హేమ నళిని కనుబొమలు ముడి వేసి అతని వైపు ప్రశ్నార్ధకంగా చూసింది అర్ధం కానట్లు.
'గంగ సాక్షాత్తూ నాకు మేనత్త కూతురు. నేనే ఆ పిల్లని చేసుకోకపోతే అసలీ జన్మకే గంగకి పెళ్ళి కాదని అత్త అంటూ వుండేది. నేను నిజమే అనుకునే వాడిని. కానీ మధ్యలో కధ అడ్డం తిరిగింది. డిల్లీ వచ్చాను. నేను తిరిగి యింటికి వెళ్లి నెలరోజులు వున్నానో లేదో పిడుగు లాంటి వార్త విన్నాను. గంగకి పెళ్లి అయిపొయింది.'
'అదెలా?'
"నాకూ తెలియదు.'
'తమ్ముడు కృష్ణ మోహిని ని చేసుకున్నందుకు వాడిని యింటికి రానివ్వలేదు నాన్నగారు. అటువంటిది నిన్ను యిస్తానని మీ నాన్నగారు రాస్తే యెలా వొప్పు కున్నారో అర్ధం కావడం లేదు.'
'ఒక సంగతి అడగనా శ్రీకాంత్.'
'అడుగు నువ్వు అడిగితె నా బాదే చెప్పుకోవాలను కునే వాడిని ఒకప్పుడు. యిన్నాళ్ళూ యిల్లూ, వుద్యోగం వీటితో కాలం దొర్లిస్తూ వచ్చాను. అప్పటి మటుకు చాలా హాయిగానే అనిపించినా గంగని మరెవరో చేసుకోవడం నా గుండెల్ని కోస్తున్నది. నిజం తెలుసుకోవాలి. అందుకే నేను ఏకాయేకి హైదరాబాదు వెడుతున్నాను.'
'నేనంటే మీకు యిష్టం లేదా?' అమాయకంగా అడిగింది హేమ నళిని.
'యిష్టం .' శ్రీకాంత్ తృప్తిగా నవ్వాడు. 'నువ్వంటే నాకు యెంత యిష్టమో యెలా చెప్పను. నేను వర్ణించలేను. నాకు చేత కాదు.'
'మరైతే యెందుకు పెళ్ళి చేసుకోరూ.'
'పిచ్చిదానా !' అతను కాస్సేపు ఆగి అన్నాడు. 'ఈ లోకంలో యిష్టాలు యెన్నో రకాలు. గంగని తప్ప మరొకర్ని చేసుకోవాలి చేసుకోవలసి వస్తుంది అని నేనెన్నడూ వూహించలేదు. యివాళ గంగ దూరం అయిపోగానే నా శరీర భాగంలో ఏదో అవయవం జారి పోయినట్టుంది.
'మొదటి సారి నిన్ను డిల్లీ స్టేషను లో చూసినప్పుడు మా గంగ కన్న అందమైన వాళ్ళు వుంటారన్నమాట అనుకున్నాను. నేను కలకత్తా వెళ్ళే ముందు నువ్వు వచ్చి జ్ఞాపకం వుంచుకోమని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకున్నావు. అప్పుడు మా అమ్మ కనిపించింది నీ మొహంలో. నిన్ను అత్మీయురాలిగా , మించిన సోదరి గా తప్ప మరే వుద్దేశ్యం తోనూ నేను చూడలేదు.'
'శ్రీకాంత్!' హేమ నళిని గొంతు లోంచి మాటలు బలవంతాన వచ్చాయి.
'నేను అందరి లాగా పెళ్ళికి యిష్టపడక నిన్ను సోదరి లా చూస్తున్నానని అంటున్నావనుకోవద్దు. మా అమ్మ తప్ప యెవరూ లేరు నాకు అనిపిస్తోంది యిప్పుడు. కానీ నాకు నువ్వు కూడా వున్నావు.'
హేమనళిని వేర్రిదానిలా నవ్వింది. 'మరి యెప్పుడూ కూడా మీరు పెళ్ళి చేసుకోరా?'
శ్రీకాంత్ అన్నాడు. 'పెళ్లి చేసుకోకుండా యిలాగే వుండి పోతానని భీష్మ ప్రతిజ్ఞా చేయను కానీ నాకు వివాహం మీద అంత సుముఖత లేదు.'
'యెప్పుడైనా నేను గుర్తుకు వస్తే డిల్లీ వస్తారు కదూ. మిమ్మల్ని ప్రేమించినందుకు ఈ జన్మ కి యిలాగే వుండి పోతానని పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పడం నాకూ యిష్టం వుండదు. నిజానికి యిది నాకు మంచి షాక్. ఈ షాక్ నుంచి కోలుకుని మళ్ళీ మీకు యెప్పుడైనా యెక్కడైనా భర్తతో పిల్లలతో కనిపిస్తానెమో. నేను పెళ్ళే చేసుకోను అని అలా చేయడం చిత్రంగా వుంటుంది.'
'మగవాడి ,మాట యెలా వున్నా ఆడపిల్లకి సమాజం లో సగర్వంగా తలెత్తుకునేందుకు వివాహం చాలా అవసరం అని కొంత ఆలశ్యంగా గ్రహించాను. మీరు చేసుకోనన్నారని మిమ్మల్ని దూషించలేను. యెవరికి యెంత ప్రాప్తో అంతకు మించి కోరుకోవడం అత్యాశ తప్ప యింకేమౌతుంది? నేను వెడుతున్నాను' హేమ నళిని గొంతులో దుఃఖం తెరలు కట్టలు తెంచుకు వస్తుంటే కదిలి వెళ్ళిపోయింది.
శ్రీకాంత్ దీర్ఘంగా నిట్టుర్పు విడిచాడు.
ఆవేళ ప్రతీసారీ మాదిరి కూతుర్ని కూడా వెంట బెట్టుకుని వచ్చి వీడ్కోలు యివ్వలేదు రామచంద్ర చౌదరి.
అతను వుత్సాహంగా లేడు. పద్మనాభం మాట్లాడుతున్నాడు. శ్రీకాంత్ తో. 'త్వరగా రండి మీరు వెళ్ళిపోతే యిల్లు చిన్నబోయినట్లుంది. మీరు వచ్చాక నాకు చాలా సందడిగా వుంది. నమ్మండి యిన్నేళ్ళ విద్యార్ధి జీవితంలో నేను ఎవర్నీ స్నేహం చేసి యెరుగను.' అన్నాడు.
శ్రీకాంత్ అన్నింటికీ 'వూ' అంటున్నాడు.
స్టేషన్ చేరుకున్నాక రామచంద్ర చౌదరి అన్నాడు. 'అది పుట్టాకే నేను లక్ష్మీ కటాక్షానికి పెట్టి పుట్టానని నమ్ముతాను. అదృష్టం అప్పుడే తలెత్తింది నాకు. దానికి లేనిపోని ఆశలు కల్పించాను. అది ఏడుస్తుంటే చూడలేక పోయేవాడిని. ఈ మాట మనసులోంచి పోయేందుకు కొంత వ్యవధి తీసుకుంటుంది. అంతవరకూ కూడా ఏడిపించిన వాడి నయ్యాను. అది స్టేషను కి రానంది. బలవంత చేయలేదు నేను. వెళ్ళగానే వుత్తరం రాయి.'
'అలాగే నండి' శ్రీకాంత్ బుర్ర వూపాడు. రైలు రావడం యేమిటి వెళ్లి పోవడం కూడా అంతే తృటిలో జరిగి పోయింది.
దారి పొడవునా తండ్రి కొడుకులు శ్రీకాంత్ పుట్టుక దగ్గర్నుంచీ చర్చించు కుంటూనే వున్నారు. రామచంద్ర చౌదరి కొడుకుతో అన్నాడు. 'యిప్పుడప్పుడే నువ్వు విదేశాలకి వెళ్ళద్దు. దాన్ని చూడు బాబూ' అని.
పద్మనాభం 'అలాగే నండి' అన్నాడు. యిద్దరూ యింటికి చేరుకునేసరికి హేమ నళిని గదిలో దీపం అయినా వేసుకోకుండా మంచం మీద నిద్ర పోయింది. యేడ్చినందువల్ల మొహం మీద చారికలు స్పష్టంగా కనిపిస్తుంటే తండ్రీ కొడుకులు నిట్టుర్చారు. కూతురిని లేపెందుకు తల్లి అప్పుడే వచ్చింది గదిలోకి. భార్యకి లేపవద్దని సైగ చేసి లైటు అలాగే వుంచేసి వెళ్ళిపోయాడు రామచంద్ర చౌదరి.
* * * *
హైదరాబాదు చేరుకున్నాక ముందు యెక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న బయలు దేరింది శ్రీకాంత్ కి. ముందు ఒక్కసారి గంగ దగ్గరికి వెళ్ళి చూసి వస్తే ....తమ్ముడిని చూడాలా? రాధిక ని చూడాలా?? యెటూ తేలలేదు. శ్రీకాంత్ కి చాలా సేపటి వరకూ . అతనికి తమ్ముడి స్నేహితుడు అరవింద యెప్పటి కప్పుడు వివరాలతో సహా వాళ్ళ గురించి రాస్తూనే వున్నాడు.
సనత్ నగర్ లో గంగ చిన్న సైజు మేడలో భర్తతో కాపురం వుంటున్నది. యిద్దరూ ప్రైవేటు గా డిస్పేన్సరీ తెరిచారు. యింటికి డిస్పేన్సరి కీ రెండు ఫర్లాంగులు దూరం వుంది.
శ్రీకాంత్ సూట్ కేస్ హోటల్లో పెట్టేసి గంగ యింటికే బయలుదేరాడు తిన్నగా. అతను యిల్లు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాలేదు.
యెండలో గడ్డం పూర్తిగా మాసిపోయి, మాసిన బట్టలతో తలుపు తట్టిన శ్రీకాంత్ ని అరక్షణం పరిశీలనగా చూసిన మీదట గానీ పోల్చుకోలేక పోయింది గంగ. పోల్చుకున్న తరువాత తలుపుకి కొంచెం యివతల నిలుచుని కుడి చేతి చూపుడి వేలితో బయటికి చూపిస్తూ 'యెందుకు వచ్చావూ? వెళ్ళు. తక్షణం నా యింట్లోంచి వెళ్ళిపో . నీకెవరూ లేరు. అయిన వాళ్ళందరూ వల్ల కాటిలో కలిసి పోయారనుకునే నువ్వా పని చేశావా? ఏం? గంగ యెలా వుందో కనుక్కోవాలనిపించిందా? గంగ కేం ఏప్. ఆర్.సి. యస్ (లండన్) చదివిన వాడిని చేసుకుని నిక్షేపం గా వుంది. హాయిగా బ్రతుకుతోంది. అనవసరంగా యింతదూరం ప్రయాస పడి వచ్చావు. యిక్కడ నీకు కావలసిన వాళ్ళు యెవరూ లేరు. ఆ గంగ చచ్చిపోయింది. యిప్పుడున్నది దేవేంద్ర భార్య గంగ. యిక్కడికి రోగులు తప్ప యెవరూ రాకూడదు. అది నా భర్త ఆజ్ఞ. కదులు . నువ్వెవరివో నాకు తెలియదు. అని రెండు చేతుల మధ్య మొహాన్ని దాచుకుని బావురు మన్నది గంగ.
శ్రీకాంత్ నీరు కారి పోయాడు. గంగ యెంతో వైభవంగా పెళ్లి చేసుకున్నదంటే ఏదో అనుకున్నాడు గానీ తనలాగా దుఃఖాన్ని దాచుకోలేని సమయం లో కుళ్లి కుళ్లి ఏడుస్తోందనుకోలేదు. తనేం చేశాడు?' శ్రీకాంత్ మరి ఒక నిమిషం కూడా అక్కడ వుండలేదు. తిన్నగా ఉమేష్ యింటికి వచ్చాడు. ఆకలికి అతని కడుపులో ప్రేవులు గోల చేస్తున్నాయి. గంగ రౌద్రాకారం అతన్ని వెన్నంటుతున్నది. అతనికి యిన్నాళ్ళ కి పెద్దగా ఏడవాలనుంది. తమ్ముడి యిల్లు బాంక్ స్ట్రీట్ లో వుంది. అతను వెళ్లి తలుపు తట్టగానే కృష్ణ మోహిని తలుపు తెరిచింది. అతన్ని చూడగానే "రండి.....లోపలున్నారు అయన. బావున్నారా బావా' అన్నది ఆప్యాయంగా.
గంగ తిరస్కృతి, కృష్ణ మోహిని ఆప్యాయతా శ్రీకాంత్ ని విచాలితుడి ని చేయసాగాయి. హల్లో అట సామాను ముందు ఆరు నెలలైనా లేని బాబు ఆడుకుంటున్నాడు. శ్రీకాంత్ అటు యిటూ చూడలేదు. ముందు వాడిని గబుక్కున ఎత్తుకున్నాడు. శ్రీకాంత్ చేతుల్లో బాబు అతన్ని కాస్సేపు చూసి కిలకిలా నవ్వేడు. పలకరింపు గా. శ్రీకాంత్ కి చెళ్ళున వీపు మీద చరిచినట్లయింది. కొన్నేళ్ళ క్రితం ఈ వయసులో చటర్జీ తననూ యిలాగే పలకరించేవాడేమో?
నెమ్మదిగా వాడిని దింపేలోగానే ఉమేష్ భార్య చెప్పిన కబురు విని ఇంచుమించు పరుగు లాంటి నడకతో వచ్చాడు. అన్న గారిని చూడగానే అతడిని వాటేసుకుని 'ఎన్నాళ్ళకి ? మళ్ళీ చూస్తాననుకోలేదన్నయ్యా. నా యింటికి వచ్చావా నువ్వు . కలో నిజమో తెలియడం లేదు. ఆవిడ ఎదన్నయ్యా' అని అడిగాడు.
