Previous Page Next Page 
మంచివాడు పేజి 27

దేనికైనా కాలం కలిసిరావాలి! బ్రహ్మరాత ఎలా వుందో! దాని రాత ఎలా వుందో! మంగపతి ఆలోచిస్తూ నిల్చున్నాడు.
మంగపతి దంపతులు కాస్త పాతకాలం వాళ్ళు. నొసటి రాతల్లోనూ, జాతకాల్లోనూ నమ్మకం కలవాళ్ళు.
కూతురు తారాదేవి జాతకం రాయించి భద్రంగా కొయ్య పెట్టెలో పెట్టి దాచాడు. కూతురుకు పద్దెనిమిదో సంవత్సరం వస్తేగాని పెళ్ళి కాదని జాతకంలో స్పష్టంగా రాసిపెట్టి ఉంది. అయినా మంగపతి కూతురికి పధ్నాలుగేళ్ళు నిండగానే సంబంధాలు చూడసాగాడు.
"జాతకం ఎలా ఉన్నా మానవ ప్రయత్నమూ వుండాలిగా?" అనుకొనేవాడు.
మంగపతి వేళ్ళమీద లెక్క వేసుకొస్తున్న రోజులు చూస్తుండగానే దొర్లిపోయాయి.
కూతురు పద్దెనిమిది నిండి పందొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టింది. అందువల్లే ఈ సంబంధం తప్పక కుదురుతుందనే నమ్మకంతో బయలుదేరాడు. అపశకునం ఎదురైంది.
"లోపలకు వచ్చి రెండు నిముషాలు కూర్చోండి."
భార్య మాటలకు లోపలకు వచ్చి కూర్చున్నాడు. ఈసారి ఏ అపశకునం రాకుండా జాగ్రత్తపడ్డారు ఆ దంపతులు.
కాంతమ్మ పెద్ద కానంత కుంకం బొట్టు పెట్టుకొని దొడ్డితోవన బయటికివెళ్లి ఇంటి చుట్టూ తిరిగి వీథి వాకిట్లోకి ఎదురొచ్చింది.
ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ గడపలు దిగుతున్న భర్తకు ఎదురైంది.
మంగపతి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
ఇదేమీ పట్టించుకోకుండా కూతురు వసారాలో కూర్చుని వారపత్రిక చదువుకుంటూ వుంది.
కాంతమ్మ భోజనం చేసి వక్క వలుకు పటుక్కున కొరుకుతూ మంచానికి అడ్డం పడింది.
అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చి "అమ్మాయ్?" అంటూ కేకపెట్టి లేచి కూర్చుంది?
వార పత్రికలో సినిమా వార్తలు చదువుతున్న తార వినిపించుకోలేదు.
"నిన్నేనే?" గట్టిగా పిల్చింది తల్లి.
"అబ్బ ఏమిటే అమ్మా నీ గోల?" తార పత్రికలో నుంచి తల ఎత్తకుండానే అన్నది.
"పేపరు వేసి వెళ్ళాడా? ఇలా తీసుకురా!"
"వేసినట్టే వున్నాడు. నువ్వే చూసుకో" అన్నది తార.
"మా తల్లివిగా కొంచెం తెచ్చి పెట్టవే!" తల్లి భుక్తాయాసంతో అన్నది.
తార విసురుగా లేచి తెలుగు దినపత్రిక తల్లి కూర్చున్న మంచం మీద వేసి వెళ్ళిపోయింది.
కాంతమ్మ పత్రిక విప్పి వార ఫలాలున్న పేజీ తీసింది. తన రాశి అయిన "వృశ్చికం" చదువుకోసాగింది.
"ఈ వారం ఆరంభంలో ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఒక దారికి వస్తాయి. వెదకపోయిన తీగ కాళ్ళకు చుట్టుకుంటుంది. బంధు ఆగమనం, శుభ కార్యాలు చేస్తారు."
చదువుతూ వుంటే కాంతమ్మ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది.
తన కూతురు గీత ఇన్నాళ్ళకు బయట పడింది. అచ్చు గుద్దినట్లు రాసి వుంటే ఇంకా సందేహం ఎందుకూ. అమ్మాయి పెళ్లి నిశ్చయం అయినట్టే.
అది సరే! తన తెలివి తెల్లారినట్టే వుంది? ఇంకా ఆలోచన ఏమిటి? వియ్యాలవారే తన కూతుర్ని వెతుక్కుంటూ వస్తున్నారన్న మాట! అన్న మాటేమిటి? వస్తూనే వుంటారు. ఈ పాటికి బయలు దేరారేమో?
ఈ మనిషి తెలివి దొంగలుతోలా? అట్లా బయలుదేరి వెళ్ళిపోయారేం! వాళ్ళే మనింటికి వస్తుంటేనూ అన్నట్లు ఆ అపశకునం కూడా ఇందుకేనేమో? ఇవ్వాళ వెళ్ళొద్దనే నేమో?
ఆ వెళ్ళేవారు కాస్త వార ఫలాలు చూసుకుని వెళ్ళకూడదూ? ఆ మనిషికి అంతా తొందరే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS