శ్రీ మాధవశర్మ, పాటిబండ
ఇందుకేనటోయ్!
హిందీ-చీని భాయ్ భాయ్ అన్నా
విందుకేనటోయ్ మావన్నా!
హిందీ-చీని భాయ్ భా యన్నా
విందుకేనటోయ్ మావన్నా!!
కత్తంటే కర్షకుడన్నావ్ | సుత్తంటే కార్మికుడన్నావ్!
కత్తీ సుత్తీ జగత్తుకు | కళ్యాణపు చిహ్నాలన్నావ్| ||హిం-చీ||
సుత్తి పెట్టి మెత్తనివాళ్ళని
నెత్తిమీద మొత్తేస్తున్నావ్
కత్తిపెట్టి నమ్మిన మిత్రుల
కుత్తుక లుత్తరించుతున్నావ్! ||హిం-చీ||
పంచశీల నుద్ఘోషించావ్ | మంచివాడవని నమ్మించావ్
కంచెకాడ తగవులు పెంచావ్ | మంచుకొండపై పడముంచావ్- ||హిం-చీ||
తీస్తావా లేదా పాదం?
చేస్తావెందుకు పిడివాదం?
నేస్తం గీస్తం లేదిక గెం
టేస్తాం నోరెత్తేవంటే! ||హిం-చీ||
నంగనాచిలా మా భూములు | దొంగిలజూస్తావా నేస్తం!
మ్రింగిన భూభాగంలో ప్రతి అంగుళమూ క్రక్కించేస్తాం! ||హిం-చీ||
* * * *
