"సాయంత్రంకల్లా విషయం తేలిపోతుందేమోలెండి" అంటూ భవానీ సముదాయిస్తున్నట్టు అంది.
"నేనుగూడా ఇక్కడే రమణిని చూస్తూ ఉంటాను." అంది రాజేశ్వరి.
"ఇక నేను రావచ్చా?" అన్న రమణి మాటలు విని అంతా అటు చూశారు 'రా' అన్నట్టు రాజారామ్ సైగ చేశాడు.
"అన్నట్టు చైర్మన్ గారితో ఓ రెండు మాటలు చెప్పి వస్తాను" అంటూ చైర్మన్ గదిలోకి వెళ్ళాడు రాజారామ్.
గదిలో మంచంమీద తలగడకు వీపు ఆనుకుని పడుకుని ఉన్నాడు రాజభూషణరావు. రాజారామ్ రాగానే 'కూర్చోమన్నట్టు' మంచం పక్కనే ఉన్న కుర్చీని చూపించాడు.
"రాజా, మీ అమ్మాయి చాకులాంటి పిల్ల, చాలా తెలివైంది సుమా... బాగా చదివించు." అన్నాడాయన హీనస్వరంతో.
"నేను రమణిని తీసుకుని ఇక్కడికి దూరంగా ఎటైనా వెళ్దామనుకుంటున్నాను సార్."
"కాని పోలీసులు ఒప్పుకోరేమో!"
"ఏమైనప్పటికీ నేను 'ఆంధ్రాటైమ్స్' నుంచి తప్పుకోవడం మంచిదనిపిస్తోంది సర్."
"ఎంచేతో విరించికికూడా అదే అభిప్రాయం ఏర్పడింది. నిజానికి నిన్న రాత్రి అతనిదే విషయం నాతో చెప్పాడు. అందుకే నిన్నివాళ రమ్మన్నాను. విరించి ఏమన్నాడో తెలుసా?'నేను కావాలో, రాజారామ్ కావాలో తేల్చుకోండి" అన్నాడు. విరించిని నేను దూరం చేసుకోగాలవా నువ్వేచేప్పు." అని ఆగాడు.
"అందుకే నేను ఉద్యోగం మానేస్తా నంటున్నాను."
"ఓ మాట చెప్తాను వింటావా రాజా! నీ మీద నాకు చాలా గురి గౌరవం ఉన్నాయి. నువ్వు ప్రతిభగలవాడివి. నీ ప్రతిభ నా సంస్థకి చాల అవసరం అని నా నమ్మకం అంతే కాదు, నువ్వు నిర్దోషివని కూడా నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు ఉద్యోగం మానవద్దు. నీకు ఒక సంవత్సరం సెలవు ఇస్తున్నాను, పూర్తి జీతం మీద. ఈలోగా నీ పరిస్థితులు చక్కబడతాయి. ఓకే?"
"థాంక్యూ సర్"
"నిజానికి సెలవుతీసుకోవాల్సింది నువ్వుకాదు, విరించి! అతనీమధ్య అదోలా ప్రవర్తిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకూ నువ్వంటే ఎంతో ఇష్టపడేవాడు. ఇవాళ ఇలా మారాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అప్పారావుతో విరించికి అంత గాఢమైన స్నేహం ఏమిటో కూడ నాకు అర్ధం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం. నన్ను ఫూల్ చెయ్యడం ఎవరికీ సాధ్యంకాని పని. నాకు అందరి బలహీనతలూ తెలుసు. విరించి వీక్నెస్సులు కూడా తెలుసు. కాని ఏం చెయ్యను? అలా అని చూస్తూ ఊరుకోలేను. అయ్ హోవ్ యూ అండర్ స్టాండ్ మీ?" అన్నాడు చైర్మన్.
అంతలో తలుపుమీద ఎవరో తట్టిన చప్పుడైంది. గుమ్మంలో భవాని నిలబడి ఉంది. "రాజారామ్ గారూ మనం బయలుదేరాలి!" అంది.
రాజారామ్ నిలబడ్డాడు.
"వెళ్ళిరా రాజా.....నెలరోజుల్లో నిక్షేపంలా తిరిగిరా!" అన్నాడు చైర్మన్.
"థాంక్యూ సర్!" అంటూ గుమ్మంవేపు నడిచాడు రాజారామ్.'
రమణిని ఎత్తుకొని గట్టిగా బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాడు. "రాజేశ్వరి ఆంటీ చెప్పినట్టు వినాలమ్మా ఏం?" అన్నాడు.
"అలాగే డాడీ?"
రమణి కళ్ళలో నీళ్ళు ఉరకడానికి తయారుగా ఉన్నాయి. అది చూడలేక పోర్టికో వేపు నడిచాడు రాజారామ్. అక్కడా ఆగి ఉన్న జీప్ లోకి భవానితోపాటు ఎక్కాడు. జీపు కదిలింది.
"చెవిరింగు విషయంలో దుర్గారావు గారు చెప్పినా పాయింటు కరెక్టేననిపిస్తోంది. దాన్నెవరో కావాలని అప్పారావుగారి గదిలో పడేశారు. సుందరి ఇంకా బతికే ఉందని భ్రమ కలిగించడానికి ఆమె సూట్ కేస్ వగైరాల్ని ఆమె గదిలోకి తెచ్చి ఉంటాడు. ఆ సమయంలో సుందరి చెల్లెలు సుమిత్ర అతన్ని గమనించి వుంటుంది. ఆ కారణంగానే సుమిత్రకూడా నిష్కారణంగా హత్యకు గురై వుంటుంది." అంది భవాని.
"నాకొకటే ఎంతకీ అర్ధం కావడం లేదు. సుందరిని ఎవరైనా ఎందుకు చంపి వుంటారు? అలాగే అప్పారావు హత్యకి కూడా కారణం ఏమిటి? పైగా ఇద్దరూ రెండు రోజుల తేడాలో వేలాది రూపాయలు పంచుకున్నారు. వాళ్ళిద్దర్నీ చంపాల్సిన పనేముందసలు?" అన్నాడు రాజారామ్.
"బహుశా ఇద్దరూ కలిసి ఏదో ముఠాకి పనిచేస్తూ ఉండి ఉంటారు. వాళ్ళ బాస్ కి కోపం వచ్చే పనేదో చేసి అతని కోపానికి గురై ఉంటారు."
"కరెక్టు. అందుకే సుందరి ఫోటో పేపర్లో వేస్తానంటే అప్పారావు అంత గొడవ హంగామా చేశాడు. సుందరి చచ్చిపోయిందని లేదా చంపేశారని, అప్పారావుకి అంతకు ముందే తెలిసి ఉంటుంది." సాలోచనగా అన్నాడు రాజారామ్.
"అప్పారావుగారు సుందరిని హత్య చేశారని మీరనుకుంటున్నారా రాజారామ్ గారూ?"
"అదే జరిగి వుంటే సుందరి చెవిరింగు అతని గదిలో దొరికే అవకాశమే ఉండేది కాదు." అన్నాడు రాజారామ్.
అంతలో-అల్లంత దూరాన 'ఆంధ్రా టైమ్స్' ఆఫీసు కనిపించింది అతనికి. "భవానీగారూ, జీపుని కాస్తా మా ఆఫీసు ముందు కాసేపు ఆపండి. నా పర్సనల్ వస్తువులు కొన్ని నా టేబిల్ సొరుగులో ఉన్నాయి. అవి తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ ఆఫీసులోకి అడుగుపెట్టే ఆవకాశం ఉంటుందో ఉండదో!" అన్నాడు.
'ఆంధ్రా టైమ్స్' ఆఫీస్ ఆవరణలో పోలీస్ జీప్ ఆగింది. రాజారామ్ తో భవానీకూడా ఆఫీసులోకి నడిచింది.
ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ చేరుకున్నారు. ఆఫీసు వాతావరణం ఎప్పటిలా హడావిడి ఉంది. రాజారామ్ తన టేబిల్ సొరుగు తీశాడు. రమణి రెండేళ్ళ పాపగా ఉన్నప్పుడు తీసిన ఫోటో....చనిపోయి జ్ఞాపకాలు మిగిల్చి ఇచ్చిన భార్య బహూకరించిన పార్కర్ పెన్ను....తీసుకుని జేబులో వేసుకున్నాడు.
