"విజయం నీదే తల్లీ! ఈ కేసు తప్పక గెలుస్తావు" సంతోషంగా దీవించింది రాధాదేవి. కూతుర్ని రెండు చేతులతో పొదివి పట్టుకుంది.
ఇందిర పట్టలేని ఆనందంతో తల్లిని గిరగిరా తిప్పసాగింది.
"ఆ! ఆ! వదులు ముసలిదాన్ని కళ్ళు తిరిగి పడిపోతాను" అంది రాధాదేవి పకపక నవ్వుతూ.
"అమ్మా! నేను ఈ కేసు తప్పక గెలుస్తానమ్మా! గెల్చి తీరాలి."
"తప్పక గెలుస్తావులే! వెళ్ళు! స్నానం చెయ్యి ఈ లోపల నేను భోజనం వడ్డిస్తాను" అన్నది రాధాదేవి.
"పిచ్చిపిల్ల! సంతోషం వస్తే పట్టలేదు. అంతా నాన్న పోలికే" అనుకుంటూ కాఫీ కలపటానికి రాధాదేవి వంటింట్లోకి వెళ్ళింది.
21
జగన్నాథం, రవీ ఎదురెదురుగా మౌనంగా కూర్చుని వున్నారు. ఇద్దరు ముఖాలు గంభీరంగా వున్నాయి. వాతావరణం ఉరి పెట్టినట్టు వుంది. ఇందిర ప్రవేశించగానే ఇద్దరూ రిలీఫ్ గా ఫీలయ్యారు.
రవి ఎదురెళ్ళి ఇందిరను ఆహ్వానించాడు.
"రామ్మా! రా!" ఆప్యాయంగా ఆహ్వానించాడు.
"ఏమిటండీ! ఇద్దరూ అంత సీరియస్ గా కూర్చున్నారేం?"
కేవలం గంభీరంగా ఉన్న వాతావరణాన్ని తేలిక బరిచే ఉద్దేశంతోనే అన్నది ఇందిర. కాని ఆమె మనసు కూడా బరువుగానే ఉంది.
"అదేనమ్మా! బాల్ - బేబీ కథ విని అందరూ ఎగతాళిగా నవ్వుతున్నారు. ఎవ్వరూ నమ్మడం లేదు. సాక్ష్యులు దొరక్కపోతే ఎంత నవ్వులపాలు కావల్సి వస్తుందోనని..."
"సాక్షులు తప్పక దొరుకుతారు. రవి నిరపరాధిగా ప్రూవ్ చేస్తాను" అన్నది ఇందిర.
"ఏమో తల్లీ!" జగన్నాథం తనకు తానే చెప్పుకుంటున్నట్టు చిన్నగా గొణిగాడు.
ఇందిర రవి ముఖంలోకి చూసింది. రవి చాలా గంభీరంగా ఉన్నాడు.
ఎంత చిలిపిగా అల్లరిగా ఉండేవాడు. ఎంత మారిపోయాడు అనుకుని ఇందిర లోలోపల బాధపడింది.
"ఇవ్వాళ ఐదో తారీఖు! ఇంకా ఇరవై రోజులు గడువు మాత్రమే ఉంది" జగన్నాథం కంఠం బరువుగా ఉంది!
కన్న తండ్రి గుండెకోతను అర్థంచేసుకున్న ఇందిర జగన్నాథం ముఖంలోకి జాలిగా చూసింది.
రవి ముఖం వెలవెలబోతోంది. తండ్రి ముఖంలోకి చూడలేక తల దించుకున్నాడు.
నాన్న ఆశలన్నీ తను చుట్టూనే అల్లుకున్నాయి. తనకు శిక్ష పడుతుందనే బాధకన్నా ఆ తర్వాత నాన్న ఏమైపోతాడనే బాధ మనస్సును కోస్తూంది.
ఇందిర జీవితం ఏమవుతుంది? తను లేనిదే ఆమె జీవితం దుర్భరం అవుతుందని తనకు తెలుసు. ఆమెను ఎలా ఓదార్చడం? సాక్షులు దొరక్కపోతే? తను చచ్చిపోయి సుఖపడతాడు. కాని బ్రతికివున్న ఆ ఇద్దరినీ నరకంలోకి తోసేసి పోతాడు.
"ఏమిటి రవీ అంతగా ఆలోచిస్తున్నావ్?" ఇందిర మృదువుగా అడిగింది.
రవి ఆలోచనల నుంచి బయటపడి ఇందిర ముఖంలోకి చూసి నవ్వడానికి ప్రయత్నించాడు.
"నాకో ఆలోచన తట్టింది!" అన్నది ఇందిర.
రవి 'ఏమిటి' అని అడగలేదు.
"ఏమిటమ్మా అది?" జగన్నాథం ఆత్రంగా ప్రశ్నించాడు.
"మనం పత్రికలకు ప్రకటన ఇద్దాం! ఆ సాక్ష్యుల్ని తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన ఒక నిర్దోషిని రక్షించమని వేడుకుందాం! వారికి ఆ మాత్రం కృతజ్ఞత వుంటుందనే నా నమ్మకం. కనీసం రవిని దీవించిన మూడో సాక్షి అయినా తప్పక వస్తుంది" అన్నది ఇందిర.
"బాగుందమ్మా నీ సలహా! అలాగే చేద్దాం తల్లి!" అన్నాడు జగన్నాథం. మునిగిపోతున్న వాడికి జారుడు మెట్టు చేతికి తగిలినట్టు జగన్నాధానికి అంత నిరాశలోనూ ఏదో ఆధారం దొరికినట్టు అనిపించింది.
రవి మాత్రం మౌనంగా వుండిపోయాడు.
ఇందిర వెంటనే కాగితం తీసుకుని ప్రకటన రాసింది. ఆ దంపతుల పోలికలు రవికి గుర్తున్నంత వరకు చెప్పాడు. వారి ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని కూడా ప్రకటనలో చేర్చబడింది.
అప్పటికప్పుడే అన్ని పేపర్లకూ ప్రకటన పంపించారు.
అలసటగా ఇంటికి వచ్చిన కూతుర్ని "ఏం తల్లీ! ఎక్కడికెళ్ళావ్? అలా వున్నావేం? ఈ మాయదారి కేసు తీసుకున్నావ్ నిద్రాహారాలు లేవు!" అన్నది రాధాదేవి.
"అమ్మా ఇలా వచ్చి కూర్చో!" అంటూ ఇందిర సోఫాలో కూర్చుంది. రాధాదేవి కూతురి పక్కగా కూర్చుని "ఏమిటమ్మా!" అని అడిగింది.
ఇందిర పేపర్లకు పంపించిన ప్రకటన చదివి విన్పించింది.
"రవి నిరపరాధి. ఇది నా మొదటి కేసు. ఈ కేసు మీదే నా భవిష్యత్తు ఆధారపడి వుంది. ఒక నిరపరాధిని ఉరికంబం ఎక్కకుండా కాపాడ గలిగితే నా జీవితం ధన్యం అయినట్టే" అంటూ ఇందిర తల్లి ముఖంలోకి చూసి ఠక్కున ఆగిపోయింది.
రాధాదేవి కొయ్యిబారిపోయినట్టు కూర్చుంది. ఆమె కణతల మీద నరాలు ఉబ్బి ఉన్నాయి. ఉద్రేకాన్ని అణచుకునే ప్రయత్నంలో సతమతమౌతూంది.
"అమ్మా! ఏమిటి అలా వున్నావేం?" విస్మయంగా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగింది ఇందిర.
రాధాదేవి అథిఉ ప్రయాస మీద తనను తాను సంబాళించుకుంది.
