అందరూ అయితే ఏం చేస్తారూ? రాత్రి లేటుగా పడుకుంటే పొద్దున లేవడం కూడా లేటుగానే లేస్తారు.
కానీ నిద్రని కాంపెన్సేట్ చేయటం వెంకయ్యకి అలవాటులేదు.
నిద్ర కంటే కూడా డ్యూటీ ముఖ్యం అని భావించే అతి కొద్దిమందిలో ఆయన ఒకడు. అందుకనే వరసగా రెండు మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా 'మనిషి దేవుడే గానీ పనికి రాక్షసుడు' అని పేరు తెచ్చుకున్నాడు. నిద్రాహారాలు లేకుండా వరసగా రెండు మూడు రోజులపాటు రాత్రింబవళ్ళు పనిచేసిన సందర్భాలు కూడా చాలానే వున్నాయి.
తెల్లవారీ తెల్లవారకముందే పేషెంట్లు వచ్చేస్తారు. వాళ్ళందరినీ చూశాక, అప్పుడింక తను పనిచేసే గవర్నమెంటు హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ పని చూస్తాడు. సాయంత్రం తిరిగి వచ్చీ రావడంతోనే మళ్ళీ ఇక్కడి పేషెంట్లని అటెండ్ కావడం మొదలెడతాడు.
ఇదంతా సంపాదన కోసం కాదు.
సేవా ధర్మంగా!
"వైద్యం ఒక వృత్తి కావచ్చును. కానీ వ్యాపారం కారాదు." అని చెప్పేవాడు వెంకయ్య తండ్రి.
అది తు.చ. తప్పకుండా పాటిస్తాడు ఆయన.
అట్లాగే -
తండ్రి చెప్పిన హితవచనాలలో మరొక మణిపూస -
"మనిషి ఎవరో తెలియడానికి పేరు గానీ, కులం ఏమిటో తెలుయడానికి కాదు" అని.
శర్మ, వర్మ, రెడ్డి, చౌదరి, నాయుడు, గౌడు వగైరా వగైరా కులపరమైన పేర్లు వద్దంటాడు.
అందుకే - కొడుకుకి తండ్రి పేరే పెట్టినా కూడా, "వెంకారెడ్డి' అని పెట్టకుండా 'వెంకట్' అని పెట్టాడు. అది పోను పోను ప్రజల నోళ్ళలో వెంకయ్యగా మారింది.
పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టం అన్నాడు.
పెళ్ళిళ్ళ ద్వారానే అన్ని కులాల వాళ్ళూ, అన్ని మతాల వాళ్ళూ కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులయ్యారు.
కుల, మత విచక్షణా రహిత సమాజం గురించి వేదికలెక్కి వాదించకుండా, తను చేయగలిగింది ఏమిటో చేసి చూపించాడు ఆయన. డాక్టర్ వెంకయ్య భార్యా వాళ్ళు బ్రాహ్మలు.
పుట్టి పెరిగిన పల్లెని శాశ్వతంగా వదిలి పట్నం వచ్చేసినా కూడా వెంకయ్య పద్ధతులు మాత్రం ఏమాత్రం మారలేదు.
స్నానపానాలు ముగించి, పూజలో కూర్చుని, అరగంటలో అన్నీ పూర్తిచేసుకుని, పేషెంట్లని చూసే పనిలో చొరబడిపోయాడు వెంకయ్య.
ఆ తర్వాత ఆయన హాస్పిటల్ కి వెళ్ళేసరికి, అక్కడ ఒక పోస్టుమార్టం కేసు ఎదురుచూస్తోంది.
పాపం ఎవరో ఒక అమ్మాయి - మామూలు మిడిల్ క్లాస్ గర్ల్.
ప్రేమలో పడిందిట.
పుస్తె కట్టకుండా ఊరికే వెంట తిప్పుకున్నాడు ప్రియుడు.
"పెళ్ళెప్పుడు?" అని నిలదీసింది ఆ పిల్ల.
"ప్రేమ వరకూ నువ్వు ఓకేనే! పెళ్ళికి పనికి రావు. పెళ్ళంటే చాలా లింకులు ఉంటాయి. ఆస్తిపాస్తులు, ఫ్యామిలీ లెవెలు, పలుకుబడి ఇవన్నీ పెళ్ళికి వుండాలి. ప్రేమకు అక్కర్లేదు. నీకున్నట్లు పర్సనాలిటీ వుంటే చాలు!" అని తేల్చేసి ఆ అమ్మాయిని ముంచేశాడు అతడు.
బతుకు బజారుకీడుస్తానని బెదిరించింది ఆమె.
ఆ మాటలే ఆమెకి మరణశాసనంలాగా మారాయి.
ఆ పిల్లని వదిలించుకోవాలనుకున్నాడు అతను.
శాశ్వతంగా!
తన ఫ్రెండ్స్ ని సలహా అడిగి, సాయం చేయమని కోరాడు.
ఆ అమ్మాయిని ఒక్కరోజు తాము 'షేర్' చేసుకోవడానికి అతను ఒప్పుకుంటే, అడ్డంకి తొలగిస్తామన్నారు వాళ్ళు.
"ఎట్లాగూ చచ్చేదానికి ఇంకా శీలమేమిటి?" అనుకుని ఒప్పుకున్నాడు అతను.
"అంతా ఆల్ రైట్ అయిపోయింది. ఆనందంగా సెలెబ్రేట్ చేసుకుందాం రా!" అని ఫోన్ చేశాడు. నమ్మి వచ్చేసింది ఆ అమ్మాయి.
ఆ పిల్లని వాళ్ళు ప్రత్యేకంగా పనికట్టుకుని చంపవలసిన పని లేకుండా పోయింది.
పనిలో పనిగానే ఆమె చనిపోయింది.
గ్యాంగ్ రేప్!
పది మృగాలు!
ఒక బలిపశువు!
పోస్టుమార్టం టేబుల్ మీద ఉన్న శవాన్ని చూస్తుంటే దయా హృదయుడయిన డాక్టర్ వెంకయ్య కళ్ళలో నీటి పొర ఏర్పడింది. ఇది కలికాలం!
మృగధర్మమే యుగధర్మంగా మారిన రాజులు! డాక్టరుగా తన డ్యూటీలో అనేకానేకమైన నేరాలూ, ఘోరాలూ చూశాడు.
గుండెరాయిగా మారిపోవాల్సిన పరిస్థితి.
కానీ - ఇలాంటి కేసుల్లో కత్తి పట్టుకున్నప్పుడల్లా కన్నీళ్ళే!
ఈ అమ్మాయిది తన కూతురి ఈడే!
శాంతి!
తమకి తమ కూతురి మీద ఎన్ని ఆశలున్నాయో, ఈ అమ్మాయి తల్లిదండ్రులకి కూడా అంతేకదా!
ఆ ఆశలన్నీ అగ్గిలో బుగ్గి అయిపోయినట్లే! పాపం!
ప్రేమలో పడి శవంగా మారిన ఈ పిల్లకు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారో లేదో.
తల్లిదండ్రులకి ఆసరాగా...
తనకి ఇద్దరు పిల్లలు.
శాంతి! బ్రిలియంట్ స్కాలర్. ఏమాత్రం డౌటు లేకుండా డాక్టరవుతుంది. ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెవెల్ కో ఎదిగి ప్రపంచం మొత్తానికి సేవ చేస్తుంది.
లేదా రిసెర్చిలోకి వెళ్ళిపోయి, మనిషి మెదడులోని కుళ్ళుని కడిగేసే ప్రక్రియ లాంటిది. ఏదో కనిపెట్టి నోబెల్ ప్రైజు అందుకుంటుంది. నోబెల్ బహుమతులు ఒకటి కాదు రెండు.
ఒకటి మెడిసిన్ కి. రెండోది శాంతి బహుమతి.
శాంతికి 'శాంతి' బహుమతి! బావుండదూ?
పాపం ఈ పాప జీవితంలో ఏం సాధించదలుచుకుందో!
తన కొడుకు ఉత్తమ్ లాగా బార్న్ లీడరా?
పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఉత్తమ్ లో.
చిన్నప్పుడు క్లాసు మానిటరు.
పెద్దయ్యాక స్టూడెంట్ యూనియన్ లీడరు.
అందరూ అట్లాంటి లీడర్లయితే జనాలు గుండెల మీద చెయ్యవేసుకుని నిద్రపోవచ్చును.
ఆలోచనలలోనుంచి బయటపడి ఒక్కసారిగా తల విదిలించాడు డాక్టర్ వెంకయ్య.
గుండె రాయి చేసుకోవాలి.
కనీసం టెంపరరీగా!
పోస్టుమార్టం పూర్తయింది.
ఆ అమ్మాయి వంటినిండా గాట్లు, ప్రాణాన్నీ మానాన్నీ దక్కించుకోవడం కోసం జరిగిన పెనుగులాటలో కలిగిన గాయాలు.
డాక్టర్ వెంకయ్య బయటికి రాగానే అక్కడే వెయిట్ చేస్తున్న అరుణ, భావనా కనబడ్డారు. వాళ్ళ మొహాల్లో విపరీతమైన టెన్షన్ కనబడుతోంది.
పాపం ఆ ఆండాళ్ళుగారి అమ్మాయికి ఏమీ కాలేడు కదా!
వాళ్ళతో మాట్లాడే లోపలే హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరనుంచి కబురు వచ్చింది.
"కూర్చోండమ్మా! ఇప్పుడే వస్తా!" అని చెప్పి, సూపరింటెండెంట్ రూములోని వెళ్ళాడు డాక్టర్ వెంకయ్య.
తన ఆనవాయితీకి విరుద్ధంగా, వెంకయ్యను చూడగానే లేచి నిలుచున్నాడు సూపరింటెండెంట్.
"రా వెంకయ్యా!" అన్నాడు ఆదరంగా.
ఇద్దరూ కూర్చున్న తర్వాత అప్పుడు చెప్పాడు సూపరింటెండెంటు నెమ్మదిగా.
"ఇంకో రెండు డెడ్ బాడీస్ వచ్చాయి వెంకయ్యా!"
వింటున్నానన్నట్లు తల వూపాడు వెంకయ్య.
ఒకసారి వెంకయ్య మొహంలోకి చూసి, తర్వాత తల కొద్దిగా వంచి, తన చేతివేళ్ళవైపు చూసుకుంటూ అన్నాడు సూపరింటెండెంట్.
"పిల్లలని మనం ఈ ప్రపంచంలోకి తేగలంగానీ, వాళ్ళు పైకి వెళ్ళిపోకుండా ఆపగలగడం మన చేతిలోలేదు వెంకయ్యా! ఎప్పుడు ఎవర్ని పుట్టిస్తాడో, ఎప్పుడు ఎవర్ని తీసుకుపోతాడో అంతా ఆ భగవంతుడి లీల!"
"పాపం ఆ అమ్మాయి సంగతేనా! ఆ తల్లి దండ్రుల స్థానంలో మేమే వుంటే ఎలా వుండేదా అని ఆలోచిస్తున్నాను నేను" అన్నాడు వెంకయ్య ఆర్ద్రంగా.
"దురదృష్టవశాత్తూ ఇవాళ అదే నిజమైంది వెంకయ్యా!"
"అంటే..."
