Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 28


    ఇలాంటి అనుమానం ఆహోబిలానికి వచ్చినందుకు అతగాడిని నమిలిమింగేయాలన్నంత కోపం వచ్చింది.


    ఎక్కడయినా కోపం ప్రదర్శించవచ్చు గాని, పోలీసువాడి ముందు కోపం ప్రదర్శించ కూడదు.


    ఇక్కడ మాత్రం తనకోపమే తన శత్రువు అన్నమాట అక్షరాలా నిజం.


    అందుకనే పూర్తిగా తగ్గిపోయి, "మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పూర్తిగా నిజం సార్! మీరు తెలివిగలవారు. కాస్త ఆలోచించి చూడండి! అబద్ధం చెబితే నాకేమొస్తోంది చెప్పండి సార్!" వినయంగా అన్నాను.


    ఇనస్పెక్టర్ కొద్దిసేపు ఆలోచించి, "అవును. అబద్ధం చెప్పటం వల్ల నీకేమీ లాభం రాదు. నీవు చెప్పింది నేను నమ్ముతున్నాను" అన్నాడు.


    ఇలాంటి సమయంలో థ్యాంక్స్ చెప్పేకన్నా ఒక దండం పెట్టి వూరుకోవటం మంచిదని, ఓ నమస్కారం పెట్టి వూరుకున్నాను.


    నన్నేం ప్రశ్నలు వెయ్యాలో తెలియక ఆలోచిస్తూ వుండిపోయాడు ఇనస్పెక్టర్ వర్ధనరావు.


    నేను మౌనంగా నిలబడ్డాను.


                                           13


    రెండు నిముషాల తరువాత,


    నా గురించి వివరాలు అడిగాడు వర్ధనరావు.


    ఎప్పుడయినా ఖర్మకాలి ఇలాంటి ఆపదలో చిక్కుకుంటే పోలీసు వాళ్ళని నమ్మించటానికి తప్పుడు అడ్రస్, పకడ్బందీగా ఒక పథకం ముందే నా కోసం వేసివుంచాడు బాసు.


    నేను ఒంటరివాడిని, నా అన్నవాళ్ళు నాకెవరూ లేరు. నాకంటూ ఓ చిన్నరూము, చిన్న ఉద్యోగమూ వున్నాయి. అదే వివరంగా చెప్పాను ఇనస్పెక్టర్ కి. ఒకవేళ ఆయన అక్కడికి వెళ్ళి నా రూమ్ దగ్గర నా గురించి ఎంక్వయిరీ చేసినా, నా గురించి ఏమీ తెలియదు. నాపై చిన్నమెత్తు అనుమానం కూడా రాదు. నన్నెప్పుడయితే ఇనస్పెక్టర్ అనుమానించడో, నన్ను వదిలి వెయ్యటానికి కూడా ఆస్కారం వుంది. నేను, రామ్ సింగ్ ముందు అనుకున్న విధంగానే రామ్ సింగ్ రంగూన్ నుంచి వచ్చినట్లూ, అతనికెవరూ లేరన్నట్లు వివరించి చెప్పాను.


    నేను చెప్పింది పూర్తిగా నమ్మాడు ఇనస్పెక్టర్ వర్ధనరావు.


    "బాస్ గాడు ఏ ఏరియాలో, ఏ సందర్భంలో ఎలా మిమ్మల్ని పట్టుకున్నాడు? అసలు వాడు మిమ్మల్ని బంధించే అవసరం ఎందుకు వచ్చింది?" అంటూ మరికొన్ని ప్రశ్నలు వేశాడు ఇనస్పెక్టర్ వర్ధనరావు.


    దీనికి కూడా, నేను మొట్టమొదట ఆలోచించి పెట్టుకున్న కట్టుకథ చెప్పాను.


    "నలువైపులా చీకట్లు ముసురుతున్న ఒక సాయంత్రంవేళ నేనూ, రామ్ సింగూ షికారు వెళ్ళాము అలా వూరిచివరికి. అక్కడ బాస్ తాలూకా మనుష్యులు మరో దొంగల ముఠా మనుష్యులు బ్రీఫ్ కేస్ ని మార్చుకుంటూ స్మగ్లింగ్ విషయాలు చర్చించుకుంటున్నారు. మేము రహస్యంగా వాళ్ళ వెనుకనే పొంచివుండి వెళ్ళి, వాళ్ళ గుట్టుమట్టులన్నీ కనుక్కుని విషయం పోలీసువాళ్ళకి చేరవేద్దాం అనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని కనిపెట్టినట్లున్నారు. మేము వాళ్ళ స్థావరం దాకా వెళ్ళిన వరకూ ఊరుకుని ఆ వెంటనే టకీమని ఓ పదిమంది మమ్మల్ని చుట్టుముట్టి లోపలికి లాక్కెళ్ళి బంధించాం జరిగింది.


    ఆ తరువాత మా కష్టాలు అన్నీ ఇన్నీకావు. మేము మారువేషాలు వున్న పోలీసు మనుష్యులమేమో అని, బాస్ కి అనుమానం వచ్చింది. మేము పోలీసు మనుష్యులం కాదు మొర్రో అని ఎంత చెప్పినా మరింత అనుమానించి "మీరు పోలీసు మనుష్యులు కాకపోతే క్రైం డిపార్టుమెంటు వాళ్ళయి వుంటారు. అందువల్లనే మేము ఎన్ని తన్నినా మీరు నిజం చెప్పకపోగా ఒకటే మాట చెబుతున్నారు. మీరు పోలీసువాళ్ళు అయ్యేదీ కాకపోయేది మా రహస్యాలు మీకు తెలిశాయి. కాబట్టి అన్నం నీళ్ళూ లేకుండా మీ చావు మీరు చావండి" అని చెప్పి బాస్ మమ్మల్ని ఆ గదిలో బంధించాడు. ఏ పాపం ఎరుగని మేము, మృత్యువుకి వెంట్రుక వాసి అంత దూరంలో వుండగా మీ ధర్మమా అని బ్రతికి బయటపడ్డాము......"


    అంటూ ఇన్ స్పెక్టర్ నమ్మేవిధంగా మేము ముందుగా అనుకున్న కథని శ్రవణానందంగా వినిపించాను.


    ది గ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు నేను చెప్పింది పూర్తిగా నమ్మారు.


    మరికొద్దిసేపు తన అనుమానం తీరేలా పలురకాల ప్రశ్నలు వేసి ఇంకేం ప్రశ్నలు వేయాలో తెలియక ఇక నోరు మూసుకున్నాడు.


    "మమ్మల్ని ఒదిలి పెడతారా సార్?" ఆశగా అడిగాను.


    "పిచ్చివాడా! నీవు చెప్పంగానే ఒదిలిపెడితే నేనెందుకయ్యా ఇక్కడ. మీ గురించి ఎంక్వయిరీచేసి, నీవు చెప్పినదానిలో నిజా నిజాలు తెలుసుకుని, అప్పుడు కానీ ఒదిలిపెట్టం. అందాకా అత్తవారింట్లో ఆతిథ్యం తప్పదు" నవ్వుతూ అన్నాడు వర్ధనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS