Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 27


    టైము తొమ్మిదయింది. పిల్లలు స్కూలుకి బయల్దేరారు. బయట రిక్షా బెల్లు టింగ్ టింగ్ మని మోగింది. "బాబూరావు వచ్చినట్లున్నాడు" అని పిల్లల్ని తీసుకుని గేటు దగ్గరకు వెళ్ళింది లక్ష్మీబాయి.
    "అదేమిటి? బాబూరావు రాలేదా? నువ్వెవరివి?" అంది కొత్త మనిషిని చూసి.
    "నేను చంద్రయ్యనమ్మా. బాబూరావు ఓ వారంపాటు రాడు. నన్ను పంపించాడు" అన్నాడతను.
    "ఇలా కొత్త వాళ్ళతో పిల్లల్ని పంపం. అయినా నిన్ను బాబూరావు పంపాడనటానికి ఏమిటి గుర్తు?" అంది.    "ఇదిగోమ్మా సైకిల్ రిక్షా. ఇదే నా గుర్తు. రిక్షాకే మీ ఓటు" అన్నాడు చేతులు జోడించి.
    "మొన్ననే గదా స్టేట్ ఎలక్షన్లయ్యాయి? ఇంకేం ఓటు? సర్లే... ఇది బాబూరావు రిక్షానే. నే గుర్తుపట్టాలే. జాగ్రత్తగా తీసికెళ్ళు పిల్లల్ని" అని లక్ష్మీబాయి వచ్చేస్తుంటే పెరట్లో కాలాక్రిష్ణ పని ఆపుచేసి ఎవరికో సైగలు చేస్తున్నాడు. లక్ష్మీబాయి పెరటి గోడచాటున నుంచుని చూస్తోంది. పొద్దున్నే పన్లో చేరిన కొత్త వంటమనిషి బావిదగ్గర పిల్లలు టిఫిన్లు చేసిన ప్లేట్లు కడుగుతోంది. పై నుంచి కిందదాకా గౌనేసుకుని వుంది. బొద్దుగా ఆరోగ్యంగా వుందికదా అని, ఒళ్ళు దాచుకోకుండా పన్జేస్తుందని అనుకుంటే- ఏమిటో గోల అనుకుంది లక్ష్మీబాయి.
    కాలాక్రిష్ణ "లెటర్... లెటర్..." అంటున్నాడు. ఆ అమ్మాయి మొండిగా చూస్తున్నది. సమాధానం చెప్పట్లేదు.
    "ప్లీజ్... లెటర్ ఇవ్వకపోతే ఎలా? ఇదా టైమ్ అలగడానికి?" అంటూ బతిమాలుతున్నాడు కృష్ణ.
    "ఇస్తాగానీ, నా తరపువాళ్ళందర్నీ మర్యాదగా చూసుకోవాలి. లేకపోతే నీకూ నాకూ పచ్చి" అంటోంది.
    అంతలో పిల్లలిద్దరూ వచ్చి "అమ్మా ఆటోకి డబ్బులివ్వు" అని అరిచారు. లక్ష్మీబాయి ఆశ్చర్యపోయి "అదేంట్రా ఆటోలో వచ్చారు? వెళ్ళి అరగంట కాలేదు. చంద్రయ్య ఏడీ? రిక్షాలో రాలేదేం? స్కూలు లేదా?" అని ప్రశ్నల వర్షం కురిపించింది.
    "స్కూలుంది మమ్మీ. నా స్కూలు మెయిన్ రోడ్డుకి లెఫ్ట్ లో చాలా దూరం పోవాలిగదా! చెల్లాయి స్కూల్ మెయిన్ రోడ్డుకి రైట్ లో చాలా దూరం పోవాలికదా! కరక్టుగా మెయిన్ రోడ్డు మధ్యలో రిక్షా ఆపుచేసి దిగిపొమ్మన్నాడు. చుట్టూతా బోల్డు ట్రాఫిక్. భయమేసి ఆటోలో ఇంటికొచ్చేశాం" అన్నాడు చిన్న.
    లక్ష్మీబాయి కోపంగా "ఎందుకలా మధ్యలో అపుచేశాడు?" అని అడిగింది.
    "ఏమో మమ్మీ! అదేదో కొత్త తెలుగుమాట అన్నాడు. మా తెలుగువాచకంలో లేదు" అని బుర్రగోక్కొని, "ఆఁ...గుర్తొచ్చింది. ఆరునూరైనా నూరు ఆరైనా తను అటుగానీ, ఇటుగానీ పోడట... తటస్థంగా ఉంటానన్నాడు" అని చెప్పి బ్యాగులు మోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళారు పిల్లలు.
    ఫోను మోగుతుంటే లక్ష్మీబాయి హాల్లోకొచ్చింది. ఆమె తండ్రి ఫోన్లో అవతల్నించీ వచ్చిన మాటలు విని కాసేపు వణికి రిసీవర్ కొడుక్కిచ్చాడు. కొడుకు దర్పంగా "ఎస్ దిసీజ్ ఇండిపెండెంట్స్ బ్రదరిన్లా స్పీకింగ్" అన్నాడు. లక్ష్మీబాయికి ఏదో అనుమానమొచ్చి బెడ్ రూమ్ లో ఎక్స్ టెన్షన్ ఫోన్ తీసి వింటోంది.
    "యూ స్టుపిడ్. దిస్ కాల్ ఈజ్ ఫ్రమ్ ప్రెసిడెంట్స్ ఛాంబర్. హాండ్ ఓవర్ ది ఫోన్ టు యువర్ బ్రదరిన్లా" అని ఖంగుమన్న కంఠంతో ఆదేశిస్తున్నట్లు వినిపించింది.
    బ్రదరిన్లా ఖంగుతిని షేకయిపోతూ "బావగారూ! బావగారూ!" అని పిలిచాడు. రాత్రి మిగిలిన చద్దన్నంలో మజ్జిగ పోసుకుని ఆవకాయపచ్చడి నంజుకుంటూ అల్పాహారం చేస్తున్న ఇండిపెండెంటు యీ అరుపుల్ని పట్టించుకోలా.
    "బావగారూ! ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచీ మీకు ఫోను" వీధి మొత్తం వినిపించేలా అరిచాడు బామ్మర్ది.
    పెరట్లో పనిచేసే కృష్ణ, లెటర్ గురించి మొండికేసిన లావుపాటి ఆవిడా, ఇంతకుముందే కొత్త సూటుకేసు ఇచ్చి అక్కడే తచ్చాడుతున్న తెల్లటోపీ ఆయనా, రిక్షా మీద అటేపెడుతూ ఈ గావుకేక విన్న చంద్రయ్యా అంతా హాల్లో గుమిగూడారు. కళ్ళజోడు పెట్టుకున్న ఓ పిల్లిగడ్డం ఆయన కూడా అకస్మాత్తుగా ఆ యింట్లోకి ఊడిపడ్డాడు. ఆయన ఎడం చేతిలో బజ్జీల ప్లేటు వుంది. కుడిచేతిలో ఈగలు తోలే కర్రగుడ్డవుంది.
    లక్ష్మీబాయి ఇక ఊరుకోలేకపోయింది. "ఏమీ చేతకాని సన్నాసి అని తన భర్త గురించి ఇన్నేళ్లూ తనూ, తన తరఫువాళ్ళూ అనుకుంటున్నది అసత్యమేమో అన్న రియలైజేషన్ ఆమెని పీడించసాగింది. వెంటనే తన చేతిలో వున్న కార్డ్ లెస్ ఫోన్ తీసికెళ్ళి, చాలా నిబ్బరంగా ప్రశాంతంగా ఆవకాయబద్ద చప్పరిస్తున్న భర్తకి అందించింది.
    ఇండిపెండెంటు "హలో సార్... యువర్ హైనెస్" అన్నాడు వినయంగా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చాలా వాత్సల్యంగా మాట్లాడారు. ఆయన ఇంగ్లీషులో మాట్లాడిన సారాంశం తెలుగులో ఇదీ. "మీరు విపులంగా నిన్న పంపిన రెండు పేజీల టెలిగ్రామ్ ని చదివాక నేను గర్వంతో ఉప్పొంగిపోయాను. ఒక ప్రజాప్రతినిధి ఇంత నిజాయితీగా దేశం గురించి ఆలోచిస్తూ మానసికంగా స్ట్రగుల్ అవుతున్నాడని (స్వాతంత్ర్యం వచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా) తెలిశాక నాకున్న పరిధిలో మిమ్మల్ని ఏ గౌరవ వాచకంతో సంబోధించాలి అని కూడా తెలియక చాలా కన్ ఫ్యూజ్ అయ్యాను. మీరు లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారానికి కూడా స్వయంగా రాక (లేక రాలేక) మీ ప్రమాణ స్వీకార పత్రాన్ని స్పీడు పోస్టులో పంపినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను కొంచెం చింతిస్తున్న విషయమేదంటే నేను మీలాంటి మానవతావాదిని స్వయంగా చూడలేకపోతున్నందుకు. కనీసం కొద్ది రోజుల్లో జరిగే బలపరీక్షకు కూడా మీరు రావడానికి ఇష్టపడక రాజకీయాలకి అతీతంగా లోక్ సభ సభ్యుడిగా మీరు ఎన్నికైన అతితక్కువ రోజుల్లోనే మీ రాజీనామాపత్రాన్ని నాకు టెలిగ్రాఫ్ మెసేజ్ ద్వారా పంపించటం-రియల్లీ ఐ ఎప్రిషియేట్ యూ. మీకు మరోసారి అభినందనలు తెలుపుకుంటున్నాను."
    ఫోన్ పెట్టేసిన చప్పుడు.
    హాల్లో, టెలిఫోన్ లో ఈ సంభాషణంతా విన్న లక్ష్మీబాయి కళ్ళనీళ్ళ పర్యంతం అయింది. లాలసతో తనూ తనవాళ్ళూ ఎలా ప్రవర్తించిందీ మననం చేసుకొని పశ్చాత్తాపంతో భర్తని కౌగలించుకుని ఆర్తిగా మొహం దాచుకుంది.

                                      *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS