ప్రజలు చక్కగా, చప్పరిస్తూ మింగారు యీ ప్రణయ చౌర్యాల్ని. యెంకి ప్రియుడి కోసం యేడిస్తే బూతు అయింది. రాధ - శ్రీనాధుడి వీధి నాటకంలో కన్న బూతుగా యేడిస్తే పవిత్రమయింది. అధ్యాత్మీకమని గంధ అర్ధాలు యేర్పరచినారు. పోట్లాడారు తిరిమారు, చీల్చారు యెంకి పాటల్ని, ఆపి చావలేదు. ఎదురు తిరిగాయి, ఆంధ్రులకన్న యెక్కువ జవసత్వాలుండబట్టి ఆ శృంగారాన్ని వదలలేరు, వొప్పుకోడం యిష్టం లేదు. అందుకని వాటిల్లోని అంతరార్ధాన్ని చూస్తున్నామన్నారు. నగ్న చిత్రాల్లో, ఆర్టుని మాత్రమే గ్రహిస్తున్నామని చెప్పి సంతుష్టి పడినా మిత్రులను బట్టి "ఏ మాటలాడిన" అనే క్షేత్రయ పదం వుంది కృష్ణుడి మీద, దాని అందానికి మురిసి గురుశిశ్రూష చేశాను కొన్నాళ్ళు. ఆయన కనికరించాడు గాని ఆ శృంగార పదం చెప్పడం అయన మర్యాదకి సిగ్గు కనక దాంటో అంతరార్ధం వుందన్నాడు.
తరవాత శ్రీకృష్ణుడు చిలకమర్తి కవుల చేతుల్లో పడి, దొంగ ఇంద్రజాలికుడూ, నీచ చమత్కారి, ధూర్తుడూ, రౌడీ, నీచుడూ, భీరుడూ hen- pecked muff అసమర్ధ దంభకుడూ స్త్రీ దాసుడు -- ఏం కాలేదు? ఆ నాటక కర్తలకు యీ కృష్ణవేషధారులు, పొట్టి వాగు, బొర్రలవారు, మరిగుజ్జులు, తాగుడువారు, పొట్టి మీసాలవారు, పెడిమూతులవారు, గంతుల వారు,కురూపులు, కుర్చీల కింద దూరేవారు. అరగంట రాగాలవారు, నీలపు రంగు బనియన్లు వేసి, నెమలి యీకలు కట్టుకుని దొంగ చూపులు చూసే దౌర్భగ్యులు- సహాయపడ్డారు- శ్రీకృష్ణుడి పాడెకట్టడానికి. ఈ పురుష సత్యభామలూ, బొండు రాధలూ, చావు మేళం వాయించారు.
తెలుగు ఫిల్ములు శ్రీకృష్ణుడికి ఆస్తి సంచయానాన్ని కానిచ్చాయి. కృష్ణలీలల్లో కృష్ణుణ్ణి చూసింతరవాత భాగవతం చదవడం పాపమనిపిస్తుంది. ఒకసారి పరధ్యానంగా ఏదో ఫిల్ము అనుకుని వెడితే -- అ జరిగిందేమిటో తెలీక -- మళ్ళీ తెలుగే - పక్క ఆయన్ని అడిగాను- ఏం పిల్ము అని. రుక్మిణి కళ్యాణమన్నాడు. తీరా వొచ్చాను కదా - తెలుగు ఫిల్ములు చూడనని ఆంధ్రాభిమానును నన్ను నిందిస్తూన్నారని - కూచుంటే -- ఆ కృష్ణుడి సంగతీ -- ఆ రుక్మిణీ సంగతీ -- తనివితీరా వ్రాస్తే - డిఫమేషన్ కింద వొస్తుందేమోనని మానుకుంటున్నాను. అద్భుతంగా మానవత్వమూ, దేవత్వమూ ఐక్యమైన శ్రీ కృష్ణుణ్ణిట్లా మురికి బురదలో తొక్కితే - ఏ భక్తీ లేని నాకు కూడా దిగులు పుడుతుంది. భక్తులకి కనబడదు లెండి. పైగా నేనేదో యీ పురాణి కాదర్శాలని ధ్వంసం చేశానని యేడుస్తాయి పత్రికలు! పైగా బూతుకధలు వ్రాస్తున్నారని యువకులని తిట్టే యీ ముసలి ప్రభువులందరూ, చొంగలు కార్చుకుంటో గుంపులు గుంపులు పోతారు, ఆడవేషాలు వేసుకున్న మొగాళ్ళ కులుకులు చూడ్డానికి, పతివ్రతల వేషాలు వేసి ప్రియుల్ని సంపాదించే తారల అందాలు చూడ్డానికి. బాగా చూసివోచ్చి, ఆ స్త్రీలని నోటికి వొచ్చిన తిట్లు తిట్టి, పుస్తకాల్ని , ఉచితంగా యాచించి తీసుకుని, బాగా దాచుకుని చదివి, యిష్టం వొచ్చినట్టు తిట్టి , తమ పవిత్రతని సమర్ధించుకుంటారు. బూతు బతుకులు బతికే పండితులూ, నోటి వెంట బూతులు లేకుండా మాటరాని శాస్త్రులూ, బూతులు లేకుండా చీట్ల పేక ఆడలేని -- క్లబ్బువాలాలు, నవీన వాంగ్మయంలో బూతులు ఏరి, చప్పరించి ఏడ్చేవారే!
పక్క మీద కళ్ళు తెరిచేటప్పటికి శుక్రుడు కళ్ళల్లోకి మెరిశాడు. నా జీవితం మీద గుడ్డి శుక్రుజీ ప్రకాశింపపోతున్నాడు అనుకుంటో మళ్ళీ కళ్ళు మూశాను.
ఈసారి సూర్యుడే లేపాడు. మబ్బుల సందుల్లోంచి . ఎన్నాళ్ళయింది యిట్లూ తీరుబడిగా పక్క మీద చూస్తో పడుకుని చప్పున ముంచుకుపోయినట్టు తొందరగా లేవకుండా!
పని .......పని......పని...పని వుందనే ఆదుర్దా.
సంపాయించే పనిగాక, తెచ్చి పెట్టుకున్న పనులు. చాలా గోప్పదనుకుని, పనులమూలంగా మనసుకి గర్వం తెచ్చుకున్న పనులు , చదువు స్నేహంలోకి మ స్బేహం ముద్దులలోకి మారదా, అనే ఆశతో, శుక్రుడి మీద భారం వేసి నెత్తిన వేసుకున్న పనులు-
మబ్బు సూర్యుడి మీదికి జరిగింది.
ఇట్లానే నిన్న గం --- గారి ముఖం మీదికి విచారం పాకింది ------తిరిగి తిరిగి ప్రయత్నించి నవ్వాలని, విచారాన్ని మింగి మాట్లాడాలని యుద్ధం చేసిన పెదిమలు, కొనలు కిందికి నా గుండెమీదికి జారిన పెదిమలు.
"నేనున్నాను. భయం లేదు."
ఉన్నాను. కాని భయం లేదా?
ముందు నాకు భయం లేదా? నావల్ల భయం లేదా?
మాటలు. ఓదార్పులు.
అభయమిచ్చాననీ, తీసుకున్నాననీ అట మా మధ్య.
ఏదో అశాంతి. ఎవరో తీర్చగలరని అవ్యక్తపు ఆశ. ఇన్ని స్త్రీ హృదయ రహస్యాలను చిత్రించినవాడు, తనకే తెలీని తన రహస్య సమస్యని విప్పి చూడలేడా అనే ఆతృత.
ఏం చెయ్యగలను?
భోజనం పెట్టగలను. అంతే.
చాలా?
