జగన్నాధరావు లోపలినుండి ఎదురువచ్చాడు వీళ్ళకు "రండి, రండి!" సగౌరవంగా ఆహ్వానిస్తూనే మోహన్ రావు వెనుకగా హూందాగా అడుగులు వేస్తూన్న యువకుడిని చురుగ్గా చూశాడు. సంతృప్తితో, సంతోషంతో నిండిపోయింది ఆయన ముఖం. తమకు దూరపు బంధువొకాయన కోమలమ్మ వాళ్ళ సంబంధం గురించి చెప్పినప్పుడు తమ అంతస్తుకు తూగరుకదా అనుకొని ఆయన అసంతృప్తికి లోనయ్యాడు.
"మీకు తగిందికాదని అసంతృప్తి పడకండి. వాళ్ళకు మీ అంత ఆస్తి లేకపోవచ్చు. కాని పిల్లవాడు రత్నం. ఎం.ఎ. చదువుకున్నాడు బుద్దిమంతుడు" అని చెప్పాడు ఆ బంధువు.
సరే, ఓసారి చూద్దాం అనుకున్న జగన్నాధరావు బావమరిదిని మధ్యవర్తిగా వ్యవహారం నడిపాడు.
బావమరిది వెనుకగా నడిచి వస్తూన్న వరుడి స్ఫురద్రూపం జగన్నాధరావుకు ముచ్చట గొలిపింది. ఇతడికి చిల్లి గవ్వ ఆస్తి లేకపోయినా ఇతడి రూపంచూసి ఇవ్వొచ్చు నా కూతురుని అనుకున్నాడు.
ఆ ఇంటిని, ఆ ఇంటి పరిసరాలనూ, వాళ్ళ మర్యాదలనూ, ఆ ఇంటి దాసదాసీ పరివార జనాన్నీ చూసేసరికి కోమలమ్మకు గుండె దడదడలాడింది. తనూ ఓ లక్ష ఆస్తికి అధికారిణి అయినా వీళ్ళ ఐశ్వర్యం ముందు, ఆడంబరం ముందు సూర్యుడి ముందు దివిటీలాంటిది. ఇంత గొప్ప ఇంటిపిల్ల తన కోడలైతే గొప్పతనం సంగతి దేవుడెరుగు ఎన్ని సమస్యలు ఎదురౌతాయో?
అల్పాహారం టీలాంటి కనీసమర్యాదలు పూర్తి అయ్యేసరికి పెళ్ళికూతురు రావించబడింది.
"పేరేమిటమ్మా?" కోమలమ్మ ప్రశ్న.
"రజని"
అయిదు నిమిషాల తర్వాత, "అమ్మా, రజనీ! మనోహరరావుకు నీలైబ్రరీ అదీ చూపించమ్మా తీసుకెళ్ళి!" అన్నాడు జగన్నాధరావు.
"రండి!" అన్నట్టు మనోహర్ వైపు చూసింది రజని. అతడు లేచి అనుసరించాడు.
పెద్దలు వ్యవహారంలోకి దిగారు.
"మీకు ఒక్కతే పిల్లకదా! అల్లుడిని ఇల్లరికం పెట్టుకోవాలన్న ఉద్దేశ్యం ఉంటే ఆ సంగతి ముందే స్పష్టంగా చెప్పివేయండి!" సూటిగానే అడిగింది కోమలమ్మ.
"అబ్బే! అదేంలేదు." జగన్నాధరావు నవ్వాడు. "పిల్లే అత్తవారింటికి వస్తుంది. ఇక్కడ ఉంచుకొనే ఉద్దేశ్యం లేదు."
"పిల్లను విడిచిపెట్టి మీ రుండగలరా?"
"ఉండాలి ఆడపిల్లను కన్నవాళ్ళకు ఆ బాధ తప్పుతుందా?"
"ఆ మాటమీదే ఖచ్చితంగా ఉండాలి. ఆ తరువాత పిల్లను విడిచి ఉండలేమని, కూతురూ అల్లుడూ మా దగ్గరే వుండాలంటే కుదరదు. నాకో నలుగురు కొడుకులు వుంటే ఒకణ్ణి ఇల్లరికం ఇచ్చేద్దును! నా కున్నది ఒక్కడు!"
"ఆ సంగతి మాకు తెలుసు. వున్న ఒక్కణ్ణీ ఇల్లరికం ఇచ్చేస్తారని మాకు ఆశేమీ లేదు. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళి వస్తూంటేనే ఆప్యాయతా, అనురాగం. మాకు అంతగా పిల్లను చూడాలనిపిస్తే మీ ఇంటికే వచ్చి చూసి నాలుగు రోజులుండి వస్తాంగాని!"
కోమలమ్మకు పెద్ద సందేహం పుట్టుకొచ్చింది. పిల్లకు పెళ్ళిచేసి పంపేసి ఎవణ్ణో దత్తుచేసుకొని ఆస్తి వాడిపాలు చేయరుకదాని. ఈ సందేహం తీర్చుకోడానికి వుపాయమేదీ కనిపించలేదామెకు. "ఇక కట్నం కానుకలు........"
"మా తాహతుకు తగినట్టుగానే వుంటాయవి." జగన్నాదరావు గంభీరంగా అన్నాడు. "అడిగారు కాబట్టి చెబుతుననాను. రాజేంద్రనగర్ లో వున్న మేడ, షాద్ నగర్ సమీపంలో త్రివేణీ ద్రాక్షతోట, త్రివేణీ టెక్స్ టైల్ మిల్, ఫియట్ కారు, ఇప్పటికి రజని పేరుమీదున్న ఆస్థి, పెళ్లయ్యాక కూడా ఇవి ఆమెకే వుంటాయి. పోతే అల్లుడికొక కారు, చదవాలనుకుంటే ఫారిన్ చదువుకయ్యే ఖర్చు, లక్ష రూపాయల కట్నం వగైరా. మా తదనంతరం ఈ ఆస్తి రజనికే చెందుతుంది కదా?"
"ఆఁ ఆఁ, అది నిజమే ననుకోండి. మీ ఆస్తి మీ పిల్లకు కాక ఇంకెవరికి చెందుతుంది?" కోమలమ్మ వుప్పొంగిపోతూ అంది.
ముఖంలో మనసును చదివేయగల నేర్పరి జగన్నాధరావు. కోమలమ్మ అంతర్యమేమిటో గ్రహించిన అతడు గుంభనంగా నవ్వుకున్నాడు. పిల్లను అత్తవారింటికి పంపేవుద్దేశ్యం ఆయనకు అసలులేదు. ఈ సంగతి ఇప్పుడే బయట పడితే ఈ సంబంధం కుదరదు. మనోహర్ ను చూశాక, అతడి అందచందాలు చూశాక ఇతడిని ఎంతమాత్రం జారిపోనివ్వకూడ దనుకున్నాడు. పిల్ల, పిల్లవాడు ఒకటయ్యాక పిల్లను విడిచి అతడెక్కడికి వెడతాడు? అప్పుడీ గుంటనక్క ఏ గోతిలో వెళ్ళి దిగుతుందో?
* * *
