"... సమస్త దుర్దోష శమనం, శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభం." మూడుమార్లు తీర్థంయిచ్చి, తీర్థంగిన్నె దేవుడి దగ్గర పెట్టి నమస్కరించి లేచారు ఆయన.
తలొంచుకొని వెళ్ళి మౌనంగా భోజనం ఏర్పాట్లు చేయసాగింది కృష్ణవేణి.
ప్రతిదీ తనతో చెప్పుకోనిదే ఉండబట్టలేని ఆమె ఆరోజు మౌనం వహించడం ఆశ్చర్యంగా గొల్పిందాయనకు. "కొడుకు మీద అలుకకదా ఇది! నాతో చెప్పుకొని లాభం లేదనుకొందేమో? నేను మాత్రం వాడిని సమర్థించక చేసేదేముంది? అన్నీ తెలిసిన నేనే "నువ్వు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావురా" అని దండించగలవా?" మధనపడ్డారు.
భోజనం చేసి తమ గదిలోకి వచ్చారు రావుగారు. ఆయన వెనకే వచ్చిన కృష్ణవేణి, మూలకున్న చిరిచాప క్రింది పరుచుకొని పడుకుంది.
"అందరూ దేవుడి మీద భక్తితో ఉపవాసాలుంటే నువ్వు కొడుకు మీద కోపంతో ఉపవాసాలుంటావు" భార్య భోజనం చేయకుండా వచ్చి పడుకుందని ఆయన మనసులో కలతగా ఉన్నా పైకి పరిహాసంగానే మాట్లాడారు.
అక్కడికీ పెదవి కదల్చలేదు కృష్ణవేణి.
"కర్మ సంచితమనే ఇంజన్ కు తగిలింపబడ్డ డబ్బాలీ జీవితాలు ఇంజన్ లాగుతూంటే నిమిత్త మాత్రంగా నడిచే డబ్బాలివి! ఈ రహస్యమే గుర్తించమని నేను చెప్పేది. పూర్వవాసనాలతో నడపబడుతున్నవాడు భార్గవుడు. అతడిని నిందించి దోషమే. అసలు అతడున్నది సత్యపధంలో. జననమందినదాది మరణించేవరకూ మానవుడు ముక్తిసాధన జరిపినా కొన్ని జన్మ పరంపరలు కావాలని మహానీయులు చెబుతారు. వయసు ఉడిగి విషయవాంఛలు వదిలాక అప్పుడు సాధించేదేముంటుంది?
నన్నుచూడు! సంసార తాపత్రయంలోనే అర్ధ శతం గడిచిపోయింది ఆయువులో. ఇవతల బ్రతికేది కొన్నాళ్ళు. బ్రతికినా జరాభారంతో రోగబాధలతో ఆ సర్వేశ్వరుని నేను కొలిచేదేమి? తరించేదేమి? అమూల్యమైన ఈ మానవజన్మ నిరర్థకమైపోయినట్లేకదా?
విషయవాంఛలు జయించలేకేకదా, ఈ సంసార లంపటంలో తగుల్కొన్నది. ఆ వాసనా రహితుడిని బలవంతాన లంపటంలోకి ఈడ్చి, పతనానికి దారిచూపడమేంబాగు? మనం తరించలేకపోయినా, తరింపగోరేవాళ్ళను చెడగొట్టడం పాపమేకదా?
"మాతృప్రేమ అన్నది నిన్ను అజ్ఞాన తిమిరంలో పడవేస్తున్నది. వేణూ! పుత్రుని కన్నావుగాని అతడి కష్టసుఖాలు, మంచిచెడ్డలు కనలేదుకదా? ఎందుకీ దుఃఖం, అలుక, ఆగ్రహం"
కృష్ణవేణి లేచి, మోకాళ్ళచుట్టూ చేతులు చుట్టి కూర్చొంది.
"పతి పుత్రులపై మమకారం కలిగి ఉండడం స్త్రీకి పాపంకాదనుకొంటాను. వీడు నా కొడుకు, నా కోరిక తీర్చడం వీడి ధర్మం అనుకోవడం దురాశకాదు, అజ్ఞానం అంతకంటే కాదు."
చాలాసేపు నిరుత్తరంగా కూర్చుండిపోయారు రావుగారు "మరి చేయగలిగిందేమిటి, వేణూ? అతడి దోవ ఏదో అతడు చూసుకొన్నాడు."
"ఇలాంటి వాడు మనం చస్తే తలకొరివి పెడతాడని, శ్రాద్ధకర్మలు చేస్తాడని ఏం నమ్మకం?"
"ఎవరి పాపపుణ్యాలు వారివి! మనం చేసుకొన్నవి పాపాలయితే అతడుపెట్టే పిండాలతో మనం స్వర్గవాసం చేస్తామా?" అనాలనుకొన్నారు. కాని ఆమె జీర్ణించుకొన్న తరతరాల హైందవస్త్రీ సంస్కార దృక్పథంలో ఈ మాటలు సారవిహీనాలు!" మౌనమే వహించారు రావుగారు.
అప్పటికి అత్తయ్య బ్రతికే ఉన్నది. కాపరానికి వచ్చిన పదేళ్ళవరకూ నా కడుపు పండలేదు. అప్పుడు అత్తయ్య ఎంతగా పోరు పెట్టసాగింది, పిల్లలకొరకు తిరిగి పెళ్ళి చేసుకొమ్మని? మీరు ఒప్పుకోలేదుగాని, అన్ని సమయాలు మనవి కాదుగా? ఏ క్షణాన మీ మనసు మారిపోతుందోనని రేయింబవళ్ళు కుమిలికుమిలి చచ్చాను! మీరు నాకు దూరం కారాదని కోటి దేవుళ్ళను ప్రార్థించాను. పున్నామనరకం నుండి తప్పించేందుకు ఒక్క పుత్రుడినైనా ఇమ్మని కనిపించిన ప్రతి రాతికిరప్పకు మొక్కాను. ఏ గుడికి చెప్పినా ప్రదక్షిణాలు చేశాను. ఏ అమ్మ ఏ సలహా యిచ్చినా తుచ.తప్పకుండా ఆచరించాను. ఆ పిల్లలంటే ఎంత ఇది? అని సాటిస్త్రీలు వెక్కిరించినా లక్ష్యపెట్టలేదు.
"నా దీర్ఘ తపస్సు ప్రతిరూపం నేడింత అలక్ష్యంగా సంచరించడం నా మాతృహృదయం ఎలా సహించగలదో చెప్పండి!" కృష్ణవేణి కళ్ళనుండి జలజలా కన్నీళ్ళు కారసాగాయి.
ఆమె దుఃఖం చూచి కదిలిపోయాను రావుగారు "నా చేతిలోపనా, ఆమె దుఃఖం నివారించడం?" అనుకొన్నారు నిస్పృహగా.
స్నాన భోజనాలకు క్రిందికి వచ్చిన భార్గవరామ్ తిరిగి పైకి వెళ్ళిపోయాడు.
