"మనం పెద్దవయసు వాళ్ళం వెంకయ్యా! పైగా మొగవాళ్ళం. పరిస్థితులని ధైర్యంగా ఎదుర్కోవాలి."
"సార్! ఏం జరిగింది?" అన్నాడు వెంకయ్య భయభ్రాంతుడయిపోతూ.
సూపరింటెండెంట్ సీటులో నుంచి లేచి, టేబుల్ చుట్టూ తిరిగివచ్చి వెంకయ్య భుజం మీద చెయ్యి వేశాడు.
"సారీ వెంకయ్యా! ఇప్పుడు వచ్చిన డెడ్ బాడీస్ రెండూ నీ బిడ్డలవే! శాంతి, వివేక్!"
నోటమాట రాకుండా నిశ్చేష్టుడయి కూర్చుండిపోయాడు వెంకయ్య.
* * * *
హాస్పిటల్ లోనే ఒకచోట కూర్చుని వున్నారు అరుణా, భావనా.
భావన చెబుతుంటే అరుణ వింటోంది.
"మీడియా వాళ్ళు మూగి ఉన్నారు బయట. సెన్సేషనల్ మర్డర్స్ కదూ!
మూడ్రోజులపాటు న్యూస్ మోగిపోతుంది.
ఆ తర్వాత వార్తలు అమ్ముకోవడానికి అనువైన సెన్సేషన్ ఇంకేదో జరుగుతుంది. అప్పటిదాకా..." అంటోంది భావన.
"ఒకే రోజున ఒకే ఫ్యామిలీలో డబుల్ మర్డర్స్! హౌ హారిబుల్!" అంది అరుణ.
మీడియా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుసుకున్నదేమిటంటే -
డాక్టర్ వెంకయ్య కూతురు శాంతి చాలా తెలివైన అమ్మాయి. చాలా ప్రామిసింగ్ స్టూడెంట్. తన స్టడీస్ తప్ప ప్రపంచంలో ఇంకేమీ పట్టనట్లుగా వుండే తరహా పిల్ల.
అట్లాంటి శాంతి వెంటపడ్డాడు నగేష్. 'నాగూ' అని పిలుస్తారు అందరూ అతన్ని. నాగూకి చదువు రాలేదు గానీ కాలేజీలో సీటు మాత్రం వచ్చింది. ప్రేమ ప్రేమంటూ శాంతిని వేధించడం మొదలయింది.
చాలా రోజుల ఓపిక పట్టి ఇంక పరిస్థితి దుస్సహంగా మారడంతో, విధిలేక తన అన్న వివేక్ తో చెప్పింది శాంతి.
అసలైన ప్రేమ అంటే ఏమిటో అర్థం చేసుకునే వివేకం వుంది వివేక్ కి. విచక్షణ వుంది. ఎందుకంటే, అతనూ స్వయంగా ప్రేమలో పడ్డవాడే! ఆ అమ్మాయి కూడా స్టూడెంట్స్ యూనియన్ లో యాక్టివు మెంబరు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు.
వివేక్ వెళ్ళి తన చెల్లెలి వెంటబడుతున్న నాగూని కాలేజ్ క్యాంటీన్ లోనే కూర్చోబెట్టి హితబోధ చేశాడు.
"నువ్వు మాత్రం నా చెల్లెలి వెంటపడటం లేదా?" అని ఎదురుప్రశ్న వేశాడు నాగూ.
"కానీ శాంతికి ఇష్టం లేదు కదా!"
'నా చెల్లిని నువ్వు చేసుకోవడం నాకు మాత్రం ఎట్లా ఇష్టం వుంటుందిరా నా కొడకా! నీ చెల్లిని నేనూ, నా చెల్లిని నువ్వూ చేసుకునేటట్లయితే ఓకే! లేకుంటే..."
"అది కుదరదు నాగూ"
"అట్లయితే మళ్ళీ మన ఫ్యామిలీల మధ్య ఉన్న పార్టీలకి పొగబెడతా! ఫ్యాక్షనిజానికి భయపడి నీయబ్బ ఊరొదిలి వెళ్ళిపోయినంత మాత్రాన ఫ్యాక్షను పోతుందిర? నువ్వేం రెడ్డోనివిరా! నా చెల్లిని, కులం కాని కులంవాడు చేసుకుని కులుకుతూ వుంటే చూస్తూ వుండనీకి గాజులు తొడిగించుకుని కూర్చున్నాన్ర? యాటకొడవళ్ళని చిందునాట్యం చేయించిన చేతుల్రా ఇయ్యీ! మీ అన్నా చెల్లెళ్ళనిద్దరినీ నడిరోడ్డులో నరుకుతా నాయాలా!"
అన్నంతపనీ చేశాడు నాగూ.
అన్నా చెల్లెళ్ళ శవాలు హాస్పిటల్ కి చేరాయి.
వాటి వెనకే వచ్చాడు ఒక మినిష్టరు.
పేరుకి పరామర్శ. అసలు విషయమేమో మూసి ఉన్న సూపరింటెండెంట్ ఆఫీసు తలుపుల వెనుక బయటపడింది.
"ఇతనే డాక్టరు వెంకయ్య" అన్నాడు సూపరింటెండెంటు.
"పోస్టుమార్టం చేసింది నువ్వేనా?" అన్నాడు మినిష్టరు.
జవాబు చెప్పకుండా చూస్తున్నాడు డాక్టర్ వెంకయ్య.
"ఆ చచ్చిపోయిన శాంతీ, వివేక్ లు నీ బిడ్డలేనా?"
"........"
"నాగేష్ వాళ్ళ నాయన నా మనిషి. వాని వంటిమీద ఈగ వాలడానికి వీల్లేదు. అర్థమయిందా? ఏమి!! వాడు ఒక పిల్లని గ్యాంగ్ రేప్ చేయిస్తే చేయించినాడు! ఏమి! ఇద్దరు కాకుంటే నలుగుర్ని నరికాడు. నువ్వేమి తురుమ్ ఖానువా? చెప్పింది చెప్పినట్లు చెయ్! చెప్పమన్నవి చెప్పు! రాయమన్నట్లు రాయ్! సంతకాలు పెట్టమన్నచోట పెట్టు! అప్పుడే బతికి బాగుంటావు బిడ్డా! లేకుంటే పోయినోళ్ళతో నీవూ పోతావు!"
వెంకయ్యకి ఉన్నట్లుండి ఆవేశం వచ్చింది.
దానితోబాటుగా ఆగ్రహం!
దేశంలోని దిక్కులేని వాళ్ళూ, దీనుల కోపం అంతా ఆయన ద్వారా బయటపడ్డట్లుగా-
"నేను మీరు ఆడించినట్లు ఆడను. నాగూ ముగ్గురి మరణాలకి కారకుడు. పోస్టుమార్టంలో నేను ఉన్నది ఉన్నట్లుగా రాస్తా. ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్...."
"నీకు పిచ్చి లేచిందా ఏమి?"
"ఉన్నది ఉన్నట్లుగా రాయనీయకపోతే నేను రాజీనామా రాసి ఇచ్చేస్తా!" అన్నాడు వెంకయ్య.
"రాజీనామా ఇచ్చేస్తే రాజీకి వచ్చినట్లు కాదు. చెప్పింది విని, చెప్పినట్లు రాయకపోతే ఇక్కణ్ణుంచి బయటకు వెళ్ళవు" అన్నాడు మినిష్టరు.
తన లిమిట్స్ తనకి అర్థమైనట్లు తలవంచుకుని కూర్చున్నాడు వెంకయ్య.
కొద్ది నిమిషాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా "సరే!" అన్నాడు. ఆ వెంటనే మళ్ళీ 'నాకు భయంగా వుంది. ఒక్కసారి బాత్ రూంకి వెళ్ళిరావాలి." అన్నాడు.
తను బెదిరిస్తే, ప్యాంటు తడిపేసుకున్నవాళ్ళు ఆ మినిష్టర్ కి ఎరికే!
"వెళ్ళిరా!" అన్నాడు నవ్వుతూ.
బాత్ రూంలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు వెంకయ్య. తక్షణం తన సెల్ ఫోన్ తీసి ఇంటి నెంబరు రింగ్ చేశాడు.
అతని భార్య శారద లైన్లోకి వచ్చింది.
"శారదా!" అన్నాడు వెంకయ్య ప్రేమగా.
"పిల్లలు ఇంకా ఇంటికి రాలేదండీ" అంది ఆమె ఆదుర్దాగా.
"రారు శారదా!"
"అదేమిటండీ?"
"టీవీ న్యూస్ లో వచ్చేసే వుండాలే? వాళ్ళని నరికేశారు శారదా! నేను కూడా వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చేసింది."
"ఏవండీ.."
"టైము లేదు. నేను చనిపోయినా, మన ఆదర్శాలని నువ్వు బతికించాలి శారదా!"
"ఏవండీ.."
"టైం లేదు శారదా! వెళ్తున్నా."
లైన్ డిస్ కనెక్ట్ చేసేసి, మెడలో ఉన్న లాకెట్ ఓపెన్ చేశాడు వెంకయ్య.
అందులో సైనైడ్ కాప్స్యూల్ వుంది.
ఈ స్వతంత్ర భారతంలో ఆదర్శాలు పట్టుకు వేళ్ళాడే వాడికి, మెళ్ళో సైనైడ్ కాప్స్యూల్ వేళాడుతూ వుండడం కూడా అవసరమే అని గ్రహించాడు వెంకయ్య.
ఏరోజు ఎట్లాంటి పరిస్థితి వస్తుందో?
ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది.
సైనైడ్ క్యాప్స్యూల్ మింగేశాడు వెంకయ్య.
* * * *
డాక్టర్ వెంకయ్యగారి భార్య శారద మొహం వైపు చూడాలంటే భయం భయంగా అనిపిస్తోంది అరుణకీ, భావనకీ కూడా.
ఒకే రోజున భర్తనీ, కొడుకునీ, కూతురినీ కూడా కోల్పోయిన షాక్ ని తట్టుకోగలదా ఆమె?
ఆ ప్రశ్నకి సమాధానం అప్పటికప్పుడే దొరికింది.
ఆమె ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టడం లేదు. చాలా నిబ్బరంగానే ఉంది.
ఇంటిముందు మీడియా వాళ్ళు కుతూహలం కొద్దీ గుంపులు గుంపులుగా వస్తున్న జనాలు - అదుపుచేయడానికి పోలీసులు - సానుభూతి ప్రకటించడానికి వచ్చిన బంధుమిత్రులు. మర్నాడు జరగవలసిన తంతుకి ఏర్పాట్లు.
వీటన్నిటి మధ్యా కూడా తనకేమీ పట్టనట్లుగా కూర్చుని ఉంది శారద. తనలో తనే ఏదో వల్లెవేస్తున్నట్లుగా గొణుక్కుంటోంది.
అరుణ ఆమెకి దగ్గరిగా వెళ్ళి "ఏమిటి ఆంటీ?" అంది నెమ్మదిగా.
కలలో మాట్లాడుతున్నట్లుగా గబగబ చెప్పడం మొదలెట్టింది శారద.
"వైద్యం అంటే అది ఒక వ్యాపారం అయిపోయింది. గవర్నమెంటు ఆసుపత్రులలో అన్యాయాలకి అంతు లేదు. డాక్టర్లు ఉండరు! మందులు వుండవు! అక్కడ ప్రాణాలకీ పైసలకీ లంకె! సొమ్ము ఇస్తేగానీ శవాన్ని కూడా ఇవ్వరు. కాసులు కుమ్మరిస్తే గాని ఆపరేషన్ కి కత్తి తీయరు. కుక్కకాటుకి కూడా మందులేని ఆసుపత్రులు. కుక్కకాటుకి చెప్పుదెబ్బే మందు. పాము కాటుకి కూడా మందు వుందేమో గానీ మనిషి కాటుకి మందు లేదు. కాలకూట విషం! సాగర మధనంలో హాలాహలం పుట్టుకొచ్చినప్పుడు శంకరుడు దానిని మింగి గరళ కంఠుడయ్యాడు. సైనైడ్ కాప్స్యూల్స్ ని ఎప్పుడూ మెడలో వేసుకు తిరుగుతూ ఉండేవాడు మా ఆయన. ఆదర్శాలని నమ్ముకుంటే అంతే! ఎప్పుడు ఎక్కడ చావు మూడుతుందో, ఎప్పుడు ఎక్కడ ఎట్లా చావుని వరించాలో తెలియదు. అయినా సరే మనం ఆదర్శాలని...
షాక్ తో శారదకి మతిస్థిమితం తప్పిందని అందరికీ అర్థమయిపోయింది.
* * * *
