సరిగా ఆ సమయంలో మారుతి కారు దిగి లోపలకు వచ్చింది సుమిత్రాదేవి. గాయత్రి కన్నీరు పెట్టుకోవటం, వాల్మీకి ఓదార్చటం ఆమని కన్నీరు తుడుస్తూ కారణం అడగడం అన్నీ చూచిందామె.
"ఎందుకు గాయత్రి కన్నీరు పెట్టుకుంటున్నావు?" అని అడిగింది.
"నిద్రలేక కళ్ళు మంటలు పెడుతున్నాయండీ అమ్మగారూ!" అంది గాయత్రి.
"అబద్ధం అంటూ లేచింది ఆమని. ఇందాకటి నుంచి నేను గమనించ లేదు. కారణం లేకుండా నువ్వు కన్నీరు పెట్టుకోవు. అదేంటో చెప్పక్కా!" అంది ఆమని!
సుమిత్రాదేవి విసుక్కుంది.
"నిన్ను తీసుకుపోదామనే వచ్చాను. వెళ్ళి కారులో కూర్చో!" అని ఆదేశించింది.
అమనికి రవంత అయినా విషయం అర్ధంకాలేదు. అక్క దుఃఖానికి కారణం తాను అవునో కాదో ఇంకా నిర్ధారించుకోలేదు. మమ్మీ మాటలలో విసురు విన్న తరువాత మాత్రం అనుమానం మరింత బలపడింది.
"వెళ్ళొస్తా బావగారూ! వెళ్ళొస్తాను అక్కా!" అని చెప్పి వెళ్ళి కారులో కూర్చుంది.
అర్ధాంతరంగా తాను అలా వెళ్ళిపోతూ వుంటే మాట వరుసకు అయినా గాయత్రి అప్పుడే వెళ్ళిపోతావా? ఉండు అని అనలేదు.
అక్కలో ఏదో మార్పు వచ్చిందనే విషయం క్రమంగా అర్ధమవుతోంది.
ఆమె వెళ్ళి కారులో కూర్చున్న తరువాత గది లోపలకు వచ్చింది సుమిత్ర. ఆమెకు ప్రక్కమీద అందంగా అమర్చిన దిండ్లు కన్పించాయి.
డానికి తోడు గాయత్రి నోరు విప్పదు.
ఆమని గలగల మాట్లాడేస్తుంది. వాల్మీకితో సహా అందరూ చిన్నవాళ్ళే! కాని పెళ్ళి అయిన మరునాడే ఇలా కూతురు కన్నీరు పెట్టుకోవడం తల్లి మనసుని బాధించింది. గాయత్రిని మంచంమీద కూర్చోపెట్టింది.
కుర్చీలో తాను కూర్చుంది. వాల్మీకి అంతా గమనిస్తున్నాడు.
"బాబూ! ఆడపిల్లలు! అర్ధంలేని ఆలోచనలు ఎన్నో ఉంటాయి. గాయత్రి పిచ్చిపిల్ల! నీ యింటికి వచ్చిన మొదటి రోజే అది కన్నీరు పెట్టుకోవటం నీకు బాధగా ఉండొచ్చు. ఏమీ అనుకోకు బాబూ!
రేపు మీకు అవుపోసన కార్యక్రమం ఏర్పాటు చేయాలి ఆ ఇంట్లో!
మీ పెద్దవాళ్ళు ఎవరయినా ఉంటే వారికి చెప్పి అనుమతి తీసుకోవాలి! కాని నీకూ దానికీ నేనే పెద్ద దిక్కు.
చెప్పిపోదామని వచ్చాను. అక్కడ ఏర్పాట్లన్నీ చూడాలి కదా! చేతికి సాయం కావాలి ఆమనిని తీసుకుపోతున్నాను" అంది.
"సరే మీ యిష్టం" అన్నాడు వాల్మీకి!
"ఎవరూ తోడు లేరని బెంగ పెట్టుకోకు! అబ్బాయ్ నీకు తోడు అతనయినా పరాయివాడు కాదు. చాలా మంచివాడు! మీ యిద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకునేంత వరకూ మధ్యలోకి మరొకరు రాకుండా వుండడమే మంచిది!
ఆమని నోరు మూతపడదు. అదేదయినా పొరపాటుగా మాటాడితే అది నా తప్పుగా భావించి క్షమించు బాబూ!" అన్నదామె!
"చూడండి అత్తాయమ్మగారూ! చంద్రుడికయినా మచ్చ ఉంటుంది కాని వెన్నెలకి మచ్చ ఉంటుందా? అలాంటి మనిషి ఆమె!
వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా నగరంలో ఉంటుంది.
ఇక్కడ ఉండేది కొద్దికాలం! ఈ కొద్దికాలం అందరితో ఆనందంగా ఉండాలనే కోరిక ఆమనిది! ఎవరు తప్పు పట్టుకుంటారు.
వెన్నెలలాగ మచ్చలేని ఆమని గురించి ఎవరయినా తప్పు అనుకుంటే అది వాళ్ళ దురదృష్టం.
అలా నేను ఎందుకు అనుకుంటాను మీరు వెళ్ళిరండి!" అన్నాడు.
సుమిత్ర వెళ్ళి కారులో కూర్చుంది. కారు కదిలింది.
"అది అలా ఎందుకు ఏడ్చిందే! నువ్వేమయినా అన్నావా?"
"ఆవిడగారిని అనటం తప్ప నాకు మరేమీ పనిలేదనుకున్నారా మమ్మీ?"
"మరి ఎందుకు ఏడ్చిందే!?"
"అదేమో దానికి తెలియాలి! దాని మొగుడికి తెలియాలి" అంది ఆమని అక్కసుగా!
నిర్మలమయిన మనసుతో ప్రేమించినందుకు అక్క అని ఆరాధించినందుకు అవమానం బహుమానంగా యిచ్చి పంపుతోందని ఆమె కడుపు ఉడికిపోయింది. మర్చిపోవాలని విండోలోంచి దిక్కులకేసి చూస్తోంది.
వారు వెళ్ళిపోయిన తరువాత గాయత్రి నొచ్చుకుంది.
పాపం పిచ్చిపిల్ల వెళ్ళొస్తాను అక్కా అన్నప్పుడు ఉండు చెల్లీ అనకపోవడం ఎంత పొరపాటు! అది అభంశుభం తెలియని అమాయకురాలు!
తన కన్నీరు తనని బాధించే ఉంటుంది.
"ఎందుకు అలా అయిపోయావు?" అని ప్రశ్నించాడు వాల్మీకి!
"నిజం చెప్పమంటారా?"
"అవును. నిజమే చెప్పాలి కదా!"
"మీరు ఆమనిని పొగుడుతుంటే నాకు ఏడుపొచ్చింది. కారణం తెలియదు"
"పిచ్చిదానా! ఇంతేనా నీ చెల్లి గురించి నువ్వు తెలుసుకున్నావు? చంద్రుడికి మచ్చలుంటాయి కాని వెన్నెలకు మచ్చ వుండదు. వెన్నెల ఎలాంటిదో ఆమని మనసు అలాంటిది. ఇంకెప్పుడూ ఆమెను బాధపెట్టకు.
ఆమె నా దృష్టిలో ఒక పసిపాపాయి కన్నా ఎక్కువ కాదు" అన్నాడు వాల్మీకి!
"అలాగేనండి" అంది గాయత్రి.
మనసులో భయం భయంగానే వుంది.
ఈ పెళ్ళి ఇంత త్వరగా అయిపోవటానికి వెనుక ఆమని కృషి ఎంతో వుంది. అలాంటి చెల్లిని బాధపెట్టడం ఒక తప్పు! ఆయనకు దొరికిపోవటం మరో తప్పు ఆమని తనని ఏనాటికయినా క్షమిస్తుందా?
కలకలమని పాడుతున్న కోయిల గొంతు నొక్కినట్లు అయింది.
మౌనంగా వెళ్ళి కారులో కూర్చుంది.
తను మాత్రం బాధ పెట్టాలనుకుందా? అనుకోకుండానే కన్నీరు ఉబికి వచ్చేశాయి. తల దిండుమీద ఆమె పేరు ఉంటే ఏమవుతుంది.
ఆమె లేదుకదా!? తమ మధ్యకు ఆమె కాదుకదా?
ఎన్నో విధాల పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసింది. వాల్మీకి గంభీరంగా అయిపోయాడు.
ఆమని ఎదురుగా ఉంటే చాలా బాగా మాటాడేవారు. జోక్స్ వేసేవారు. పరాచికాలు పలికేవారు. ఆమె వెళ్ళిపోగానే గంభీరంగా అయిపోయారు.
ఆమనిలా మాటాడటం తనకిరాదు. చిన్నతనంనించి ఉన్న తేడా అది! అందుకే ఆయనా మాటాడరు. అప్పుడప్పుడు మాటకలుపుతూ కాఫీ డ్రింకు లాంటివి కలిపి అందిస్తూ కొంత భయం తీర్చుకుంది గాయత్రి!
ఎప్పుడెప్పుడు ఇంటికి పోవటానికి వీలవుతుందా అని మనసు పీకింది. వెళ్ళగానే చెంపలు వాయించుకోవాలి! ఆమనిని క్షమాభిక్ష అడగాలి!
తన తొందరపాటుని మన్నించమని వేడుకోవాలి.
ఆ సమయం రానే వచ్చింది. ప్రయాణమయారు.
ఈ మూడు నిద్రలు పూర్తి అయేలోగా ఫాం హౌస్ లోని పనివారు అందరూ బాగా మచ్చిక అయ్యారు. ఆమె వారికి యజమాని!
ఇకనించి ఆ యింటినించి కూడ ఇక్కడ పనులు నిర్వహించుకోవాలో పని తీరునుబట్టి నిర్ణయించుకుంది గాయత్రి! ఆమె గృహ నిర్వహణలో సామర్ధ్యాన్ని ఈ మూడు రోజులలో కనిపెట్టేశాడు వాల్మీకి!
తాళం చెవులతో సహా ఒక్కొక్క బాధ్యతను ఆమెకు అప్పగించాడు.
ఇంక తాను చేయవలసిన కార్యక్రమం పట్నం వెళ్ళి వ్యాపార విషయాలు ఆలోచించుకోవటమే! పదహారు రోజుల పండుగ దాటే వరకూ పొలిమేరలు దాటకూడదని నియమం చెప్తారు అత్తాయమ్మగారు.
అది కొంత ఇబ్బందికరంగా వున్నా ఈ కొద్దిరోజులు కళ్ళు మూసుకోవటం మంచిది. సాయంత్రానికి సాంప్రదాయకమయిన పిలుపులు అందాయి.
గాయత్రిని ఉదయమే తీసుకుపోయారు.
"బాబూ ఏడు గంటలకు సిద్ధంగా వుండు. చీకటి పడగానే కారు పంపుతాను. అమ్మాయికి తలంట్లు పూజలు ఉన్నాయి. అందుకే ముందు తీసుకుపోతున్నాను" అని చెప్పింది సుమిత్రాదేవి.
"ఆమని ఎలా వుంది?" అని అడగాలనుకున్నాడు.
కాని నోటిమీద వరకు వచ్చిన ప్రశ్న ఆగిపోయింది.
సాయంత్రం కనిపిస్తుంది. ఈలోగా ఎక్కువ శ్రద్ధ చూపడం మంచిది కాదు. గాయత్రి మనసు చాలా సున్నితమయినది.
పైగా తన గాయాన్ని అందరికి చెప్పుకోదు. మనసులో ఉంచుకుని కుమిలిపోయే స్వభావం.
అక్కాచెల్లెలు చెరొక దారిని అని అడగలేదు. కారులో సుమిత్ర గాయత్రికి ఆ రాత్రి జరగబోయే అవుపోసనం కార్యక్రమం గురించి చెబుతోంది. చేసిన ఏర్పాట్లు వివరిస్తోంది.
