Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 28


    "మీరు బయటపడితే ప్రమాదం" మౌనిక శక్తినంతా గొంతులోకి తీసుకుని మాట్లాడింది.

 

    ఆ మాటలకు అతనికి కన్నీళ్ళొచ్చాయి. తను చావుబతుకుల మధ్య వున్నా మరొకరిని రక్షించాలన్న ఆమె తాపత్రయం చూసి అతను కదిలిపోయాడు.

 

    "అదేం ఫర్వాలేదు. మిమ్మల్ని ఇలా వదిలేయడంకన్నా మిమ్మల్ని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు పోయినా యిబ్బందిలేదు. మిమ్మల్ని బతికించుకున్నానన్న తృప్తి చాలు" అన్నాడు తరుణ్.

 

    వాళ్ళిద్దర్నీ చూసి అక్కడున్న మిగిలిన అమ్మాయిలు సిగ్గుపడ్డారు. ఎదుటి వ్యక్తిని కాపాడటం కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టేవాళ్ళు తమకంటే ఎంతో గొప్పగా కనపడతారు.

 

    "అయితే ఇక ఆలస్యం ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళదాం" ప్రేమానంద ముందుకు వంగి మౌనికని ఎత్తడానికి ప్రయత్నించింది.

 

    ఓవైపు ప్రేమానంద, మరో వైపు తరుణ్ ఆసరాగా నిలబడ్డారు. మౌనికానంద నెమ్మదిగా అడుగులు వేయడం ప్రారంభించింది. అందరూ మెయిన్ గేటు గుండా బయటికొచ్చారు. ఎవరూ తమ గురించి ఆలోచించడంలేదు. మౌనిక బతికితే చాలన్న ధ్యాస తప్ప మరే శంకా వాళ్ళని అంటడంలేదు.

 

    "మీరు మధ్యలో రండి. మేం చుట్టూ నడుస్తుంటాం. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చూడలేరు" శృతి అనే అమ్మాయి తరుణ్ వైపు నడుస్తూ అంది.

 

    మిగిలిన అమ్మాయిలు చుట్టూ చేరి నడవడం ప్రారంభించారు. వాళ్ళని చూసిన ఒకరిద్దరూ భోజనాలకు వెళుతున్నారని అనుకున్నారు తప్ప మరో విధంగా భావించలేదు. అలా మొదటిసారి అమ్మాయిలు ఆ కాంపౌండ్ దాటి బయటికి అడుగువేశారు.

 

    విషం తీసేయటం వల్ల మౌనికకు ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్లనిపించింది తరుణ్ కి. ఆమె బాధతో మెలికలు తిరిగిపోతున్నా స్పృహలోనే వుంది.

 

    వాళ్ళంతా కాలిబాటలోకి వచ్చారు. అక్కడ్నుంచి అన్నావారి సత్రం కిలోమీటరు దూరం వుంటుంది.

 

    ఏదో పురుగు కొట్టేసినట్టు చందమామ సగం వరకే కన్పిస్తోంది. దూరానికి అన్నావారి సత్రం మిణుగురు పురుగులు వాలిన చెట్టులా వుంది.

 

    చలికి తాళలేక నల్లటి స్వెట్టర్ ని వేసుకున్నట్లు ఆకాశం కన్పిస్తోంది.

 

    నిమిషానికోమారు తరుణ్ మౌనికని పలకరిస్తున్నాడు. ఆమె అతి కష్టంమీద పలుకుతోంది.

 

    మరో ఇరవై నిమిషాలకి వాళ్ళు అందరూ అన్నావారి సత్రం చేరుకున్నారు.

 

    డాక్టర్ ఊరికి మధ్యలో చిన్న డాబా ఇంట్లో వుంటున్నాడు. పేషెంట్లు ఎవరూ లేరు. బోర్డు చూసి అది డాక్టర్ ఇల్లని నిర్ధారించుకుని లోపలికెళ్ళారు. మౌనికని లోపలున్న టేబుల్ మీద పడుకోబెట్టారు.

 

    అప్పటికే ఆమె శరీరం రంగు మారుతోంది.

 

    వీళ్ళని చూసి డాక్టర్ లోపలినుంచి బయటికి వచ్చాడు. అంతమందిని తన క్లీనిక్ లో చూసి డాక్టర్ జడుసుకున్నాడు. ఆయనకి భయం ఎక్కువ.

 

    "ఏమైంది? ఎవరు మీరంతా?" అంటూ కంగారుగా అందరివంకా చూశాడు.

 

    "ఈమె పేరు మౌనిక. అరగంట క్రితం పాము కరిచింది" అని తరుణ్ మౌనికవైపు చూపించాడు.

 

    "ఓ మైగాడ్! స్నేక్ బైట్ - ఎక్కడ?" డాక్టర్ మరింత కంగారుపడిపోయి మౌనిక దగ్గరికి వచ్చాడు.

 

    "పాదాల దగ్గర" అని తరుణ్ గాట్లు చూపించాడు.

 

    "ఇదంతా ఏమిటి? కోశారా?"

 

    "ఆఁ విషం ఎక్కకుండా కట్టుకట్టాం. కొద్దిగా గాయం చేసి విషం పీల్చాం"

 

    "ఇది ఖచ్చితంగా త్రాచుపాము కాటే. విషం పీల్చకుంటే ఈపాటికే ప్రమాదం జరిగి వుండేది. ఇదంతా నువ్వేనా చేసింది?" తరుణ్ ని ప్రశ్నించాడు.

 

    "అవును సార్!"

 

    "దట్స్ గుడ్! ఇంజెక్షన్లు చేయాలి. మొత్తం రెండువేలు ఖర్చవుతుంది.

 

    "అలాగే సార్! మీరు ట్రీట్ మెంట్ మొదలుపెట్టండి."

 

    డాక్టర్ లోపలికి వెళ్ళి సిరంజీతో వచ్చి రెండు ఇంజెక్షన్లు చేశాడు.

 

    "ఈమెకి బాగా గాలి తగలాలి. మీరంతా వరండాలో వెయిట్ చేయండి" డాక్టర్ మాటలకి అందరూ బయటికొచ్చి నిలబడ్డారు.

 

    "తరుణ్ గారూ! మరో డబ్బో?" కైవల్య అడిగింది. డాక్టర్ రెండు వేలు కావాలన్నప్పట్నుంచీ అమ్మాయిలు ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నారు.

 

    వాళ్ళ దగ్గర చిల్లిగవ్వ లేదు.

 

    "చూశారా డబ్బు అవసరం. మనిషి మనుగడకు డబ్బెంత అవసరమో చూస్తున్నారు కదా. మీరేమీ పైసా పని చేయకుండా మహిళా సదన్ లో కూర్చుని ధర్మాల గురించి ప్రవచిస్తున్నారు.

 

    ఈ ప్రపంచంలో పక్షులు సైతం తమ ఆహారాన్ని తామే సంపాదించుకుంటాయి. ఒక్క స్త్రీలు తప్ప. అందుకే సంఘంలో మీ గౌరవాభిమానాలు తగ్గిపోతున్నాయి. మీరు వ్యక్తులుగా గుర్తింపబడాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అందుకే రేపటినుంచీ మీరు పూసలు కుట్టాలి" అని ఆగాడు తరుణ్.   

 

    అమ్మాయిలంతా ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు.

 

    "ఈ ఊర్లో నాకు తెలిసిన మిత్రుడు వున్నాడు. పూసల బిజినెస్. అతని దగ్గరకెళ్ళి రెండువేలు తెస్తాను. మనమంతా పూసలు కుట్టి కొంత కొంత తీర్చాలి. మీరు సరేనంటే నేవెళ్ళి డబ్బు తెస్తాను."  

 

    అడకత్తెరలో పోకచెక్కలా అయిపోయింది అమ్మాయిల పరిస్థితి. సరేనంటే రేపటినుంచి పూసలు కుట్టాలి. లేదంటే తమ స్నేహితురాలు ట్రీట్ మెంట్ లేక చచ్చిపోతుంది.

 

    అందరూ కలిసి ఒకే నిర్ణయానికి వచ్చినట్లు "పూసలుకుడతాం" అన్నారు.

 

    "దట్స్ గుడ్! ఎప్పుడైతే డబ్బులు సంపాదించి, మీరు స్వయంగా బతకడం నేర్చుకుంటారో అప్పుడే మీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది."   

 

    అంతలో డాక్టర్ బయటికొచ్చాడు.

 

    అందరూ అతని వైపు తిరిగారు.

 

    "గండం గడిచింది. ఇక ఏ భయమూ లేదు. మీరు నిశ్చింతగా వుండచ్చు. జస్ట్ ఇంకో ఇంజెక్షన్ చేసి పంపించేస్తాను. మరి డబ్బు తెచ్చారా?"

 

    డాక్టర్ అన్న చివరి మాట వినగానే అమ్మాయిలు తరుణ్ వైపు చూశారు.

 

    "ఓ పదినిమిషాల్లో మీ డబ్బులు మీకిచ్చేస్తాం" తరుణ్ అనగానే తలవూపుతూ డాక్టర్ లోపలికెళ్ళాడు.   

 

    ఇప్పుడే వస్తానని అమ్మాయిలతో చెప్పి తరుణ్ కూడా బయటికొచ్చాడు.

 

    ప్రమాదం నుండి బయటపడిన మౌనికను చూడటానికి అమ్మాయిలంతా లోపలికెళ్ళారు.

 

    మౌనిక బాగా కోలుకుంది. అరగంట క్రితం ఆమెను పాము కరిచిందంటే ఎవరూ నమ్మరు. అలా వుంది ఆమె. తన మిత్రురాళ్ళను చూసి అభిమాన పూర్వకంగా నవ్వింది.

 

    మరో పది నిముషాలకి తరుణ్ వచ్చాడు.

 

    లోపలికి వెళ్ళి డాక్టర్ కి డబ్బులిచ్చి ఆయనిచ్చిన మందులు తీసుకు వచ్చాడు.

 

    "ఇక వెళదామా?" అందరివైపు చూస్తూ అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS