Previous Page Next Page 
ఉద్యోగం పేజి 29


                         దేవుడు కరుణించాలి


   జగన్నాధం గదినుండి బైటపడేసరికి తొమ్మిదైంది. మెట్లుదిగి పర్సు చూచుకున్నాడు. పధ్నాలుగు రూపాయలు మీద కొంత చిల్లరపైకముంది. "జీతం రావడానికి కింకా ఇరవై యేడురోజులుంది"  అనుకున్నాడు . ఆతర్వాత కొంచెం భయమూ వేసింది.    
నెమ్మదిగా గాంధినగరం చేరుకున్నాడు. హోటల్ కి వెడదామా వొద్దా అనుకుంటూనే హోటల్లోకి వెళ్ళిపోయాడు. సర్వర్ని చూచిన తర్వాత భయపడ్డాడు. కేవలం కాఫీ కే ఆర్డరిచ్చేడు.
సిగరెట్టు తీసు ముట్టించేడు. బుర్రంతా గందరగోళంగా వుంది. చేతుల్తో మొహం తుడుచుకున్నాడు. కాఫీ వొచ్చింది. తాగేడు. మళ్ళా ఆలోచనల్లో పడిపోయేడు.
' ఈ జీవితానికి సుఖం లేదు' అని చాలాతడవలనుకు న్నాడు. అలా అనుకున్నప్పుడల్లా అతని గుండెలనిండా భయం నిండుకుంది. అంత భయంకరమైన ఆలోచన  ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుకొచ్చినప్పుడు గాలిమేడలు క్టటేస్తాడు.అతను కట్టే గాలిమేడలు తమాషాగా వుంటాయి భవిష్యత్తులో ఒకానొక రోజుని బ్రహ్మాండంగా వూహిస్తాడు. దానికి కొన్ని రంగులు పులుముకుంటాడు. కాసేపు వాటితో ఆడుకుంటాడు. తెలుసు- ఆ రంగులు కాసేపటిలో కరిగి పోతాయనీ, ఆ మేడలు- కూలిపోతాయనీను.
ఏ విధమైన ఆలోచనలూ రాకూడదని అతను చేస్తోన్న ప్రయత్నం ఇంతా అంతాకాదు. ఎంత కమ్మటి ఆలోచనైనా కాసేపట్లో అతి భయంకరంగా మారిపోవడం అతని దురదృష్టమే.
హోటల్లో జనం రద్దీగా వున్నారు. గజిబిజిగా మాటలూ వినిపిస్తున్నాయి. ఐనా అతను అన్నింటికీ అతీతుడైనట్టు యా వాస్తవ ప్రపంచానికి దూరంగా వెళ్ళి అతనికై నియమింపబడ్డ విషయంలో యిరుక్కున్నాడు. ఇదే.... ఇదే అతనికి నచ్చనిది, అతను ద్వేషించేదీని.
చప్పున లేచాడు. కొంటర్ దగ్గరకొచ్చి బిల్లు చెల్లించాడు. బైటకు రాబోతూండగా అతనో మనిషి చూచి బ్రేక్ వేసినట్టుఆగిపోయేడు. కాసేపు ఆశ్చర్యపోయేడు.
కనిపించింది చిదంబరం!
బక్కగా ఎర్రగా ఎత్తుగావుండే చిదంబరం రెండేళ్ళు క్రితం బి. ఎ. లో అతని క్లాసుమేటు. గోళ్ళు గిల్లుకుంటూ క్లాసు బైటనున్న రావిచెట్టు ఆకులు లెక్కపెడుతూ పాఠాలు వినే చిదంబరం యిప్పుడు  గొప్పవ్యక్తి  అయ్యాడని ఎవరో చెప్పగా  విన్నాడు. ప్రయెజకులంతా మొదట్లో పిచ్చాళ్ళ లానే కన్పిస్తార్ట!
సూటులో ముచ్చటగావున్న చిదంబరం నల్ల కారు లోంచి దిగి ఆహోటల్ తాలూకు' లాడ్జింగ్ దారి'  తాలూకు మెట్లెక్కాడు.    
వెళ్ళేప్పుడు జగన్నాధాన్ని చూశాడుగానీ ఎంచేతో పలుకరించలేదు. చిదంబరం వెనక ఇద్దరు ఘరానా వ్యక్తులు వున్నారు. ముగ్గురూ హడావిడిగా వెళ్ళిపోయారు. వెళ్ళి మేడ మెట్లెక్కి న తర్వాత నల్లకారూ కదలింది.
సరాకుగావున్న జగాన్నాధం వేలు చురుక్కుమంది. సిగరెట్టు చివరంటావచ్చి వేలు  కాలింది.
జగన్నాధం మనసు చివుక్కుమంది.
జగన్నాధానికి ఆసూయ ఎక్కువని జగన్నాధం అభిప్రాయం. అతని  అభిప్రయాలపై అతనికి నమ్మకం ఎక్కువ.చిదంబరం బాగుపడ్డాడు. దాన్లో దాగిన రసహ్యమేవిటి?అది తెలుస్తే బాగుండి పోను.
కొందరు అదృష్టవంతులుంటారు. కొన్నాళ్ళపాటు ఆ అదృష్టజాతకం కావాలని వాయిదా వేసుక్కూర్చుంటుంది. సమయం వొచ్చినప్పుడు వరదొచ్చిన గోదారిలా ఆ మనిషిని ముంచెత్తేస్తుంది.
చిదంబరం లాంటి జాతకం తనకు వుంటే .... పేలవంగా నవ్వాడు జగన్నాధం.  జగన్నాధం సర్వసాథారణంగానవ్వడు. నవ్వితే అది నవ్వులానూ వుండదు. కొందరు నవ్వితే వెన్నెల చిందినట్టు వుంటుంది. నవ్వుకీ  మనసుకీ సంబంధముంటుంట. మనసు నిర్మలంగా నిశ్చితంగా వున్నప్పుడు నవ్వితే ఆ నవ్వు  వెన్నెల్లా, మెత్తగా, ఎదుటి వాడికి హాయిగా వుంటుంది.
అలా నవ్వాలని అతను చాలా మాట్లు ప్రయత్నంచేడు.
- జగన్నాధం రోడ్డు మిద కొచ్చింతర్వాత అనుకున్నాడు-
' ఇప్పుడేం చేయాలి'? వెధవది ప్రతీది ఒక సమస్యే  అని విసుక్కున్నాడు. మళ్ళా తనపైనతనే జాలించందాడు. జగన్నాధం బ్రతుకుతమాషాగా వుంటుంది. అతను యువకుడు. పెళ్ళికానివాడు, నిండా పాతిక సంవసత్సరాలు లేనివాడు అవునా? ఇంత పసివాడికి లక్ష సమస్యలా? మనిషిని చిత్రవధ చేసే భయంకర సమస్యలా?
మూడు ప్రాణాలు తనని నమ్ముకున్నాయి. ఆ మూడు ప్రాణాలూ అతని ప్రాణంకంటె ముఖ్యమైనవి. వాళ్ళ వూళ్ళో  అతనికి అమ్మవుంది. ఆవిడ వృద్ధురాలు. ఒక తమ్ముడున్నాడు. వాడుకోరికల కొండ. చుదువుకుంటున్న కుర్రావాడు.అభివృద్ధికి  రావలసిన వంశోద్దారకుడు. వాడి భవిష్యత్తు జగన్నాధం చేతుల్లోవుంది, ఈ పాయింటుకి జగన్నాధం మరో అప్పుడైతే సంతోషించేవాడు, గర్వించేవాడూను. కానీ- ఈ దౌర్భాగ్యుడు మరో ఆశావాదికి ఏవింధంగా సాయపడగలడని ప్రశ్నించుకుంటే దిగులు మాత్రలు మింగినట్టే అవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS