Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 30

పుంఖానుపుంఖంగా
శ్మశానాల వంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి-
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగిడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝురవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా సృష్టించిన గానంలో
ప్రక్షాళిత మామక పాపపరంపర
లానంద వశంపద హృదయుని జేస్తే-
నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో,
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధం గావించిన ఆ గాంధర్వానికి,
తారా నివహపు ప్రేమ సమాగమంలో
జన్మించిన సంగీతానికి....
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగానానూనస్వానావళితం,
బ్రదుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం.    
అమోఘ, మగాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘృణీ!
రమణి!
కవితా! ఓ కవితా!

నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో,
నా బహిరంతరింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ,
నే నీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తల దాలిచి,
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడనై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో నను దరిసిన,
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా!
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా!    

నేడో, నా ఊహాంచల
సాహసి కాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని,
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందక పోయే
నీ చేలాంచలముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హృద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విసృమర
కుసుమ పరాగం
ఓహో! ఓ రసధుని! మణిఖని!
జననీ! ఓ కవితా!
కవితా! కవితా! ఓ కవితా!
                                                                            - 1937 (?)

                                                      * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS