కాంతమ్మకు ఆలోచనల సంతృప్తిలో భుక్తాయాసం కాస్త ఇట్టే ఎగిరిపోయింది.
వియ్యాలవారు ఏ వేళప్పుడు వస్తారో ఏమో? కాంతమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళింది.
కాఫీ పౌడరూ, పంచదారా వున్న డబ్బాలు చూసుకుంది. ఇంత మినపప్పు నీళ్ళలో వేసింది.
"ఒసే అమ్మాయ్!"
"........"
"నిన్నేనే?"
"అబ్బబ్బ ఏమిటే ఒక్కక్షణం చదువుకోనివ్వవూ?"
"ఇప్పుడేం చదువే? ఆ పత్రిక అవతల పారేసి తల దువ్వుకో. ఆఁ మొన్న నాన్న గుంటూరు నుంచి తెచ్చిన గులాబి రంగు పట్టుచీర కట్టుకో. త్వరగా లే!" కూతుర్ని ఉత్సాహంగా హెచ్చరించింది.
"ఇప్పుడా పట్టుచీర ఎందుకే?" పుస్తకంలో నుంచి తల పైకెత్తి ఆశ్చర్యంగా ప్రశ్నించింది తార.
"ఎందుకేమిటే? వాళ్ళు ఏ వేళప్పుడొస్తారో ఏమో? ఊఁ త్వరగా లే!"
తారకు అర్థం కాలేదు. అయోమయంగా చూసింది.
"ఏమిటే అలా చూస్తావ్? వియ్యాలవారు వస్తున్నారులే. వెళ్ళి తల దువ్వుకో."
అంతలోనే వీధి వాకిట్లో గుర్రపు బండి ఆగిన శబ్దం అయింది.
ఎవర్నో పిలుస్తున్నట్టు విన్పించింది.
"అయ్యో రానే వచ్చారు. ఒసే పిల్లా! నువ్వు లోపలకు వెళ్ళవే! త్వరగా ముస్తాబవు" కూతుర్ని హెచ్చరించి కాంతమ్మ పరుగు పరుగున వీధి వాకిట్లోకి వచ్చింది.
బండిలో నుంచి ఓ బుర్ర మీసాల మొహం బయటకి తొంగి చూసింది.
"మంగపతి గారిల్లు ఇదేనా అండీ?" బుర్ర మీసాలు ప్రశ్నించాయి.
"ఇదే రండీ" అంటూ కాంతమ్మ సగం శరీరానికి పైగా తలుపు చాటుకు లాక్కుంది.
బండిలోనుంచే బుర్రమీసాలాయనా, ఓ యువకుడూ మరో నడివయసు వ్యక్తీ దిగారు.
యువకుడు కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాడు. జుట్టు మెడలదాకా పెంచుకున్నాడు. ముఖాన్ని కొంత జుట్టు కప్పేస్తూ వుంది. బెల్ బాటం ఫాంటూ, చిన్న చిన్న నల్ల పువ్వులున్న తెల్ల షర్టూ వేసుకున్నాడు.
కాంతమ్మ కళ్ళు వెడల్పు చేసుకొని యువకుణ్ని చూసింది.
వచ్చిన వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇచ్చింది కాంతమ్మ.
కాళ్ళు కడుక్కొని కుర్చీలో కూర్చుంటూ "మంగపతిగారు ఏరండీ?" అని అడిగాడు బుర్రమీసాలాయన.
"ఊరు వెళ్ళారు. సాయంకాలానికి తిరిగొస్తారు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి! ఈ లోపల ఆయన వచ్చేస్తారు." అని చెప్పి కాంతమ్మ పక్కగదిలో రెండు మంచాలు వాల్చి పక్కలు వేసింది.
వచ్చిన వారిలో పెద్దవాళ్ళిద్దరూ ప్రయాణపు బడలికతో వున్నారు. పడుకుంటూనే నిద్రపోయారు.
యువకుడు మాత్రం కూని రాగాలు తీస్తూ, మధ్య మధ్య దేనికోసమో వెతుకుతూ హాల్లో పచార్లు చేస్తున్నాడు.
కాంతమ్మ ఫలహారాలు చేసే ప్రయత్నంలో పడి పోయింది.
తార ముస్తాబై తల్లి పక్కగా వచ్చి కూర్చుంది.
కాంతమ్మ కూతుర్ని కళ్ళారా చూసుకుంటూ మురిసిపోయింది.
"అబ్బాయిని చూశావా?"
తార బుగ్గలు కెంపు లైనాయి. "నేనెక్కడ చూశానేం?" సిగ్గుతో ముఖం దాచుకొని అన్నది.
"ఆ అబ్బాయి ఒంటరిగా వున్నట్టున్నాడు. వెళ్ళి మాట్లాడు." ముసిముసిగా నవ్వుకుంటూ కూతురితో అన్నది కాంతమ్మ.
"నేను వెళ్ళను బాబూ! నాకు సిగ్గు!"
"మా తల్లివిగదూ! బాగుండదు. వెళ్ళమ్మా!" తల్లి బతిమాలింది.
తారకు వెళ్ళాలనే వుంది. పైకి మాత్రం వెళ్ళడం ఇష్టంలేనట్టు ముఖంపెట్టి బయటకు వచ్చింది.
