"రాజులవల్ల కానిపని కవిరాజుల వల్ల సులభసాధ్యమౌతుంది" అన్నారు మామిడి సింగన్న సంభాషణ ప్రారంభిస్తూ, చిన్ననాటి స్నేహితుడైన మహామంత్రి మాటలను శ్రీనాధయ్య సులభంగానే గ్రహించాడు. పెద్దియజ్వ వంక సాభిప్రాయంగా చూచాడు. ఆయన ఆలోచనామగ్నులై ఉండి శ్రీనాధయ్యను గమనించనే లేదు.
"శ్రీనాధయ్యా! మీమీది పరిపూర్ణ విశ్వాసంతో విజయ నగరానికి పంపాలనుకుంటున్నాము. కొండవీటి ముత్యాల శాలలో మీకు జరిగిన గౌరవ సత్కారాలు అక్కడ కూడా జరగాలని మేము కోరుతున్నాము. కోమటి వేముడు విచారంగానే తన కోరిక వెల్లడించాడు. విజయనగరంలో ప్రౌఢదేవరాయలు కవితా గోష్టులు నిర్వహించే ముత్యాల శాల కవి ఊహలలో తళుక్కున మెరిసింది. తప్పక వెళ్ళి చూడాలనిపించింది.
అంతలో రాచవేముడక్కడకు వచ్చి చేరాడు. యువరాజు ఉచితాసనంపై ఆశీనుడయ్యాడు. అతని తోక వెంట తురగా రామయ్య కూడ వచ్చి కూర్చున్నాడు.
"కొండవీటి ప్రభువుల పోషణలోని వారంతా తమ తమ రాజభక్తిని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది అన్నాడు రాచవేముడు. తురగా రామయ్య వంతపాట పాడాడు. అంతటితో అక్కడున్న పెద్దల మనసులు చివుక్కు మన్నాయి. ఈ కుర్రకుంక ఇంత అతిశయాన్ని ప్రదర్శించటం వల్ల రాజ్య శ్రేయస్సు చేకూరుతుందా?" అని అనుమానించాడు శ్రీనాధయ్య, "నాయనా! నీ ఉప్పు పులుసు తిని బ్రతుకుతున్న మేము నీ శ్రేయస్సునే కోరుతాము. అయితే వేగిరిపడినందువల్ల పనులయ్యే స్థితిని దాటాయి పరిస్థితులు. పెద్దియజ్వ రచవేమునికి చురక తగిలించారు.
"నాయనగారి సుదీర్ఘమైన ఆలోచనలు తెగనందువల్లనే పనులు జరగట్లేదు. ఒకనాడు విజయనగరంపై దండెత్తిన కాటయ వేముడు హరిహరాంబికను కానుకగా స్వీకరించిందా? నాన్నగారూ! మీ ఆజ్ఞ అయితే నేను స్వయంగా సైన్యాన్ని సమాయత్తం చేసి విజయనగరం మీద దండెత్తుతాను. మా బావగారైన సోమదేవుడిని నేనే స్వయంగా విడిపించి తీసుకువస్తాను." అని వీరాలాపం చేశాడు రాచవేముడు.
"అందుకు కావలసిన నిధులు ఎలా వస్తాయి? ఒకవేళ నీవు దండెత్తి విజయనగర రాజులను జయించినా బందీగా ఉన్న సోమదేవుడు సజీవుడై మనకు దొరుకుతాడన్న నమ్మకమేమిటీ?" ప్రశ్నించాడు కోమటివేముడు. రాచవేముడు సభాముఖంలో రాజ్యతంత్రంలో తప్పులు పట్టించుకోకుండా (తెలియకుండా) మాట్లాడుతున్నందుకు బాధ పడ్డాడాయన. అయితే తండ్రిని నొప్పించానన్న బాధ ఇసుమంతైనా వారిద్దరిలోనూ కన్పించలేదు.
"కావలసిన నిధులు సమకూర్చే బాధ్యత నాపై మోపండి ప్రభూ! అన్నాడు తురగా రామయ్య వినయంగా.
"క్రొత్త పనులు విధిస్తే నిధులకేమి కొదువ" అన్నారు పెద్దియజ్వ. అని పాదాభిప్రాయంగా కోమటివేముని ముఖంలోకి చూచాడాయన. రాజు ముఖం మ్లానమై పోయింది. తల వంచాడు. ఈ మాటలోని ఆంతర్యాన్ని గ్రహించలేదు తురగా రామయ్య.
ఔనౌను. రాజ్యంలో అవచితిప్పయ సెట్టి వ్యాపారం తగ్గుముఖం పట్టింది. బలిజలు విజృంభించారు. పైగా రైతులు, తదితర సామాన్యుల వద్ద బంగారం పేరుకుపోయింది. అదంతా నిర్హేతుకంగా అలా ఉండిపోవటం దేశానికి నష్టదాయకం. అది ప్రభువుల పరమయ్యే యేర్పాటు చేస్తున్నాను." అంటూ తన కార్యక్రమాన్ని వివరించాడు రామయ్య. అది తప్పని రాజు అంటాడేమోనని ఎదురు చూచారు పెద్దలందరూ. కాని రాజు విని మౌనం వహించాడు. తురగా రాముని మందలిస్తే బాధపడేది రాచవేముడు. అది రాజు కిష్టం లేదు. కనుక దీని ఫలితాన్ని వారు అనుభవించవలసిందే అని పెద్దలు భావించి మిన్నకున్నారు. ముందుగ పెద్దియజ్వ శలవు తీసుకుని వెళ్ళిపోయారు. మహామంత్రికి మనసు కకావికలమైంది.
"రామయ్యగారూ! క్రొత్త పన్నులు కేవలం ముంచుకొచ్చిన యుద్ధ సమయాలలోనే విధించాలి. యుద్ధాలను కొని తెచ్చుకుని ప్రజల్ని పీడించరాదు." అంటూ వివరించారు మామిడి సింగన్న. ఆ మాటలు వారికి రుచించలేదు.
"నాయనా! శ్రీనాధయ్యను విజయనగరానికి పంపితే విద్యా చతురతతో కార్యం నిర్వర్తిస్తాను. ఎదిరి బలాన్ని, బలగాన్ని తెలుసుకునేందుకు ఇదొక అవకాశంగా కూడా ఉపయోగిస్తుంది. కనుక ఆయనను విజయనగరానికి పంపాలని పెద్దలంతా నిశ్చయించారు. వారికి చందన తాంబూలాదులిచ్చి సత్కరించి వీడ్కొలిపే బాధ్యత నేను నీమీద ఉంచుతున్నాను" రాజు రాచవేమునికి కార్యక్రమాన్ని వివరించాడు.
రాచవేముడు విసురుగా తల వూపి వెళ్ళిపోయాడు. మరికొంతసేపు రాజు, శ్రీనాధయ్యా ప్రయాణ విషయాలు ముచ్చటించుకున్నారు. కోమటివేమునికి అప్పుడే అంతఃపురం నుండి పిలుపు వచ్చింది. ఆయన కవి రాజును తీసుకుని సూరమాంబను చూచేందుకు వెళ్ళాడు. మామిడిసింగన్న వారికోసం వేచి కూర్చున్నాడు. అంతఃపురంలోనికి వెళ్ళగానే సకలోపచారాలతో రాజునూ, కవి రాజునూ ఆహ్వానించింది. సూరమాంబపై కవిరాజుకు ఎనలేని గౌరవ ప్రవత్తులున్నాయి.
