వాలి ఎప్పటికినీ గుహ నుండి తిరిగి రాలేదు. ఏమి యుండునని యోచించుచుండగా ఒకనాడు గుహ లోపలి నుంచి రక్తము ఏరుగా ప్రవహించి వచ్చి సుగ్రీవుని పాదములకు తగిలినది. సుగ్రీవుడు ఆ రుధిరము మాయావిదే అనియూ, అగ్రజుడు విజయోత్సాహముతో మరలి వచ్చుననయూ తలచి వాలికై నిరీక్షించినాడు. కాని వాలి రాలేదు సుగ్రీవునకు ధైర్యము వీగిపోయినది మాయావి మా అన్నను చంపివేసినాడు. వాలిని తన వెంట ఈ బిలము వరకునూ రప్పించుటకే వాడు పిరికితనమును నటించినాడు. కిష్కింధకోట ప్రాంగణమున నిలిచి సవాలు చేసినవాడు అక్కడ వాలితో పోరకుండ భీతి నటించి మోసము చేసి తనకు స్థానబలి కల ఈ గుహకు రప్పించి చంపినాడు. నేను కిష్కింధకు పోయి కొందరు వానర వీరులతో తిరిగి వచ్చి వారి సాయముతో మాయావిని వధించెదను. ఈలోపున వాడు గుహను విడిచి పోకుండ గుహ ద్వారమును మూసివేసెదను"...సుగ్రీవుడు బిల ద్వారమున ఒక బండరాయిని బిగించి పిమ్మట కిష్కింధను చేరుకున్నాడు.
...వాలి మంత్రులునూ అతడు మరణించెననియే అనుకున్నారు. వాలి కుమారుడు అంగదుడు పిన్న వయస్కుడగుటచే సమర్దుడగు సుగ్రీవుని పట్టాభిషిక్తునిచేయుట ఉచితమని తోచి వారాతని సింహాసననాసీనుని చేసినారు...
సుగ్రీవుడు నేర్పుగా వానర రాజ్యమును పరిపాలించు చున్నాడు. అతడొకనాడు నిండు పేరొలగమున నుండగా వాలి అచ్చట హఠాత్తుగా ప్రత్యక్షమైనాడు; సింహాసనముపై నున్న తమ్ముని చూచి ప్రళయకాల రుద్రుడై మండిపడినాడు. 'నామీద గౌరవాభిమానములను నటించుచూ నావెంట వచ్చినావు. నేను గుహ నుండి వెలుపలకు వచ్చుటకు వీలు లేకుండ బిలద్వారమును పాషాణముతో మూసివేసి వచ్చి నా గద్దెను ఆక్రమించుకున్నావు! మాయావిని సంహరించి వచ్చుచున్న నాకు ద్వారము మూసి యుండుటచే కాంతి కరువై ద్వారము ఎక్కడ ఉన్నదో తెలిసికొనుట కష్టమైనది. పిమ్మట ఆ పాషాణమును తొలగించుటకు ఎక్కువ శ్రమపడవలసి వచ్చినది. రాజద్రోహి భ్రాతృద్రోహివి అగు నిన్నిప్పుడే వధించెదను" అనుచు గద్దెను సమీపించినాడు...సుగ్రీవుడు భయ విస్మయములతో వాలికి మోకఱిల్లి "అన్నా ఇదిగో నీ గద్దె. ఇదిగో నీ కిరీటము. ఇవిగో రాజ లాంఛనములు. ఇవేమియూ నేను ఆశించలేదు. నేను నిర్దోషిని" అని మొఱపెట్టుకొన్నాడు. గుహ ద్వారమును మూసివచ్చుటకు కారణమును వివరించుటకు ప్రయత్నించినాడు కాని వాలి వినిపించుకొనలేదు. మంత్రులు వాలితో, 'సార్వభౌమా, జరిగిన పొరపాటు మా వలన జరిగినది. మీ తమ్మునీ మమ్మునూ క్షమించి మీ ఆధిపత్యమును తిరిగి స్వీకరించి మా సేవలను అందుకొనుడు" అని పరిపరి విధముల ప్రార్ధించినారు. కాని వాలి వినలేదు. అతడు పళ్లు పటపట కొరుకుచూ "నీ ఎముకలు విరుగగొట్టి నీచే రక్తమును కక్కించి నీ తలను మొలిపెట్టి మొండెము నుండి వేరుచేసెదను!" అని సుగ్రీవుని వెంటపడినాడు. సుగ్రీవుడు కిష్కింధను విడిచి పరుగు పరుగున పోవుచూ "కోపోద్రికుడై తరుముకొని వచ్చుచున్న అన్న నుండి నన్ను రక్షించువారెవర"ను కొనుచు యాదృచ్చికముగ తలను ఎత్తి చూచినాడు. అపుడాతనికి దూరముగా ఈ ఋశ్యమూక పర్వత శిఖరము దృశ్యమైనది; మున్ను మతంగ మహాముని వాలికిచ్చిన శాపము జ్ఞప్తికి వచ్చినది. ఆ శాపము కారణముగ వాలి ఋశ్యమూకమును గాని పరిసర ప్రాంతములను కాని ప్రవేశించినచో ప్రాణములను పోగొట్టుకొనును. అందువలన వాలి ఆ కొండకు రాడు...ఈ ఆలోచన తట్టిన వెంటనే సుగ్రీవుడు బ్రతుకుజీవుడా!' అనుకొనుచు ఈ గిరి పైకి ఎగిరివచ్చి ఆపద నుండి తప్పించుకొన్నాడు. వాలి ఇంక చేయగలిగినది లేక 'బ్రతికిపోయితివిరా!' అని పళ్లు పటపట కొరుకుచూ కిష్కింధకు మరలిపోయినాడు; వానర రాజ్యాధిపత్యమును తిరిగి కైవసము చేసికొన్నాడు.
హనుమంతుడు రామలక్ష్మణులకు వాలి సుగ్రీవుల వృత్తాంతమును అంతవరకు చెప్పి ఒక్క నిముషము మౌనముగా ఉండి పిమ్మట ఈవిధముగా ముగించినాడు.
"అంతటితో వాలి తమ్మునిపై ద్వేషమును విరమించుకొనవలసినది. అట్లు చేయకుండుటయే కాక అవాచ్యమగు ఒక కృత్యమునకు పాల్పడినాడు. పట్టమహిషి 'తార'ఎంత వారించినను వినక సుగ్రీవుని పత్ని 'రుమ'ను చెఱపట్టినాడు! ఈ దుష్కృత్యమునకు ఒడిగట్టిన వాలిపై అసహ్యము వేసి మంత్రిమండలిలోని నేనునూ మరి మువ్వురు సచివులునూ కిష్కింధను వదలి ఋశ్యమూకమున సుగ్రీవునకు తోడుగా ఉన్నాము"
శ్రీరాముడు: కపిశ్రేష్ఠా సుగ్రీవుని కనికరపు గాధ నా హృదయమును కలచివేసినది. అతని వద్దకు మమ్ము వెంటనే తీసికొనిపొమ్ము.
హనుమంతుడు: కొండనెక్కి పోవుట వలన శ్రమయే కాక ఆలస్యము అగును. మిమ్ము నా బుజములపైన నంచుకొని ఎగిరి వెళ్లి గిరిపైన దింపెదను.
తనకి నిరీక్షించుచున్న సుగ్రీవుని సమక్షమున రామలక్ష్మణులను దించి హనుమంతుడు వారిని సుగ్రీవునకు పరిచయము చేసినాడు. సుగ్రీవుడు తన చేతిని రాముని హస్తము నందుంచి 'శ్రీరామచంద్రా నేను సూర్యవరము వలన జనించినాను. నీవు సూర్యవంశజుడవు. ఈ క్షణము నుండియు మనము మైత్రిని పాటించుదము' అన్నాడు. హనుమంతుడు కొన్ని ఎండుకట్టెలను తెచ్చి అగ్నిని రగుల్కొలిపినాడు. రామసుగ్రీవులా అగ్నికి ప్రదక్షిణము చేసి నమస్కరించి అగ్నిసాక్షిగ మిత్రులైనారు... లంకలో అశోక వనమున రాక్షసాంగనల మధ్య చెఱననుభవించుచున్న సీతాదేవికి సుభసూచకముగ ఎడమకన్ను అదిరినది. అదే క్షణమున రావణునకునూ వామనేత్రము చలించినది. వామనేత్ర చలనము పురుషులకు అశుభ సూచకము కాన దనుజ వల్లభుడు కలతపడినాడు.
* * *
