Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 28


    అక్కడ ఇసుక నేలపై రాయబడిన 'ధనుష్కోటి' పేరును చూసి డ్రగ్ ట్రాఫికింగ్ కి కారణమైన మూలవిరాటెవరో అర్థమైపోయింది.


    డాన్ జయచంద్ర అంచనా తప్పుకాలేదు. పోలీసుల దృష్టిలో ముఖ్యంగా అవినాశ్ వంటి ఒక తెలివైన పోలీసాఫీసరు ఆలోచన కూడా తప్పుదోవ పట్టేసింది హంతకుల విషయంలో.


    కారు డిక్కీలోని నెంబర్ ప్లేట్స్, సి బుక్ ని బట్టి అది రాష్ట్రానికి చెందిందీ తెలుసుకోగలిగిన అవినాశ్ దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది కారు డిక్కీకున్న చిన్న రంధ్రం.


    బేలిస్టిక్ ఎక్స్ పర్ట్ సహాయంతో ఆ రంధ్రం ప్రదీప్ రివాల్వర్ నుంచి బయటికొచ్చిన ఒకే ఒక్క బులెట్ మూలంగా ఏర్పడిందని గుర్తించగానే బోధపడింది ప్రదీప్ ఎన్ కౌంటరు ఈ కారులో ప్రయాణం చేసిన వ్యక్తులతోనే జరిగిందని.


    కేవలం రెండు గంటల వ్యవధిలో అరెస్టు వారంట్ సంపాదించిన అవినాశ్ ధనుష్కోటి కోసం ఎంతగా గాలిస్తున్నాడూ అంటే దొరికిన ఈ ఒక్క ఆధారంతో ఆ గాంగ్ లీడర్ కథ ముగిసేట్టు చేయాలనుకుంటున్నాడు.


    ధనుష్కోటి రాజకీయపరమైన పలుకుబడి తెలిసిన అవినాశ్ తనపై ఒత్తిడిని తట్టుకోవడానికి ముందే తెలివిగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరాల్ని అందించేశాడు.


    అది ప్రజల దగ్గరికి చేరిన మరుక్షణం తనపై ప్రెజర్ తీసుకురావడానికి చీఫ్ మినిష్టర్ కూడా ప్రయత్నించడని అతడికి అనుభవం నేర్పిన పాఠం.


    ధనుష్కోటి కోసం జల్లెడ వేసి గాలించాడు. కాని జాడ లేదు.


    క్షణ క్షణానికీ పట్టుదల ఉధృతమౌతుంటే డెబ్బయ్ రెండు గంటలుగా నిద్రని మరిచిపోయాడు అవినాశ్.


    సరిగ్గా ఆ సమయంలో ఫోన్ రింగ్ అయింది.


    అప్పటికే నగరం నలుమూలలా  నిజాయితీ గల కొందరు పోలీసాఫీసర్లకి ధనుష్కోటిని వెదికి పట్టుకోవడమనే బాధ్యత అప్పచెప్పిన అవినాశ్ ఉత్సుకతగా ఫోన్ అందుకున్నది పోలీసాఫీసరెవరన్నా ఫోన్ చేశారనే.


    "ఛత్రనాక రజియా రెస్టారెంట్ కెదురుగా వున్న ఫ్లాట్ నెంబర్ నాలుగులో కొందరు గూండాలు ఓ యువతిని 'రేప్ చేస్తున్నారు.' ఆ గూండాలే ముఠాకి చెందిందీ తెలిసిన జనం ఆవిడ ఆర్తనాదాలు వింటూ కూడా నిశ్శబ్దంగా వుండిపోవడంతో మీకు తెలియచేస్తున్నాను. మీరు కాస్త చేవగల మనిషని తెలిసింది. వీలైతే వచ్చి కాపాడండి."


    అవినాశ్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి.


    సివిల్ సెన్స్ లేని ప్రజల గురించి ఆలోచిస్తూ జాప్యం చేయలేదు.


    కేవలం పది నిముషాలలో ఛత్రనాక ప్రాంతాన్ని ఒక్కడే చేరిన అవినాశ్ జీప్ లో నుంచి క్రిందికి దూకి ఫ్లాట్ నెంబర్ 'ఫోర్' ని సమీపించి కాలింగ్ బజార్ నొక్కాడు.


    మూడు రోజులుగా నిద్రలేని అవినాశ్ మెట్లపై పరుగులాంటి నడకతో రావడంతో రొప్పుతున్నాడు.


    తలుపు కిర్రుమన్న చప్పుడు.


    0 38 రివాల్వర్ ని గురిపెట్టి దభేలున తలుపును తన్నాడు.


    సాయుధుడైన ఓ వ్యక్తి ముందు కనిపించాడు. అతడు తేరుకునే లోపలే డొక్కలో బలంగా తన్ని చేతిలోని స్టెన్ గన్ లాక్కున్నాడు.


    మూలుగుతూ నేలపై పడ్డ వ్యక్తిని ఓ క్షణం చూసి తలుపు మూసివున్న ఓ గదిలోకి అడుగుపెట్టబోతుండగా ద్వారం తెరుచుకోవడం, వేగంగా మరో వ్యక్తి అర్ధ నగ్నంగ బయటికొచ్చి ఆటోమేటిక్ పిస్టల్ తో అతడిపై కాల్పులు జరపడం రెప్పపాటులో జరిగిపోయింది.


    ప్రమాదాన్ని ఊహించిన అవినాశ్ ముందే నేలకి వంగిపోవడంతో బులెట్ అతడి భుజంలోంచి దూసుకుపోయింది.


    సన్నగా మూలిగాడు.


    అప్పుడు గుర్తించాడు పరిగెత్తుతున్న వ్యక్తిని ధనుష్కోటిగా.


    నగ్నంగా ద్వారం పక్కన నిలబడ్డ యువతితో ఒక పోలీసాఫీసర్ ను చూసిన భయం తప్ప మానభంగం చేయబడుతున్నట్లు తన కళ్ళలో కనిపించే ఆందోళన లేదు.


    అర్ధమైపోయింది. ఆమె ధనుష్కోటితో తన ఇష్టప్రకారం సంబంధం పెట్టుకున్న ఆడదని.


    ఎవరు ఫోన్ చేసినా, తనెందుకొచ్చినా ఇప్పుడు అవినాశ్ ఆలోచిస్తున్నది ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏక్ట్ గురించి కాదు.


    తాను గాలిస్తున్న ధనుష్కోటిని వెంటాడి పట్టుకోవాలి.


    అంతే...


    భుజం నుంచి రక్తధార కడుతుంటే పట్టించుకోకుండా వేగంగా బయటికి పరుగెత్తాడు.


    అతడు మెట్లు దిగుతున్న సమయానికే తన కారును సమీపించి ధనుష్కోటి 'జాకీ' అంటూ కేక పెట్టాడు.


    "సర్" అంటూ కారులో నిద్రపోతున్న అతని అనుచరుడు వెంటనే డోర్ తెరిచి డ్రైవింగ్ సీటులో సెటిలైపోయాడు.


    "అవినాశ్ వెంటాడుతున్నాడు. జోరుగా పోనియ్" తొందర చేశాడు.


    అప్పటికే క్రిందికి దిగిన అవినాశ్ ఎడం చేత్తో రివాల్వర్ పట్టుకుని కారు టైర్స్ పంక్చర్ చేయాలని ప్రయత్నించి విఫలుడై తన జీపుని చేరుకున్నాడు.


    ధనుష్కోటి కూర్చున్న కారు వాయువేగంతో సిటీలో దూసుకుపోతోంది.


    విపరీతంగా రక్తం స్రవించడంతో స్పృహ తప్పి పోతున్నట్టనిపించినా అవినాశ్ సడలని సంకల్పంతో కారునే ఫాలో అవుతున్నాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS