"అందాకా , యీ వివాహం, యీ విద్య, యీ కాపీనం ....." ఏం చేస్తున్నారు? మీ కాలం, మీ శక్తి, మీ ధనం ..... ఈలోపల, పక్కన మూలిగే ముసలమ్మకన్న దిక్కులేక తడిసే పిల్లికూనకన్న ......మూడు తరాల తరవాత సంతతి మీద ఎక్కువ దయ ...... దగ్గిర బళ్ళో హింసించే టీచరు కన్న , పెళ్లి చేసే, తల్లి మీద కన్న , తన్నే అధికారి మీదకన్న, దాచుకునే వర్తకుడి మీదకన్న , కనపడని దేవుడి మీద, కాశీలో ఆలయాల మీద, బొంబాయిలో కోటీశ్వరుడి మీద కోపం.
'సంస్కారం, ప్రజాక్షేమం' అన్నారు గనక వ్రాస్తున్నాను యీ మాటలు. కర్మ పరిపొకం మాట్లాడే వేదాంతులలో,స్వలాభం తప్ప యోచన లేని మర్యాదస్తులతో నాకు పరిచయమే వొద్దు.
అట్లాగే -- వెముకలు వొంగే , గుండెలు ఆగే , రక్తం ఎండే మనసులు మండే , జీవశక్తి, నశించే , బడిపిల్లల మీదకన్న , దిక్కులేక అల్లాడే ప్రజల కన్న , మృగాల మీద దయ-
తిండి లేని పిట్టల మీద, పుళ్ళు కారే గుర్రాల మీద, బళ్ళు తాగే మనుషుల మీద, తెల్లార్లూ ఏడ్చే కుక్కల మీద, నడుం వరకు తెగిన మిడతల మీద - దయకన్న - జంతు బలుల మీద కోసం.
"హరిజనవిద్యార్ధి" అనే దాంటో హరిజనులకన్న బ్రాహ్మలకే ముందు సహాయం చెయ్యాలి , అన్నారుగా?
అవును, కారణాలు చూపాను.
ఏమైతేనేం, అన్నారుగా! అన్నాయి వాళ్ళ కళ్ళు.
బ్రాహ్మణుల మీద నాకేం ప్రత్యేకం ద్వేషం లేదు అంటోంది నా మనసు.
హరిజనుడంటే ప్రత్యేకం ద్వేషం లేకపోతే చాలదు.
ప్రత్యేక ప్రేమ కావాలి.
బ్రాహ్మణుడంటే ప్రత్యెక ఘనత లేకపోతే చాలదు.
ప్రత్యెక ద్వేషం కావాలి.
తనతో సమానంగా తక్కిన పిల్లల్ని చూస్తోందని తల్లి మీద కోపగించే పిల్లలాగు.
ఆనాడు తనకు కష్టం కలిగితేనేం. తల్లి హృదయంలోని ఆ సమత్వం , తన జీవితానికి దీపమౌతుందని తెలీదు పిల్లకి.
బ్రాహ్మణుడూ , హరిజనుడూ - ఈ మాటలకి అర్ధం లేదనే వాడి కన్న హరిజనుల్నీ , బ్రహ్మల్నీ ద్వేషించేవాడే సన్నిహితుడు.
సంఘ సంస్కారంలో ముఖ్యంగా యీ రాజకీయం కోసం జరిగే సంఘ సంస్కారంలో ఉండే shallowness కృతిమం , కనపడదు మనుషులకి.
"చాలా మారిందండీ లోకం! పూర్వం మీరు ఇతర జాతి వారితో భోజనాలు చేసి వేలిబడ్డవాటికీ యీ నాటికీ......."
నిజమే మారింది. అధికంగా మారింది. ఏం మారింది లోకం అంటే,
ఈ "అంటే?" అనే మాటని చూస్తె ఎంత కోపం, ఎంత ఇబ్బంది ప్రజలకి? 'ఆలోచించు' అన్నమాట. ఆలోచించడం ఎంత బాధ! కాని అనక తప్పదు.
అంటే? ఆచారాలు మారాయి. కాని హృదయాలూ?
కాస్మపాలిటన్ భోజనాలలో ఎంత ప్రేమ, ఎంత సమత్వం, ఎంత స్నేహం వున్నాయి/ జాతిని జాతి, కులాన్ని కులం, తిట్టుకుంటో అనుమానించుకుంటో , పోటీలు పడుతో -- ఒకే పంక్తిలో భోజనం.
స్త్రీకి ఎంత స్వేచ్చ , ఎన్ని కొత్త నగలు, పౌడర్లు, మీటింగులూ ఎదిరింపులు!
పిల్లల మీద ఎంత ప్ర్రేమ! ఎన్ని బడులు, ఎన్ని బెత్తాలు!
అధికులమనే పూర్వపు బ్రాహ్మణులు, భార్యల్ని తన్నే భర్తలు, ముంత పొగలు పెట్టె తల్లులే నయమేమో!
అట్లానే మతం యీ దేశంలో Half sentiments, half superstitions, and allthrough selfishness,
హరనాద్, శాయి బాబా , రమణ మహర్షి.
నేనిస్తాను పుచ్చుకో,
నేనడిగింది ఇచ్చుకో,
కాకపోతే నువ్వెందుకు?
నేనడిగిందానికి,
నీకు నేనేమివ్వాలి?
భజనలూ, స్తోత్రాలు, చాలా, ఇంకా దానాలూ, సంతర్పణలూ, మొక్కుబళ్ళూ కావాలా?
చాలా ఖర్చుగా వుందే! నాకు కావలసింది తీరా చేస్తాడో చెయ్యడో ఆ రుషి. ఇంతకన్న తిరుపతి మొక్కులు నయం.
పని జరిగితేనే fees.
మొగుళ్ళని బతికించి, జుట్టు నిలపెడితే,
ఆ జుట్టుని నీకిస్తా.
సజావుగా , తెలివిగా వుంది బేరం!
దేవుడా! నువ్వే వుంటే,
నీ భక్తుల్ని చూసి ఎంత సిగ్గుపడుతున్నావో!
నిజమైన కళ కవి sub- conscious లోంచి బైలు దేరుతుంది. అందువల్ల ఎప్పుడూ సారస్వతము ఆనాటి ప్రజల ప్రోద్భలాల్నీ నిజ స్వభావాల్నీ వెల్లడించి తీరుతుంది. సంస్ర్కుత భారతం నాటి నించి , ఉద్భవించిన శ్రీకృష్ణుడి చరిత్రని యీనాటి వరకు పరిశీలిస్తే మనదేశపు ఆధ్యాత్మికాభివ్రుద్ది స్పష్టమౌతుంది. తెలుగు భగవతంలో కృష్ణుడు, అల్లరికి, మోసానికి, మోసాలకి అతీతుడనే భావం చూపిస్తాడు. కవి గాని పోతన్న కృష్ణుడి ఘట్టాలలో కవిత్వంలోకి breakఅవుతాడు. కృష్ణపతనానికి ప్రారంభకుడు తిక్కన. అర్జున సారధికి , భగవద్గీత భోధకుడికీ, సంబంధం కుదర్చలేకపోయినారు తిక్కన్న గారు. తిక్కన్న shallowness, కృష్ణుణ్ణి heart - loss piotter ఇతరుల పతనంలో సంతోషించే potty scoundrel ని చేసింది.
తరవాత కొన్ని మెట్లు శ్రీకృష్ణున్ని దిగజార్చింది ప్రబంధకవులు - ఎన్ని కావ్యాలు -- ఎన్ని వర్ననలు- సమస్తమైన అసహ్య శృంగారమంతా , తనివితీరా కృష్ణుడి నెత్తి మీద బోర్లించి కృతార్ధులైనారు. అంత అసహ్యాన్ని , అంత నీచత్వాన్ని సమర్ధించి మంత్రపు నీళ్ళు చల్లి మడి కట్టించేందుకు కృష్ణనామం బహుబాగా ఉపయోగపడ్డది. భాగవతంలో కృష్ణుడు చేసిన అన్యాయాలూ, అల్లరులూ పవిత్రం కాలేదా, అట్లానే యీ శృంగారాలూ, జారత్వాలు కూడా ఆ కృష్ణ స్పర్శ వల్ల అధ్యాత్మికాలు కానా అన్నారు కవులు. ఆ సాంప్రదాయాన్నే చక్కగా అందుకున్నారు నవీన కవులు. తమ శృంగార భావాల్ని, విరహల్ని, ఆశల్ని, కలల్ని, అన్నిటినీ కృష్ణుడికి అంట కట్టారు. రాధ ఏడుస్తోందని, తాము కృష్ణులమని కులికారు. కృష్ణుడి వేణు నాదం వొంక పెట్టి, తమ ప్రియాలాపాల్ని వర్నించుకున్నారు. నిజం చెప్పే ధైర్యం లేక, గోపిక పేర్లు పెట్టి ప్రేమాంగలనకి అచ్చులో హృదయాల్ని నేళ్ళాడి చేసుకున్నారు.
