Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 27


    "వయసొచ్చిన పిల్లలు వ్యక్తిత్వం సంతరించుకోవడం సహజమే కదా? వ్యక్తిత్వమంటేనే స్వతంత్రం!"

    "అందుకే, వయసురాకముందే ఆడపిల్లకు పెళ్ళిచేసి  పంపాలని అంటారండి - ఇలా నెత్తికెక్కడానికి తయారవుతారనే!"

    "ఆదర్శమాతగా పేరు తెచ్చుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది?" అన్నాడు కృష్ణారావు కొంచెం హాస్యంగా.
 
    "ఏం ఆదర్శాలెండి!  ఒక్కగానొక్క పిల్ల! ఆటాపాటా వస్తే ముచ్చటగా వుంటుందని నాట్యం, సంగీతం చేర్పించాం. ప్రోగ్రాములివ్వమని ప్రోత్సహించాం. ఈ కాలంలో ఆడపిల్లలు చదువుకోకపోతే కష్టమని అందరితోపాటు చదివించాం. ఇప్పుడది మనల్నే ఎదిరించడానికి తయారైతే ఎలా? కట్నం తీసుకొనే అబ్బాయిని పెళ్లిచేసుకోదట కట్నం తీసుకోని అబ్బాయిని మనం ఎక్కడనుండి తీసుకురాగలం?"చిటపటలాడినట్టుగా అంది హేమలత.

    "తనే తెచ్చుకొంటుందేమో!"

    "తెచ్చుకొంటుంది ఏ కులం కాని వాడినో. మతం కాని వాడినో ! నా బొందిలో ప్రాణముండగా అలా జరగనివ్వను!"

    "మనమ్మాయి మరీ అంత పెద్దది కాలేదని నా నమ్మకం! అనవసరంగా కంగారుపడకు! మంచీచెడ్డా తెలిసిన పిల్లేకాని బరితెగించిపోయే పిల్లమాత్రం కాదు!"

    "మీ ధైర్య మేమిటో  తెలియదుగాని, నాకుమాత్రం హరిత ఒక సమస్యగా తయారవుతుందేమొనని భయంగా వుంది."

    "ఇన్నాళ్ళు అది ఆటల్లో, పాటల్లో, చదువులో డిబేట్స్ లో తెచ్చుకొన్న బహుమతులూ ప్రశంసలూ చూసి మురిసాం. గర్వంతో ఉప్పొంగిపోయాం. ఆ ఆనందానికి బదులు ఇవ్వవల్సివస్తే మనం  వెనకడుగు వేయకూడదంటాను"

    "అంటే ఏమిటి అర్దం?"

    "హరిత వ్యక్తిత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలంటాను."

    "తండ్రీ కూతురు ఏకమైనన్ను ఏడిపిస్తారా ఏమిటి?" ఆవిడ భయంగా చూసింది భర్తకేసి.
 
    "భయపడకు! నేను నీ పక్షమే."



                      *    *    *    *   

   
    ఆరోజు హరిత కాలేజీ నుండి వచ్చేసరికి పక్కింట్లో వుండే ప్రమీల అనే ఆమె తల్లితో మాట్లాడుతూ కనిపించింది. హరిత పలకరింపుగా స్నేహపూర్వకమైన  నవ్వు నవ్వి డ్రెస్సు మార్చుకోడానికి గదిలోకి వెళ్లింది.

    "ఏ రాత్రో లేచి చెప్పకుండా పారిపోదామనిపిస్తుంది పిన్నిగారూ! ఎక్కడికి వెళ్లాలి?పుట్టిల్లు వున్నా వెళ్ళలేను. పెళ్లిచేసి నన్ను అత్తారింటికి పంపి పుట్టెడు అప్పుల్లో మునిగిపోయారు. మునిగిపోయినా పిల్లను ఓ ఇంటిదాన్ని  చేశామన్న తృప్తితో వున్నారు వాళ్లు. నేను వెళ్లినా బాధలన్నీ ఏకరువుపెట్టి  వాళ్ల మనశ్సాంతి చెడగొట్టలేను.  చెడగొట్టినా ఎన్నాళ్ళో భరించలేరు నన్ను వాళ్లు. ఇంకా పెళ్లి కావలసిన పిల్లలున్నారు. మా నాన్నది బొటాబొటి సంపాదన. అన్నయ్య అయిదేళ్ళ నుండి నిరుద్యోగిగా వున్నాడు... ఇక్కడే ఈ రాక్షసుల చేతుల్లో చావటంతప్పితే నాకింకేమీ దారి కనిపించడంలేదు!" కన్నీటితో వాపోయింది ప్రమీల.

    "ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి గాని అధైర్యపడితే ఎలా?" ఊరడింపుగా అంది హేమలత.

    "ధైర్యం తెచ్చుకోడానికి నాకేముందని?"

    "ఎంతవరకు చదివావు?"

    "ఎస్సెస్సీ. పెద్ద పెద్ద డిగ్రీలున్న వాళ్లకే ఉద్యోగాలు లేవు. నాకెవరిస్తారు?"

    "ఆడదానికి అత్తవారిల్లు మయచర అయినప్పుడు ఉద్యోగం ఒక్కటే పరిష్కారం అవుతుందా? ఆడదానికి తన బ్రతుకు తను బ్రతకడం ఒక్కటే ముక్యంకాదు. భర్త అత్తవారిల్లు వున్న తీరు వేరు. పెళ్లయిన పిల్ల ఏకాకి జీవితం గడపడం ఎంత ప్రమాదం?  ఎంత దుర్బరం?" అని ఆలోచించిన హేమలత  "నువ్వు కొంచెం ఓపికపట్టాలి. ప్రమిలా! ఇప్పుడు నీ భర్తను ఉసిగొల్పే మీ అత్తగారు ఎల్లకాలమూ వుండబోదు! నీకంటూ ఒక సంసారం  నెమ్మదిగా ఏర్పడుతుంది. నీకు పెళ్లయ్యి ఏడాదేగా అయింది! ఒకరిద్దరు పిల్లలు పుడితే  నీ భర్తలో  తప్పకుండా మార్పు వస్తుంది నా పిల్లలూ, నా భార్య అన్న మమకారం కొంత మంది మగాళ్లలో పిల్లలు పుట్టాకే ఏర్పడుతూంటుంది!"

    "ఈ నరకంలో నేను పిల్లలకి జన్మనివ్వడం కూడానా? వద్దండీ!"

    "కరెక్ట్ ప్రమిలగారూ!" అంటూ వచ్చికూర్చుంది హరిత. "మీ ఆలోచన సరైంది. మీ బ్రతుకే మీకు బరువు కాగా మరో జీవిని ప్రపంచంలోకి ఆహ్వానించి  ఆ జీవి బ్రతుకు భారం చేయొద్దు. ఆడపిల్లే పుడితే ఆమె బ్రతుకూ, మీ బ్రతుకూ మరీ ఘోరంగా తయారవుతుంది!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS