అదే బస్సు ఎక్కారు.
