ఆశ్చర్యపోవడం కావేరి వంతు అయింది..."ఏదయినా మన ప్రయత్నం వుంటే సాధించలేనిదంటూ వుండదు!ఆ ప్రయత్నంలోనే వున్నాను!..." అన్న మాట కావేరి మనసులో నాటుకుపోయింది....నిజానికి నాగులు ఆ పల్లెలోనే వుండి పాలేరుతనం చేస్తూ వుంటే మురికి ఆడుతున్న బట్టలతో అలాగే వుండేవాడుగా? యిప్పుడింతగా వున్నాడూ అంటే తన పట్టుదలే కారణం? ఎవరెన్ని చెప్పినా వినలేదు! అందరినీ కాదనుకుని తెగించి రాబట్టేకదా? ఒక్కొక్కటే నేర్చుకుని పైకి రాగలుగుతున్నాడు??
ఇంతలో ఓ కుర్రవాడు కారియర్ తీసుకుని లోపలిని వచ్చాడు. కర్టెన్ వెనుక మరో రూం వుంది. అక్కడికి తీసుకెళ్ళి వుంచాడు.
"అన్నీ పెట్టాను సార్!" అంటూ వచ్చాడు ఆ కుర్రవాడు.
"నువ్వు వెళ్ళి మన హాల్ కాంటీన్ లో నుంచి రెండు గోల్డ్ స్పాట్స్ పాకెట్టు క్రీం బిస్కట్లు తీసుకునిరా!" అన్నాడు.
"ఇప్పుడేమీ వద్దు నాగులూ! భోంచేసి వచ్చాము..." వారించబోయాడు వినాయకం!
"కొత్త కాబోయే దంపతులు అభిమానంతో నా రూంకి వచ్చి నందుకయినా మీకు చిన్న పార్టీ యివ్వవద్దూ? ....నేనంటే అమ్మాయి గారికి ఎంతో అభిమానం! వారి ఆశీస్సులవలెనే యింతవరకూ వచ్చాను. యింకా వస్తానన్న ఆశ వుంది....ప్రతిదీ చూసి అర్ధం చేసుకుంటున్నాను....మీకని అవన్నీ దాచి వుంచాను...నేను వచ్చినప్పుడు తీసుకువస్తానుగా!" అన్నాడు...
"యిప్పుడే తీసుకువెళ్తాను..."అంది చప్పున...
"ఎలా??.."అనడిగాడు వినాయకం.
"సైకిల్ కి వెనక్కి కట్టితే సరి! నాగులు ఎప్పటికి వస్తాడో? ఏమో? ఈ లోపలే చూసుకోవాలి నేను! ఎలాగూ వచ్చాముగా!" చప్పున అంది కావేరి.
ఇంతలో కుర్రవాడు బిస్కట్ పాకెట్టు గోల్డ్ స్పాట్ సీసాలు తెచ్చి టేబుల్ మీద వుంచి లోపలినుంచి రెండు ప్లేటులు తీసుకుని వచ్చి బిస్కట్లు అందులో వుంచి యిద్దరికీ యిచ్చాడు...రెండు గాజుగ్లాసుల్లో మంచినీళ్ళు తీసుకువచ్చి వుంచాడు.
"మీరు తీసుకుంటూ వుండండి! నేను భోజనం చేసివస్తాను!" అని లోపలికి వెళ్ళాడు! కొంతసేపటికి వేటమాంసం కూర వాసన వచ్చింది....బొమికలు పటపట మని విరుగగొడుతున్న చప్పుడు, ముక్కలు పీక్కుతింటుంటే వచ్చేశబ్దం....
"నాగేంద్రంగారూ!" వీధిలోనుంచి ఎవరో పిలిచారు. నాగేంద్రం ఎవరా? అని అటు యిటు చూసింది కావేరి.
"ఎవరో చూడరా??" భోజనం చేస్తూనే పురమాయించాడు. ఆ కుర్రావాడు బైటికి వెళ్ళి వచ్చి అన్నాడు.
"షావుకారు చలమయ్యగారు! మీతో మాట్లాడాలట!"
"ఇప్పుడు కుదరదు...రేపు సినిమాహాలు దగ్గిరకు రమ్మనమను!"
కుర్రవాడు వెళ్ళి నాగులు చెప్పమన్నది చెప్పాడు.
నాగులు పేరు నాగేంద్రం అయినందుకు ఆశ్చర్యపోయింది.
బ్రేవ్ మంటూ త్రేన్చుకుంటూ తుండతో చెయ్యి తుడుచుకునియివతలకి వచ్చాడు.
"రూంకి రావటం ఆలస్యం! యిలా తిరుగుతారు...ఈ చలమయ్య రెండు సినిమాలు కొన్నాడు మా హాలులో ఆడించితే కమీషన్ నాకూ యిస్తాడట? ఫిఫ్టీ ఫిఫ్టీ పంచమంటున్నాడు..."
"హాలు యజమానితో చెప్పకపోయావా?? అడిగాడు వినాయకం.
"ఆయనిదేమీ లేదు. మొత్తం అంతా నాదే అజమాయిషీ! ఆయనకీ సీసాలు పేకాట వుంటే చాలు! ...యివన్నీ నేను చూసుకోవలసిందే! వీళ్ళందరికీ జవాబు చెప్పలేక విసుగు పుడుతోందనుకోండి! ఓ సినిమా హాలు కట్టించుకుంటే ఎన్ని సినిమాలయినా కొని ఆడించుకోవచ్చునంటాను చలమయ్యగారితో! లక్షలకి లక్షలున్నాయి. ఏం చేసుకుంటాడో? ఏమో??"
నాగులు అలా చెప్పుతుంటే ఆశ్చర్యపోతోంది కావేరి!
"మొదటి ఆట వదిలే టైం అవుతోంది. వెళ్దామా?" అన్నాడు.
"ఆ...ఆ..సినిమా..పుస్తకాలు!" అనలేక అంది.
"నేను మార్చేపోయాను అమ్మాయిగారూ! ఒరే బాసిగా! ఆ పుస్తకాలను వాల్ పోస్టర్సుని సైకిల్ కి అడ్డుకమాను వుంటుంది. తాడుతో బిగించి కత్తి తలుపులన్నీ వేసుకుని తాళంపెట్టి సైకిల్ ని సినిమా హాలు దగ్గిరకు తీసుకుని రా! మేము వెళ్తాము..."
అంటూ ఆ యిద్దరినీ తీసుకుని బైటికి వచ్చాడు నాగులు!
ముగ్గురూ ఒకరి ప్రక్క మరొకరుగా నడుస్తున్నారు. దారిలో సినిమా హాలుకి సంబంధించైనా విషయాలు తాను ఎన్ని విషయాలు తెలుసుకున్నదీ వివరించుతున్నాడు.
"నమస్కారం నాగేంద్రరావుగారూ!" మోటార్ బైక్ మీదనుంచి వస్తున్న ఒకాయన అంత దూరంలోనే ఆపుకుని చేతులు జోడించాడు.
"నమస్కారం!...ఎలా వుంది మీ హాలు కలెక్షన్??...కొత్త బొమ్మ తెచ్చారా? రెంటల్ గానా? పర్సంటేజీతోనా??" నాగులు అడిగిన వాటికన్నింటికీ జవాబు చెప్పి యింకా యేమిటో మాట్లాడుకుని నాగేంద్రం దగ్గిర సెలవు తీసుకుని మోటార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి!
సినిమాహాలు దగ్గిరకు వెళ్ళగానే ఒకబ్బాయిని పిలిచి__
"వీరిద్దరినీ రిజర్వుడ్ క్లాసులు కూర్చోపెట్టు! సీట్లు లేకపోతే రెండు చైర్స్ ఆఫీసులోవి తీసుకువచ్చి వెయ్యి!" అన్నాడు.
"అలాగే బాబూ!..."
అంటూ ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి చూసి వచ్చి కాలీలు లేకపోయే సరికి రెండు కుర్చీలు తెప్పించి వేసి వారిద్దరినీ రమ్మన్నాడు.
"మీ సైకిల్ ఆఫీసు దగ్గిరగా వుంటుంది. కుర్రవాడు అప్పగించుతాడు. నేను రెండవ ఆట కలెక్షన్ లెక్క చూసుకుని బీరువాలో వుంచి తాళం వేసుకుని యింటికి వెళ్ళిపోతాను. నిద్ర చాలక ఆ మధ్య కళ్ళు ఎరుపులు వచ్చాయి. నేను లేనని ఏమీ అనుకోవద్దు! సినిమా చూసి వెళ్ళండి!" అన్నాడు వినాయకరావుతో!
"టిక్కెట్లకి డబ్బులు తీసుకోలేదు!" జేబులో చెయ్యి పెట్టాడు.
"అదేమిటండీ? మీరు నా గెస్ట్ లు! నా సినిమా హాలులో మీరు టిక్కెట్లు కొంటారా! నాకు అమర్యాద చేసిన వారవుతారు. లోపలికి తీసుకువెళ్ళరా?...ఇంటర్వెల్ లో వేడి వేడి టీ తీసుకెళ్ళు యివ్వు! సినిమాఅయినా తరువాత అన్నీ సర్దుకుని మరీ పడుకోండి! జాగ్రత్త! వస్తాను బాబూ!" అంటూ నాగులు అనబడే నాగేంద్రం ఆఫీసు వైపుకి వెళ్ళిపోయాడు ఎంతో దర్జాగా!
ఆశ్చర్యపోతూ వెళ్తున్న నాగులు వైపుకే అవాక్కయి చూస్తూ వుండిపోయింది కావేరి!....
