Previous Page Next Page 
ది సెల్ పేజి 27


    "అవును! నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డావని_ " వ్యంగ్యంగా అంటూ మరల గుంపులోకి వెళ్ళిపోయాడు.
    ఆ కుర్రవాడు వాళ్ళతో ఏం చెప్పాడో మరుక్షణంలో కుర్రకారంతా వెళ్ళినంత వేగంగా వెనుదిరిగి భరత్ భూషణ్ మీద విరుచుకు పడ్డారు.
    "కొట్టండ్రా! పిచ్చినాకొడుకుని బాదండ్రా!" అంటూ చేతికి దొరికిన రాయిరప్ప తీసి అతని మీదకి విసిరారు.
    అతనికి శరీరం నిండా దెబ్బలు తగిలాయి. తల పగిలి శరీరంలో రక్తం ఇంకిపోయినట్లు ఉండి ఉండి రక్తం ఉబికివస్తున్నది.
    వళ్ళు హూనంఅయినా అంతగా బాధ అనిపించలేదతనికి కాని మనసుకి తగిలిన గాయానికి మాత్రం హృదయం విలవిలలాడింది.
    స్టూడెంటు యూనియన్ కి ఎలక్షన్స్ జరుగుతున్నట్లు అప్పటికి తెలుసుకోగలిగాడు.
    అవును తను నిజంగా పిచ్చివాడే! తను చదువుకున్న రోజుల్లో ఈవిధంగా కాలేజీలలో ఎలక్షన్స్ లేవు. వీధిన పడి విస్తృతంగా ప్రచారాలు చేసుకోవటం లేవు.
    తను అప్పటి ఆలోచనలలోనే వుండి, నేటి విద్యార్థులలోని ప్రచారధోరణిని చూసి జనరల్ ఎలక్షన్లు అనుకున్నాడు.
    దేశానికి స్వాతంత్ర్యం రావాలన్న పట్టుదల, దీక్షతో తను సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు.
    పెళ్ళి, పిల్లలు తనకు, తన ఆశయాలకు అవరోధం అని అంతేకాక తనలో ఏకొద్దిపాటి స్వార్థం అయినా పుడుతుందేమోననే శంకతో అవివాహితుడుగానే ఉండిపోయాడు.
    యువశక్తితో ఉద్యమాన్ని చేపట్టి, చివరకు తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకొని కారాగారవాసం అనుభవించాడు.
    ఈరోజున నడిరోడ్డుమీద నేటి యువశక్తి తనకు తగిన గుణపాఠం చెప్పింది ...
    వీళ్ళా భావి భారత పౌరులు? దేశానికి పట్టుగొమ్మలు? నిర్వీర్యమైన జాతికి నిర్వచనంగా నిలిచిన ఈ ఆకతాయి యువకులా రేపు దేశాన్ని ఉద్ధరించేది ?
    రెక్కలు ముక్కలు చేసుకుని కన్నబిడ్డలను చదివించుకుంటున్నది, ఏమి ఆశించి? అసలు వీళ్ళు చదువుకునేది ఏమిటి?
    చదువులతో సంస్కారం అబ్బుతున్నదా! ఈ చదువులతో దేశభక్తి ...
    మరి ముందుకు వెళ్ళలేకపోయాడు.

                                       *    *    *

    భరత్ భూషణ్ తన గురించి అందరూ మరచిపోయి వుంటారనుకున్నాడు.
    దేశం విడిచి పారిపోయి ఎక్కడో కుక్కచావు చచ్చి వుంటాడని అనుకుని వుంటారు.
    అసలు తనూ ఓ స్వాతంత్ర్య సమర యోధుడని ఏ రికార్డుల్లోనన్నా వుందా?
    తాలూకా ఆఫీసుకు వెళ్ళి స్వాతంత్ర్య సమరయోధుల పింఛను గురించి విచారించాడు.
    తన పేరున ఫించన్ ఇస్తున్నట్లుగా వుంది. భరత్ భూషణ్ ఆశ్చర్యపోయాడు.
    ఎవరో స్వార్థంతో తనను కాగితాలపై ఇంకా బ్రతికించే వుంచారన్నమాట!
    తనే భరత్ భూషణ్ అని ఇప్పుడు చెప్పుకున్నా ఎవరూ నమ్మకపొగా తనను అనుమానించవచ్చు.
    _చచ్చి బ్రతికిన మనిషి బ్రతుకుతూ చస్తున్నాడు ప్చీ_ శేషజీవితానికి పింఛన్ లేకపోతే ప్రాణం నిలవదా? అయినా ఈ పింఛను కోసం తను ఈ ఉద్యమంలో చేరలేదు__ కలం నడిపించలేదు__
    తనకు ఒకే ఒక్క కోర్కె మిగిలింది. తనను అనుమానించిన దేశ ప్రజలు తన యదార్థ జీవితాన్ని చదవాలి.
    చదివి కొన్ని క్షణాలైనా తన కష్టాలను, నష్టాలను నమ్మితే తన జీవితం ధన్యమైనట్లే. తను ఆశోపజీవి!_
    చిరిగిపోయిన చేతిసంచిలో భద్రంగా దాచుకున్న కాగితాల కట్టను తృప్తిగా ఒకసారి తడుముకొని చూసుకున్నాడు.
    ఎవరైనా ప్రచురణకర్త తన జీవితచరిత్రను ముద్రిస్తే తన జన్మ ధన్యమైనట్లే.
    దేశస్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో తన పాత్ర చిరస్థాయిగా యుగయుగాలు నిలిచిపోతుంది.
    ఒక్కసారిగా ఉద్వేగపూరితమైన ఆలోచనతో ఉక్కిరిబిక్కిరయి పట్టణంలోని ఓ ప్రచురణకర్త దగ్గరకి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు భరత్ భూషణ్.
    వృద్ధాప్యంలో వున్న ముసలివాడిని చూసి జాలిపడలేదు. అనుకోనివేళ అతిథి వచ్చినట్లు ఇబ్బంది ఫీలయ్యాడు.
    అతన్ని ఓ రచయితగా ఊహించడానికే బాధపడుతున్నట్టుగా వుంది అతని స్థితి. కనీస గౌరవ మర్యాదలు దండుగ అన్నట్టు "ఏం పని.... ఏం కావాలి?" అంటూ తుంచి మాట్లాడాడు.
    ఆ ట్రీట్ మెంటుకే గతుక్కుమన్న భరత్ భూషణ్ అడగాలా వద్దా అన్న మీమాంసలో పడ్డాడు.
    ఏది ఏమైన తన జీవితాశయం నెరవేర్చుకోవడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా, అపహాస్యాలు ఎదురైనా తట్టుకో వలసిందే! అందుకే సిగ్గు విడచి, నోరు తెరచి తన ఆటోబయోగ్రఫీని ముద్రించమని కోరాడు.
    పబ్లిషర్ ఒక్కసారిగా పిచ్చిగా నవ్వాడు. "పిచ్చి రాత... దేశ నేతల ఆటోబయోగ్రఫీలే మర్చిపోయిన ఈ జనం నిన్ను నీ బయోగ్రఫీని చదువుతారా!
    నువ్వు ఇంకా పాతకాలంలో ఉన్నావు. ప్రజలు ఇప్పుడు ఆడియో వీడియో యుగంలో ఉన్నారు.
    వాళ్ళ అమూల్యమైన కాలాన్ని నీలాంటి ముసలివాళ్ళ బయోగ్రఫీలు చదివి వృధా చేసుకోరు..."  
    అతను చెబుతుంది యదార్థం అనిపించినా అతని మనసు సరిపెట్టుకోలేకపోయింది.
    దీనంగా ముఖం పెట్టాడు.
    "... మేం నాలుగు రూపాయలు సంపాదించడానికి వ్యాపారం పెట్టాం... ఇక నువ్వు వెళ్ళిరా..." నిర్మొహమాటంగా అన్నాడు.
    అవును!
    పబ్లిషింగ్ హౌస్ ముందు, బీరువాలలో, షో కేసులలో శృంగారభంగిమల ముఖచిత్రాలతో, ద్వందార్ధాలతో అక్షరాలూ కనిపిస్తుంటే వాటికై ఎగబడి కొంటున్న పాఠకులు ఉండగా తన గురించి, తన బయోగ్రఫి గురించి ఎవరికి కావాలి?
    అవును! జీవితమే ఓ వ్యాపారం! వ్యాపారంలో ఓ భాగమే జీవితం.
    ఈదేశం ఏ గతిన పోతుందో! నాగరికత ఏ దిశగా పయనిస్తుందో! బానిసత్వపు ఆలోచనలు! నిర్వీర్యమై పోతున్న సత్సంప్రదాయాలు ...
    ఏ వ్యవస్థను చూసినా, ఏ వ్యక్తిని చదివినా అంతా శూన్యంగా కనిపిస్తుంది భరత్ భూషణ్ కి. అతని యెడద ఎడారి అయ్యింది. ఒయాసిస్సులు ఎండమావులయ్యాయి.

                                                                 *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS