Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 27


    బిందుమాధవి పరిపరి విధాల ఆలోచిస్తుండగా సాహితీ, అనూష కారు దిగారు.
    భారంగా నిట్టూర్చింది బిందుమాధవి. ఆమె ఆనందానికి అవధులు లేవు. తన ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం కుదిరింది.
    "ఆంటీ! బాగున్నారా! అర్జెంటుగా రమ్మన్నారట. ఏమిటీ విశేషం" అంది అనూష చిరునవ్వు నవ్వుతూ.
    "విశేషం ఏమీ లేదమ్మా! ఆ రోజున ఇంటినుంచి వెళ్ళావు. మళ్ళీ రాలేదు. నామీద కోపం తగ్గిందా? ఇంకా నన్ను అనుమానిస్తున్నావా?"
    "లేదు లేదు. ఆంటీ! మీ మీద నాకెప్పుడూ సదభిప్రాయమేవుంది. నన్నర్థం చేసుకున్నారు కనుకే ఆ రోజున మా నాన్నగారి కంట పడకుండా నన్ను తప్పించారు. మీ సహాయాన్ని నేనెప్పుడూ మరచిపోను" అంది కృతజ్ఞతగా.
    "థాంక్స్ అనూషా! ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు."
    తరువాత బిందుమాధవి గదిలోకి వెళ్లి ఫోన్ చేసి వచ్చింది.
    "ఆంటీ! మీరిక్కడికి ఫోన్ చేశారు?" అనూష అనుమానంగా అడిగింది.
    "పిచ్చి పిల్లా! ఇప్పుడే అన్నావుగా నామీద సదభిప్రాయం ఉందని. మరి అంతలోనే నన్ను అనుమానిస్తున్నావా?"
    అనూష వెంటనే ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది.
    "అనూషా! నేను ఎన్నో జీవితాలను చదివానమ్మా! మరెన్నో అనుభవాలను రాశాను. కాని కళ్ళెదుటే కనిపిస్తున్న మీ జీవితాలు చివరికి ఏమవుతాయో అర్థం కాకుండా ఉంది" ఆమె మాటల్లో ఆవేదన గూడుకట్టుకుని ఉంది.
    ఆమె ఎందుకు బాధపడుతున్నదో సాహితికి కాని, అనూషకు గాని అర్థం కాలేదు.
    "కొందరి జీవితాలు కథలు అల్లడానికి బాగానే ఉంటాయి. కాని వాస్తవంలో అందరి జీవితాలూ వడ్డించిన విస్తళ్లు కావు. హృదయం వున్న ఏ వ్యక్తికీ తట్టుకోలేని బడబాగ్ని కొందరి జీవితాల్లో ఉంటుందమ్మా!"
    ఆమె చెబుతున్న జీవిత సత్యం అర్థంకాక ఇద్దరూ తెల్లముఖాలు వేశారు.
    ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, రచనలతో యువతను ఉత్తేజపరిచి, విజ్ఞానంతోపాటు వినోదాన్ని కలిగించే రచయిత్రి ఇవ్వాళ ఇలా నైరాశ్యంతో మాట్టాడుతున్నదేమిటి?
    ఆడదాని జీవితం ఎప్పుడూ వడ్డించిన విస్తరి వంటిది కాదు. తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాలు తర్వాత అగాధాలను సృష్టిస్తే నష్టపోయేది ఎవరు? ఆడదాని జీవితం ఎప్పుడూ ముల్లు మీద అరిటాకు లాంటిదే! ఈరోజు తను జీవచ్చవంలా ఎందుకు మిగిలిపోయింది?
    అదురుతున్న ఆమె పెదవులు నిజాన్ని నిర్భయంగా చెప్పాలని ఆరాటపడుతున్నాయి.
    గుండెను తొలిచే గత జీవిత చేదు అనుభవాలను వాళ్ళ ముందు ఆవిష్కరించాలని, గడచిన దశాబ్దాల తన అనుభవాల పుటలను తిరగవేసింది బిందుమాధవి.


                                 *    *    *    *


    ఆమె గుప్పిడి తెరచింది.
    ఆమె అరచేతిలోని పసుపుతాడు చూసి అతను క్షణం ఖిన్నుడయ్యాడు. జరుగుతున్నది కలో, వాస్తవమో అర్థం కావడం లేదు. అతని నోటివెంట మాటలు తడబడుతున్నాయి.
    "రచయిత్రివి, అన్నీ తెలిసినదానివి. కథ వేరు, జీవితం వేరు. నువ్వు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేదనిపిస్తోంది."
    "లేదు లేదు, నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మీరేమీ అడ్డు చెప్పకండి. నా మాట విని...."
    "అనవసర త్యాగాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో! అయినా కాటికి కాళ్ళు చాపుక్కూర్చున్న శోభనాద్రికి, నిండా పదహారు దాటని బిందుమాధవికి పెళ్ళేమిటని సమాజం పగలబడి నవ్వదూ?"
    "ఇప్పుడు మీరు అవీ, ఇవీ చెప్పి కాదంటే గుప్పెడు విషం తీసుకుని మీ కళ్ళెదుటే..." ఆవేశంగా అంటున్న ఆమెను మధ్యలోనే ఆపుతూ "ఛ! ఛ! అంతమాట అనకు. నీ శ్రేయస్సు కోరి ఇంతగా చెబుతున్నాను కానీ, నిన్ను కాదనుకోవాలన్న వేరే భావనే లేనే లేదు. నా శేష జీవితానికి ఓ ఆలంబనగా ఉంటానంటున్న నిన్ను వదులుకుంటానా?"
    వణుకుతున్న చేతులతో ఆమె అరచేతిలోని పసుపుతాడు అందుకున్నాడు అరవై ఏళ్ళ శోభనాద్రి.
    "కాశీ మజిలీ కథలా ఉన్నదా అమ్మా నా జీవితం? అంత ఆసక్తిగా వింటున్నారు?" చెప్పడం ఆపి అంది బిందుమాధవి.
    'ఇది బిందుమాధవి స్వీయ జీవితమా....!' తెల్లబోయారు ఇద్దరూ.
    ఆమె జీవితం ఇంకే మలుపు తిరగనున్నదో తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారిద్దరూ.
    ప్లాస్క్ లో ఉన్న టీ మూడు కప్పులలో పోసింది బిందుమాధవి. సాహితి, అనూష టీ కప్పులు అందుకున్నారు.
    టీ తాగుతున్నా బిందుమాధవి ఆలోచనలో ఉన్నట్టు ఇద్దరూ గ్రహించారు.  
    "చెప్పండి ఆంటీ! మధ్యలోనే ఆపేశారు!" అనూష గుర్తుచేస్తున్నట్టు అంది.
    బిందుమాధవి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. గత జీవితానుభవాలను తిరిగి గుర్తుచేసుకోవడం వల్లనేమో ఆమె హృదయం బరువయింది.
    ఆమె గత చరిత్ర వింటున్న ఇద్దరికీ ఆమె చేసిన పని సాహసోపేతమైనదని అభినందించాలో లేక నిండు జీవితాన్ని ఒక ముదుసలితో పంచుకోవాలనుకున్న ఆమె మనస్తత్వానికి జాలిపడాలో అర్థం కావడంలేదు.
    జీవితాన్ని, జీవితపు విలువలను క్షుణ్ణంగా తెలుసుకోగల నేర్పు, సమాజాన్ని అన్ని కోణాల నుంచి చదవగల మనోనేత్రం గల రచయిత్రి తన జీవితాన్ని చేజేతులా ఎందుకు బలి చేసుకున్నదో?
    "ఆంటీ! అన్నీ ఉండి కూడా కొందరు సుఖానికి నోచుకోరు. కేవలం ఆదర్శం అంటూ జీవితాన్ని త్యాగం చేసుకున్న మిమ్మల్ని ఒక అభిమానిగా కొనియాడినా, ఒక స్త్రీగా నేను హర్షించలేకపోతున్నానని ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు." అనూష హృదయం బరువెక్కింది.
    "అతను ఈ సాహితీ ప్రపంచంలో నా చేత ఓనమాలు దిద్దించిన గురువు. నేను పిన్న వయసులో రాసిన కథలు, కవితలు తన పత్రికలో అచ్చువేసి నన్నో రచయిత్రిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అతను. అతనికి ముందూ, వెనుకా నా అన్నవాళ్ళెవరూ లేరు. ఆర్థికంగా నష్టపోయి పత్రికను మూసేశాడు. అతనికి గురుదక్షిణగా ఏమిచ్చినా రుణం తీరదనిపించే, అన్నీ ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను."
    "నేను తీసుకున్న నిర్ణయం తప్పంటావా అనూషా? అయినా నా మనసుకు తోచినట్టు చేశాను. నువ్వు మాత్రం కన్నతండ్రినీ, ఆస్థినీ వదులుకుని రాలేదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS