తను రాయబోయే మొదటి నవలకి....
మొదటి పేజీకి ఆరోజే శ్రీకారం చుట్టాడు ప్రశాంత్!
"సంకీర్ణమైన కీకారణ్యంలో భీకర సాకారస్వరూపాల కరోష్ణంలా .....అవనత శిరస్కయైన తేజో భానుడు... గిరిశిఖర గిరిభీకర సరోవాజమ్ముల మీద నుంచి ధరోష్ణపు శబ్ద సర్మిష్టిలా ఉదయించే వేళ..... కాకారం... ప్రబాకీర్తనం అయ్యింది!" అదీ అతని నవలకి ప్రారంభం.
ఆ తర్వాత అతని కలం కదలలేదు...
అంతా అదే విధంగా రాస్తే పాఠకులు భయపడిపోయే ప్రమాదం వుంది.
ఒకింత సెంటిమెంట్ గుప్పించాలి.
వీలుంటే భగవద్గీతలోని శ్లోకాలని అక్కడక్కడా కోట్ చెయ్యాలి!
ఏదైనా పౌరాణిక ఏక పాత్రాభినయంలోంచి కొన్ని కఠినమైన వాక్యాలని తస్కరించాలి....
ఈ వ్యూహం సూరిబాబుకి తెలియడం అనవసరం!
అతను రాసేది రాస్తాడు....
అప్పుడు ఆ కాగితాలని ముందు వేసుకుని....
మధ్య మధ్యలో తమ బ్రాండ్ 'మసాలా' ని పేర్చవచ్చు...!
వండ్రఫుల్ అయిడియా!
అదే క్షణంలో తలుపు చప్పుడయ్యింది. ...
మెల్లిగా లేచి నిల్చున్నాడు ప్రశాంత్.
తలుపు తెరిచాడు.
సూరిబాబు!!
ప్రశాంత్ మొహం వికసించింది.
బయట వర్షం పడ్తోందా?
ఆ విషయం తను గ్రహించనంతగా నిమగ్నమైపోయాడు అతనా వ్యూహంలో....!
"సూరిబాబూ! రా..."
ఆత్మీయంగా ఆహ్వానించాడు ప్రసాంత్.
అతను లోపలికి వచ్చాడు.
"అరె! బాగా తడిసిపోయావే!వుండు... "అంటూ తువ్వాలు అందించాడు.
సూరిబాబు తల తుడుచుకుంటూ చుట్టూ చూసాడు.
చిన్నగది....
ఏమాత్రం పరిశుభ్రత లేదు.
సామాన్లన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి.
గోడలకి మేకులు కొట్టి వ్రేలాడగట్టిన ఫాంట్లు,షర్టులు లుంగీలు.... జీర్ణవస్త్రాల్లా వున్నాయి.
ప్రశాంత్ అది గమనించి చిరునవ్వు నవ్వాడు....
"నారూం చూస్తే భయం వేస్తోందా?" అడిగాడు.
"లేదు.... నిన్ను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది!"
"ఏం?"
"ఎవరైనా నిన్ను చూస్తే ఏ లక్షాధికారి కొడుకువో అని భ్రమపడతారు..." అన్నాడు సూరిబాబు.
"అదే చిత్రం.... మనుషుల అవతారాలని చూసి వాళ్లని అంచనా వెయ్యడం......
మూర్ఖత్వం...! ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మ్యాన్ అని అనేవారట.... అది పూర్వం! ఈ రోజుల్లో అన్నీ మేడిపళ్లే!" అన్నాడు ప్రశాంత్.
ఎక్సెలెంట్!రియల్లీ ఎక్స్ లెంట్!ఇలాంటి డైలాగ్స్ నీ నవల్లో రాయి... పాఠకులు విపరీతంగా స్పందిస్తారు. నీ అభిప్రాయంతో ఏకీభవించేవాళ్లు, నీ పాత్రలలో ఐడెంటి ఫై చేసుకోగలవారు ఎక్కువౌతున్న కొద్దీ.... నీ అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతుంది..." అన్నాడు సూరిబాబు.
ప్రశాంత్ నవ్వాడు.
అదే ప్రయత్నిస్తున్నాను.. .కానీ, ప్చ్....! ఒక్క పేజీని మించి రాయలేక పోతున్నాను..."
"ఏదీ ... నువ్వు రాసినవి ఇలా ఇవ్వు..." అన్నాడు సూరిబాబు.
ప్రసాంత్ తను రాసిన కాగితం అందించాడు.
వాటిని పరిశీలనగా చూశాడు సూరిబాబు.
షాక్ కొట్టినట్లు వుండిపోయాడు.
"మై గాడ్! ఇది నిజంగా నువ్వు రాసినదేనా!
ఇంత అద్బుతమైన భాష.... నీకు వచ్చునని నేనెప్పుడూ ఊహించలేదే!నాకే అర్దంకాని అధ్బుతమైన పదాలు.....!" అన్నాడు సూరిబాబు.
"పదాలు అర్దం కాకపోతే పోనీ! భావం అర్దమయ్యిందా?"
"సూర్యోదయం అయ్యిందని మాత్రం అర్దమయ్యింది..." అన్నాడు సూరిబాబు.
"చాలు! అదే నాకూ కావాలి! పాఠకులకి విషయం కొంత అర్దం కావాలి! మరి కొంత అర్దం కాకూడదు! తనకి అర్దం కావడం లేదని, తను రచయిత స్థాయికి ఇంకా ఎదగలేదని అనుకుంటాడు పాఠకుడు: చెపుతున్న కథలో... సెంటిమెంటూ, సెక్సు వుంటే ఇక ఆ నవలకి తిరుగే వుండదు!" అన్నాడు ప్రశాంత్.
విస్మయంగా చూస్తున్నాడు సూరిబాబు.
ప్రశాంత్ మొఖంలో ఒక మహాపండితుడిలో కనిపించే వర్చస్సు కనిపించింది అతనికి.
"యూ ఆర్ జీనియస్!" అన్నాడు సూరిబాబు.
