Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 29


    "ఏ పుట్టలో ఏ పాముందో వీడిని నమ్మకండి సార్!" మధ్యలో అహోబిలం కల్పించుకొని అన్నాడు.

    "నిన్ను మాట్లాడవద్దన్నానా లేదా? ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎవరిని అనుమానించాలో, ఎవరిని అనుమానించకూడదో ఆ మాత్రం నాకు తెలియదా. నేను ఏం చేసినా ఫర్ ఫెక్టుగా చేస్తాను. ఇస్తే మంచి సలహాలు ఇవ్వు. లేకపోతే మవునంగా వూరుకో" అంటూ అహోబిలాన్ని కోప్పడుతూ వుంటే, అతగాడి ముఖం చిన్నబోయింది.


    గొణుక్కుంటూ ముఖం ప్రక్కకి తిప్పేసుకున్నాడు కానిస్టేబుల్ అహోబిలం.


    ఆ తరువాత,


    నన్ను ఇంటరాగేట్ చేయటం పూర్తయింది. తిరిగి సెల్ లోకి తీసుకువచ్చి వదిలిపెట్టారు.


    బ్రతుకుజీవుడా అనుకున్నాను.


                                             14


    "హమ్మయ్య" అన్నాడు రామ్ సింగ్.


    "అప్పుడే 'హమ్మయ్యా' అని హాయిగా వూపిరిపీల్చకు బ్రదర్! మనం ప్రస్తుతం వున్నది ఆ అత్తారింట్లో కాదు, ఈ అత్తవారింట్లో. పోలీసులతో వ్యవహారం అంటే కొరివితో తల గోక్కోవటం లాంటిది. ఈ సత్యం నిద్రలో కూడా మర్చిపోకు" పద్మాసనం వేసుకు కూర్చుని తీరుబడిగా శెలవిచ్చాను.


    "ఇప్పుడే కదా భాయ్! మనకేం ఢోకా లేదని చెప్పావ్!"


    "చెప్పటం తేలిక కాబట్టి చెప్పాను. మనిద్దరినీ ఇంటరాగేట్ చేయటం పూర్తయింది. మనం అమాయకులమని అమాయకంగా నమ్మాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. అంతవరకూ బాగానే వుంది. మనల్ని చాలా తేలికగా వదిలి పెడతారు. ఆ నమ్మకం కూడా నాకుంది. కానీ, నా సిక్త్ సెన్స్ వుంది చూశావ్! ప్రమాదాన్ని శంకిస్తూ రెడ్ సిగ్నల్ చూపిస్తున్నది. ఆపదకు చిహ్నంగా గీర్, గీర్ మంటూ శబ్దాలు వినపడుతున్నాయ్...."


    నా మాటలు పూర్తికాకముందే, తీరుబడిగా పడుకున్న రామ్ సింగ్ గబుక్కున లేచి కూర్చున్నాడు. "నాకు ఒళ్ళు మండిపోతున్నది అన్నాడు కోపంగా.


    "జైళ్ళల్లో కూడా ఎ.సి. సెల్స్ (రూమ్స్) వుండాలని ఆమరణ నిరాహార దీక్ష చేద్దామేమిటి?" నవ్వుతూ అన్నాను.


    "ఈ విషయంలో నిరాహారదీక్ష చేస్తే ఆ ప్రయత్నం ఫలిస్తుందో లేదో నీ సిక్త్ సెన్సు చెప్పటంలేదా?" వ్యంగ్యంగా అడిగాడు రామ్ సింగ్.


    ఆ ప్రశ్నకి జవాబివ్వకుండా దాటవేస్తూ, "నీ సిక్త్స్ సెన్సు మీద నమ్మకం ఉండబట్టే నాకు ఒళ్ళు మండటం జరిగింది. అదలా వుంటే ఓ ప్రక్క నాకు ఏ చాదస్తాలూ, నమ్మకాలూ లేవంటావ్! ఈ సిక్త్స్ సెన్స్ ల మీద, సెవెన్ సెన్సుల మీదా ఈ నమ్మకాలేమిటి?"


    "చెప్పినా నీకు అర్థంకాదులే భాయ్! అది వేరూ, ఇది వేరూ" మాట దాటవేస్తూ అన్నాను.


    "నీ సిక్త్స్ సెన్సుకీ, సెవెన్ సెన్సుకీ, ఇంకేమన్నా వుంటే అన్నింటికీ నా శతకోటి నమస్కారాలు. ఇంక ఆ విషయం వదిలేసి కొంచెంసేపు ఇంకేమన్నా మాట్లాడు" రామ్ సింగ్ నాకో నమస్కారం పడేసి అన్నాడు.


    "ఏ విషయం మాట్లాడమంటావ్? నువ్వే చెప్పు!" అన్నాను నవ్వుతూ.


    "నాకు తోచకనే కదా! నిన్ను అడిగేది" రామ్ సింగు బుర్ర గోక్కుంటూ అన్నాడు.


    "అయితే ఒక పని చేద్దాం. దొంగ అన్న పేరు కలిపిన సినిమాలు హిట్ అవుతున్నాయని ఈ మధ్య ప్రతి సినిమాకీ దొంగ అన్న పేరు కలిసేలా పేరు పెడుతున్నారు. దొంగ తరువాత అంత పేరు పొందింది మొగుడు అన్న పదం. ఈ రెండూ కలిపి మనం పేర్లు తయారుచేద్దాం. కాలక్షేపంగా వుంటుంది. బయటకెళ్ళిన తరువాత ఈ పేర్లను ఏ సినీ నిర్మాత కయినా అమ్మి నాలుగు కాలాల పాటు హాయిగా వుందాము" అన్నాను.


    "ఇదేదో బానేవుంది" అని అప్పటి కప్పుడు ఆలోచనలో పడిపోయాడు రామ్ సింగు.


    అయిదు నిముషాల తరువాత_


    పరాచికాల మొగుడు, మొగుడికి మొగుడు, పక పాకాల మొగుడు, మొగుడే దొంగయితే, దొంగే మొగుడైతే అంటూ ఒక అరడజను పేర్లు రామ్ సింగు నాకు వినిపించాడు.


    "ఏ నిర్మాతా ఇలాంటి పేర్లు తీసుకోడు సరికదా, ఇలాంటి పేర్లు వినిపించినందుకు వాడి బుర్ర తిరిగి మన బుర్ర రామ కీర్తన పాడిస్తాడు. పేర్లు ఎప్పుడూ కన్ ఫ్యూజ్ గా వుండాలి. ఆకర్షణీయంగా వుండాలి. పదే పదే ఆ పేరు పట్టుకుని ఒకటికి పదిసార్లు అనుకునేలాగా వుండాలి. ఉదాహరణకి 'నా మొగుడే మగవాడైతే, దొంగ చేరిన నేరం, హత్య చేసిన హంతకుడు' ఇలా వెరైటీగా వుండాలి పేర్లు. అంతేకాని సన్యాసి రాజ్యంలోని సామాన్య పౌరుడిలా పనికిమాలిన పేర్లు పెడితే ఎలా?" అంటూ ముద్దుగా కోప్పడ్డాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS