Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 29


                          కవితా! ఓ కవితా!

కవితా! ఓ కవితా!
నా యువకాశాల నవపేశల సుమగీతావరణంలో
నిను నేనొక సుముహూర్తంలో,
అతిసుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?

నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిష్కంలో
ఏయే ఘోషలు, భాషలు, దృశ్యాల్ తోచాయో,
నే నేయే చిత్ర విచిత్ర శ్యమంత
రోచిర్నివహం చూశానో,
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో,
నీకై నే నేరిన వేయే ధ్వనులో,    
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్నినాదాలో;
నడి రేయాకస మావర్తించిన,
మేఘాలా వర్షించిన,
ప్రచండ ఝంఝా ప్రభంజనం
గజగజ లాడించిన
నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం;
ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులో;
నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుద్ధం
అన్నీ నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం!

మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే దృశ్యాలా?
వినిపించే భాష్యాలా?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం

ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనః ప్రపంచపు టావర్తాలు!
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మృతులూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావు బ్రతుకుల సంధ్యాకాలంలో
కన్నులు మూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగనైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!
కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధనిమీలిత నేత్రాల
భయంకర బాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఘాకం కేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల
హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను
నా విన్నవి కన్నవి విన్నవించగా
మాటలకై వెదుకాడగబోతే-
అవి,


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS