Previous Page Next Page 
వైరం పేజి 27


    ఆ తర్వాత అతను పైరేట్ గా మారాడుట.
    పైరేట్! సముద్రపు దొంగ!
    వీరప్పన్ లాంటి వందమంది అడవిదొంగలకి తాత లాంటివాడు! అతని షిప్పు తీరానికి దూరంగానే అయినా ఎప్పుడూ ఇండియన్ వాటర్స్ లోనే తిరుగుతూ వుంటుంది.
    తనూ సముద్రతీరంలో ఓ పల్లెలోనే పుట్టాడు. చలాకీ మనిషి కాబట్టి చాలానే విషయాలు చిన్నప్పుడే గ్రహించేశాడు.
    తీరం నుంచి పదహారు కిలోమీటర్ల వరకూ ఇండియన్ సముద్రం కింద లెక్క. ఆ హద్దు దాటితే ఇంటర్నేషనల్ వాటర్స్. ఈ అభిరాం గనక ఒక్కసారి ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి వెళితే, అతన్ని పట్టుకోవడం కోసం 'రెడ్ కార్నర్' వారంట్సు రెడీగా వుంటాయి.
    ఇంటర్నేషనల్ క్రిమినల్ అతను. దేశదేశాల్లో అతని మీద క్రిమినల్ కేసులు వున్నాయి.
    హత్యలు, మానభంగాలు, కిడ్నాప్ లు, దొమ్మీ, దోపిడీ, చీటింగ్...
    నేరాల లిస్టు మూడు యోజనాల పొడుగు!
    అయితే అతను ఇండియన్ వాటర్స్ లోనే వుండి ఎన్ని అఘాయిత్యాలు చేసినా మాత్రం అంతర్జాతీయంగా ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు.
    పైగా ఎన్నో దేశాలకు అతనితో ఎన్నెన్నో అవసరాలు వున్నాయి. చివరికి ఇండియాతో సహా!
    అందుకే అందరూ చూసీ చూడనట్లు ఉంటారు. అతను అరెస్టు కాడు.
    అతన్ని అదుపులో పెట్టలేదు. పెట్టరు కూడా.
    అభిరాంని పట్టుకునే 'ప్రయత్నాలు' మాత్రం 'సాగి'పోతూనే వుంటాయి.
    'వీరప్పన్ విషయంలాగే!" అనుకున్నాడు దాస్. దొరలు ఆడించే దొంగాటకం!
    వీరప్పన్ ఛాప్టర్ క్లోజ్ కావడానికి ముప్పయి ఏళ్ళు పైనే పట్టలేదూ?
    వందల కోట్ల రూపాయలు వృధా కావడం సంగతి అటుంచు - వందల సంఖ్యలో మనుషులూ, మృగాలూ చావలేదూ!
    వీరప్పన్ కోసం 'వేట!'
    అతనెక్కడున్నాడో అందరికీ తెలుసు!
    కానీ -
    ఎవరికీ తెలియదు కూడా!
    అభిరాం సంగతి కూడా అంతే!
    అతని 'ఈస్టిండియా' అనే షిప్పు సర్వసాధారణంగా ఇండియన్ వాటర్స్ లోనే వుంటుంది కానీ, ఎప్పుడూ ఒకేచోట మాత్రం వుండదు. లొకేషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ వుంటుంది. ఫలాని చోట కనబడిందని రిపోర్టు వస్తుంది. తూతూ మంత్రంగా వెదుకుతారు. ఉన్నచోటు మాత్రం వదిలేసి.
    ఈ లోగా ఆ షిప్పు వేరే స్పాట్ లోకి వెళ్ళిపోతుంది. "షిప్పు కనబడలేదు' అని సుతారంగా రిపోర్టు!
    ఈ అభిరాంతో పోలిస్తే ఆ వీరప్పన్ ఆఫ్టరాల్! అంతే!
    అట్లాంటి అభిరాం షిప్పుకి ఇప్పుడు తను...
    దాస్ అట్లా ఆలోచనల్లో ఉండగానే అభిరాం తన హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిల్ ని సముద్రతీరం వెంటే ఉరికెత్తిస్తున్నాడు.
    ఒక జాలరి పల్లె దగ్గరికి వచ్చాక బైక్ ని స్లో చేశాడు అభిరాం.
    అట్లాంటి పల్లెలో పుట్టి పెరిగినవాడే దాస్ కూడా.
    ఆ పల్లెని చూడగానే అతనికి తన చిన్నతనం గుర్తొచ్చింది.
    చిన్నప్పుడు తన అన్న చిల్లర దొంగతనాలు చేసేవాడు. సినిమాహాళ్ళ దగ్గర టిక్కెట్లు బ్లాక్ లో అమ్మేవాడు.
    అతను పెద్దయి పెద్ద పెద్ద పనుల్లోకి దిగేసరికి తమ్ముడు దాస్ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్మే లెవెల్ కి ఎదిగాడు.
    అన్న దొంగతనాల లెవెలు దాటి చీకటి వ్యవహారాల స్థాయికి ఎదిగేసరికి తమ్ముడు దాస్ దొంగతనాల ఫీల్డుని దొరకబుచ్చుకున్నాడు.
    అన్నని ఎవరో హత్య చేసేసరికి కంపు వారసత్వపు రాజకీయాల ఆనవాయితీ ప్రకారం ఆ సీటు దాసుకి దక్కింది.
    తాజాగా ఇప్పుడతను ఎమ్మెల్యే!
    అవును! ఒకప్పటి సినిమా టిక్కెట్ల బ్లాక్ మార్కెటీరు ఇప్పుడు ప్రజా ప్రతినిధి!
    చిన్నప్పటి సినిమా టిక్కెట్ల వ్యాపారం తాలూకు వాసనలు అతన్ని ఇంకా వదలలేరు మాస్ సినిమాలంటే మహా ఇష్టం!
    రాజకీయ వ్యాపారంలో మదుపు పెట్టిన డబ్బు ఇప్పుడు కల్పవృక్షంలా కాసులు పంట పండిస్తోంది.
    దానిని సినిమా వ్యాపారంలో పెట్టాలని దాస్ కోరిక!
    ఈ దేశంలో రెండే రెండు 'అల్టిమేట్' వ్యాపారాలు వున్నాయి.
    ఒకటి " సినిమా వ్యాపారం!
    రెండు : రాజకీయ వ్యాపారం!
    ఏ రంగంలో షైనయిన వాళ్ళయినా సరే, అందరికీ అంతిమ ధ్యేయం అటు సినిమాలు తీయడమో, లేదా ఇటు రాజకీయాల్లోకి రావడమో అయి వున్నట్లుగా అనిపిస్తుంది.
    మళ్ళీ -
    సినిమాల్లో షైనయిన వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి ఉర్రూతలూగుతారు.
    రాజకీయాల్లో వున్నవాళ్ళు సినిమాలు తీయాలని వుబలాటపడతారు.
    "సినిమా తీసి తీరాలి!" అనుకున్నాడు దాస్.
    అట్లాంటిట్లాంటి సినిమా కాదు!
    మహత్తరమైన మాస్ మసాలా సినిమా!
    పెద్ద హీరోతో భారీ బడ్జెట్ సినిమా!
    మూడొందల సెంటర్లలో రెండొందల రోజులపాటు ఆడి రికార్డులను అప్పడాల్లా విరగ్గొట్టి పారేసే సినిమా!
    పెద్ద హీరోల డేట్ల కోసం ఏళ్ళ తరబడి పడిగాపులు కాయాలి.
    కానీ -
    బాలీవుడ్ లో జరుగుతున్నదేమిటి?
    అండర్ వరల్డ్ డాన్ దగ్గరనుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలు - హీరోలు గడగడలాడుతూ డేట్లు ఇస్తారు.
    ఆ 'భాయ్' కాల్ లాగా, ఈ బ్రదర్ అభిరాం కాల్ కూడా పనిచేస్తుందా?
    అది తేల్చుకుందామనే వచ్చాడు దాస్.
    దాస్ తీయబోయే సినిమా గురించి అతను ఇక్కడ అభిరాంతో జరిపే చర్చలలో, తన ప్రమేయం లేకుండానే తను ఒక ముఖ్య పాత్రధారిణి అవుతుందని అక్కడెక్కడో హైదరాబాద్ లో ఉన్న అరుణకేమి తెలుసూ!

                        *    *    *    *

    'నవ్వినా కన్నీళ్ళే' అన్నట్లుగానే, పట్టరాని ఆనందం కలిగినా కూడా ఏడుపు రావడం కద్దు!
    అట్లాగే వుంది ఆండాళ్ళు పరిస్థితి.
    కన్నకూతురు కన్ను తెరిచి చూసి, "అమ్మా" అని పిలిచేసరికి, ఆనందంతో కూడిన శోకం కట్టలు తెగినట్లుగా అయి, పెద్దగా రోదించడం మొదలెట్టింది ఆమె.
    ఆమె శోకాలు విని ఆదుర్దాగా పరిగెత్తుకు వచ్చిన అరుణా, భావనా, జాహ్నవీ, అక్కడి దృశ్యం చూసి కుదుటపడ్డారు.
    'గొప్ప ఘనకార్యం చేశావులే!" అంది అరుణ - మురిపెంగా సునీత వైపు చూస్తూ.
    అంతలోనే మళ్ళీ ఇంకేదో తట్టినట్లుగా అంది.
    "అసలైన ఘనకార్యం చేసింది ఇదీ! ఈ భావన! నిన్ను రక్షించడానికి నీళ్ళలో దూకేసింది!" అంది అభిమానంగా తన స్నేహితురాలి వైపు చూస్తూ.
    సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు లతీఫ్ లేట్ లతీఫ్. అలవాటుగా లేటుగా!
    "ఏమిటీ! భావన దూకేసిందా? నేను చచ్చినా నమ్మను! తనని ఎవరో తోసేసి వుంటారు!" అన్నాడు లతీఫ్.
    "అంతే! అంతే! నీలాంటివాడే ఎవడో నన్ను తోసేసి వుంటాడు. లేకపోతే దీనిని రక్షించడానికి నేను దూకేస్తానా ఏం?" అంది భావన.
    అందరి మొహాల్లో నవ్వు కనబడింది.
    డాక్టర్ వెంకయ్య మొహం సంతోషంతో వెలిగిపోతోంది. ఒక ట్రాజెడీ తప్పినందుకు ఆయనకి చాలా ఆనందంగా వుంది.
    అంతకుముందే ఎవరో పేషెంటు కృతజ్ఞతా పూర్వకంగా తెచ్చి ఇచ్చిన స్వీట్స్ బాక్సు తీసి అందరికీ పంచిపెట్టాడు ఆయన.
    "అర్ధరాత్రీ అపరాత్రీ ఇలా స్వీట్లు తింటే ఏం కాదా అంకుల్?" అన్నాడు లతీఫ్ నాలుగు స్వీట్లు తీసేసుకుంటూ.
    "తినవయ్యా తినూ! తినడానికే మనం వుందీ! ఇవాళ ఒక్కరోజుకీ తింటే ఏమీకాదులే! ఏమన్నా అయితే నేను వున్నానుగా!" అన్నాడు డాక్టర్ వెంకయ్య.
    "తినమంటే ఒక్కటి తినమని! అంతే తప్ప బాక్సు మొత్తం బాక్సుతో సహా తినేయమని కాదు. కాస్త జాగ్రత్త!" అంది భావన అల్లరిగా.
    అంతా అయ్యేసరికి తెల్లవారుఝామున మూడు అయింది.
    మామూలుగా అయితే, అది ప్రతిరోజూ వెంకయ్య నిద్రలేచే టైము.
    అయినా సరే, ఆ రోజుకి ఇంక నిద్రే వద్దనుకున్నాడు వెంకయ్య.
    ఆయన ఎప్పుడూ అంతే! అందరిలాగా కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS