"నాకూ ఇదే ఆలోచన వచ్చింది." అన్నాడు ముత్యాలరావు.
పుండరీకాక్షయ్య ఆ మాట అన్న తరువాత- "మీరు చెప్పిందీ నిజమే!" అన్నాడు గోవర్ధన్.
"సరే ఏం చేస్తాం! మరి కొద్దిసేపు ఆలోచించి చూడండి!" అన్నాడు పుండరీకాక్షయ్య.
మళ్ళీ ముగ్గురూ ఆలోచిస్తూ వుండిపోయారు.
ఎన్ని విధాల ఆలోచించినా, ఎంత తిప్పీ తిప్పీ ఆలోచించినా, సరైన జవాబు ఎవరికీ తట్టలేదు.
చివరికి గోవర్ధన్ చెప్పాడు "కనపడని మనస్సుకీ, కనిపించే శరీరానికీ దెబ్బ తగిలితే బాధ వేస్తుంది." కాని అతను చెప్పిన జవాబు అతనికే నచ్చలేదు.
"భలే చెప్పావయ్యా!" అన్నాడు పర్వతరావు.
"భలే లేదు గిలే లేదు. నా ప్రశ్నకి ఇది సరిఅయిన జవాబు కాదు." అన్నాడు పుండరీకాక్షయ్య.
"అదేదో మీరే చెప్పండి!" అన్నాడు గోవర్ధన్.
"మరి మీ సంగతి ఏమిటయ్యా?" అన్నాడు పుండరీకాక్షయ్య మిగతా ఇద్దరి వైపూ చూస్తూ.
"మేము ఏమీ చెప్పలేక పోతున్నాం. అదేదో మీరే చెప్పండి!" అన్నారు వాళ్ళు.
పుండరీకాక్షయ్య గొంతు సవరించుకున్నాడు.
"బాధ పలురకాలుగా పడతాం. ఒక విషయం గురించి బాధపడతాం అని చెప్తే, రెండో విషయానికి అన్యాయం చేసినవాళ్ళమవుతాం. బాధపడని విషయం అంటూ ఏముంది చెప్పండి. శరీరంకాని, మనస్సుకాని, పరిస్థితులు కాని, ప్రతిదాంట్లోనూ బాధ అనేది దాగుంది. నా ప్రశ్నకి జవాబు చాలా చిన్నది, సున్నితమైనది.
"బాధతో బాధపడతాం" అన్నాడు పుండరీకాక్షయ్య.
"బాధతో బాధపడక ఛస్తామా? అదెలా?" అన్నాడు గోవర్ధన్.
"అదెలా అంటే ఏమి చెబుతాను. అందరూ కనేది కల అయినపుడు బాధపడేది బాధ వల్లనే అని చెప్పాల్సి వస్తుంది. తన తమాషా ప్రశ్నలకు, దిమాషా జవాబులు ఇలా వుంటాయి." పుండరీకాక్షయ్య నవ్వుతూ అన్నాడు.
పుండరీకాక్షయ్య మాటలకు వాళ్ళ ముగ్గురూ కూడా నవ్వారు.
"పధ్నాలుగవ మైలు రాయి వచ్చింది. ఇక్కడ దిగేవాళ్ళు దిగొచ్చు." పెద్ద కంఠంతో కండక్టర్ హెచ్చరించాడు.
బస్సు ఆగిన విషయమూ, తాము అక్కడే దిగాలన్న విషయమూ అప్పుడు గ్రహించారు.
"అరె! మనము దిగాల్సింది ఇక్కడే!" పర్వతరావు అన్నాడు తన సీట్లోంచి లేస్తూ.
"కబుర్లలో పడేసరికి బస్సు ఆగిన సంగతి కూడా మనకి తెలియలేదు. కబుర్ల వల్ల ప్రయాణం చేసినట్లే అనిపించలేదు. మనం దిగాల్సింది ఇక్కడే లేచిరండి. పుండరీకాక్షయ్యతో అని గోవర్ధన్ వైపు తిరిగి, "మీ వల్ల మాకు బాగా కాలక్షేపం అయింది ఇలాగే ప్రయాణంలో ఎప్పుడో కలుసుకుందాం." అని చెప్పి ముత్యాలరావు బస్సు దిగాడు.
వీళ్ళు దిగిన రెండు నిమిషాలకి బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది.
13
బస్సు దిగిన పుండరీకాక్షయ్య, ఒకసారి చుట్టూ పరికించి చూశాడు. చాలా దూరంగా ఇళ్ళు కాన వస్తున్నాయి. రోడ్డుకి ఒక ప్రక్క చెరువూ మరోప్రక్క పొలాలు వున్నాయి. రోడ్డుకి ఒక వారగా రెండు గదులు వున్నాయి. అవి కూడా తడికెలతో చేసినవి. తడికెలకి సినిమా పోస్టర్లు అంటించబడి వున్నాయి. బన్ రొట్టెలు, బ్రెడ్ లు, బజ్జీలు, పునుగులు, తెర్లుతున్న టీ డికాషన్ అలాంటి వన్నీ బయట కనపడుతున్నాయి ఆ గదుల నుంచీ.
