Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 28


                                        18


    కుసుమ, శ్యామలా ఇంకా తిరిగి రాలేదు. ఇంచేత అవంతికి చాలా బోరుగా అనిపిస్తోంది.


    కుసుమ అక్కడ సరోజిని మరణం అవంతిలో మరింత భావసంచలనాన్ని కలిగించింది.


    కట్నం చాల్లేదనో, లేకపోతే అది పట్రమ్మని, ఇది పట్రమ్మని, ఆడపిల్లల్ని వేధిస్తున్న మొగుళ్ళు, అత్తలు, ఆడబిడ్డలు పెరిగిపోతున్నారు.


    ఇలాంటి పరిస్థితిలో స్త్రీలకి ఆస్తిహక్కు గనక వుంచే అది మరిన్ని అనర్ధాలకి దారితీసి ఉండేది.


    ఆస్తిని పంచమనో, ఆస్తిని అమ్మమనో మరింత కాల్చుకుతినేవాళ్ళు.


    కానీ ఒక్క సంగతి ఆలోచించాలి. రూపాయికి ఓ పక్కబొమ్మ, మరోపక్క బొరుసు ఉన్నట్టే ప్రతిదానికీ మరో సమస్య ఉంటుంది.


    అంచేత ముందుకాచుకొని వున్న ప్రమాదాన్ని ముందే గుర్తించి, ఆడదానికి ఆస్తిలో హక్కున్నవాడు అత్తింట్లో ఆడపిల్లజీవితానికి ముప్పు వాటిల్లితే బహిరంగ విచారణ జరిపి దానికి బాధ్యులయిన హృదయంలేని మొగుళ్ళనీ, మానవత్వంలేని అత్తల్ని, మామల్ని, అసూయాద్వేషాలతో తోటి ఆడదానికి కీడుని తలపెట్టే ఆడబిడ్డల్ని కఠినంగా, అతికఠినంగా శిక్షించాలి. దానికి అనుగుణంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని సవరించాలి.


    అలా అనుకొన్న క్షణంలో అవంతి భృకుటి ముడిపడింది.


    అసలు ఆడదెందుచేత వంచించబడుతోంది?


    ఆడది అందంగా ఉండాలి


    ఆడది చదువుకోవాలి.


    ఆడది కట్నం ఇచ్చుకోవాలి.


    ఆడగి ఉద్యోగం చెయ్యాలి.


    ఆడది దాసీదానిలా పనిచెయ్యాలి.


    ఆడగి ఎవరేమన్నా నోరెత్తకూడదు.


    ఆడది ఎంత బాధనైనా కడుపులో మింగాలి.


    ఆడది స్వతంత్రించి ఏ పని చేయకూడదు.


    ఈ దిక్కుమాలిన దౌర్భాగ్య మగజాతి నికృష్టమైన వెర్రిమొర్రి కోరికలకి అంతేలేదా?


    ఆడదానికి అందం, చదువు. ఉద్యోగం ఉన్నప్పుడు ఒకరికెందుకు భయపడాలి? మరొకరిపై ఎందుకు ఆధారపడాలి?


    స్వతంత్రంగా ఒంటరిగా ఎందుకు బతకలేదు?


    పెళ్ళికాలేదని హేళన చేస్తారు!


    ఓ.కే. హూ కేర్స్ ఫర్ ఇట్!


    శీలం మంచిది కాదని అపవాదు వేస్తారు!


    సోవ్వాట్!!


    ఒకళ్ళు నవ్వుతారనే కానీ, చాటుగా, గుట్టుగా పెళ్ళాన్ని కాల్చుకొని ఎంతమంది బుద్ధిమంతులు పెద్ద మనుషుల్లా చెలామణీ అవడంలేదట!?


    మండిపోతున్న గుండెల్లో ధైర్యాన్ని సన్నగిల్లనివ్వకుండా ఆడది అటు నక్కజిత్తుల సమాజానికి, ఇటు స్వార్ధంతో నిలువెల్లా కుళ్ళిపోయిన మగజాతికి ఎదురుతిరిగి, తిరగబడిననాడు ఎవ్వరూ ఏమీ చేయలేరు.

    
    దానికొక్కటే మార్గం.


    అందంవున్నా, లేకపోయినా ఫరవాలేదు. డబ్బున్నా లేకపోయినా ఫరవాలేదు. ఒకరి అండదండలున్నా లేకపోయినా ఫరవాలేదు.


    కానీ ఆడది చదువుకొని ఉండాలి. ప్రతి ఆడదీ కష్టపడి అవాంతరాలని లక్ష్యపెట్టకుండా నిలదొక్కుకొని విద్యావంతురాలు కావాలి. ఆ చదువు ఈ సమాజంపై బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలి.


    పళ్ళికిలించి నవ్వే ఈ సమాజాన్ని పళ్ళూడేలాతన్నాలి.


    ఆడదాన్ని చెరపట్టడానికి చూసే మగవాళ్ళ మగతనాన్ని గుప్పిట పట్టి పిండేసి మగతనాన్ని మరచిపోయేలా చేసి వాడిచేతనే మరో మగాడికి ఆడదాని జోలికి మాత్రం పోకని నీతిని చెప్పించాలి.


    తలుపు తోసుకొని రమణి గదిలోకి వచ్చింది.


    అవంతి తనకేసి చూడకుండా ఏదో దీర్ఘాలోచనలో ఉండడాన్ని చూసి రమణి అడిగింది.


    "ఏమిటి అంతగా ఆలోచిస్తున్నావు?"


    "ఏం లేదు, నువ్వెక్కడికెళ్ళావు?"


    "పువ్వులమ్మే అబ్బాయొచ్చాడు. కొందామని వెళ్ళాను" అంది రమణి.


    "ఏం తోచడం లేదు. ఏదన్నా సినిమాకెళదామే" అంది అవంతి.


    "నేను రెడీ!" అంది రమణి.


    అరగంటలో తయారై ఇద్దరు హాస్టలుగేటుదాటి రోడ్డుమీదికొచ్చారు.


    వాళ్ళు నాలుగడుగులన్నా వేసారో లేదో వెనకనించి ఫియెట్ కారొచ్చి వాళ్ళ పక్కగా ఆగింది.


    మనోహర్ స్టీరింగ్ ముందు కూర్చుని ఉన్నాడు.


    అవంతి అతన్ని చూడగానే నవ్వింది.


    "ఎక్కడికి బయల్దేరారు?" అడిగాడు మనోహర్ సిగరెట్ వెలిగిస్తూ.


    "సినిమాకి!" అని చెప్పింది అవంతి.


    మనోహర్ వాళ్ళిద్దర్నీ పరీక్షగా చూశాడు.


    సీతాకోక చిలుకల్లా చూడముచ్చటగా వున్నారిద్దరూ.


    "సినిమాకి వెళ్ళాల్సిందేనా?" అడిగాడు మనోహర్.


    "ఏమీ తోచక బోరుకొట్టి బయలుదేరాము. నీకేమన్నా పనుంటే మానేస్తాం" అంది రమణికేసి చూస్తూ అవంతి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS