దాంతో వీళ్ళ పని సులభం అయింది.
ఈ కారణంగానే నేనూ, రామ్ సింగ్ కూడా బ్రతికి బయటపడ గలిగాము.
"మన శరీరానికి ఏది ముఖ్యం?" అహోబిలాన్ని అడిగాడు వర్ధనరావు.
నెత్తిమీద నుంచి ఎర్రటోపీని తీసి చేతబట్టుకొని "హెడ్ సార్! హెడ్!" ఆత్రుతగా చెప్పాడు అహోబిలం.
"నీకు లేనిది, నాకు వున్నదీ అది. నేను ప్రశ్నిస్తున్నాను. దానికి వీడు జవాబులిస్తున్నాడు. మధ్యలో అడ్డురాకు." ఒక్క గదమాయింపు గదమాయించాడు వర్ధనరావు.
అహోబిలం పైసా అంత ముఖం చేసుకొని వుండిపోయాడు.
"ఈ కేసులో బాస్ బ్రతికివున్నాడా? చచ్చిపోయాడా? అన్నది మాకు చాలా ముఖ్యం. పట్టి బంధించిన నలుగురు దొంగలూ పారిపోయారు. బాస్ గుర్తులు నీవు చెబితే మాపని సులభమవుతుంది. వాడు ఎలా వుంటాడో, ఎలా మాట్లాడతాడో, రూపురేఖలు వర్ణించి వివరంగా చెప్పు!"
వర్ధనరావు నన్నడిగాడు.
ఇప్పుడు నేను నిజం చెప్పటం వల్ల బాస్ బ్రతికే వున్నాడా, లేక చనిపోయాడా అన్నది నాకు తెలుస్తుంది.
నేను క్షణకాలం ఆలోచించి...
బాస్ రూపురేఖలు వర్ణిస్తూ ఎలా వుండేది, ఎలా మాట్లాడేది వివరంగా చెప్పాను.
అంతా విని...
"ఏమిటి? వాడా బాస్!" అంటూ కూలబడిపోయాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"ఏమిటి సార్! వాడు చచ్చిపోయాడా?" ఆశ్చర్యం నటిస్తూ అడిగాను.
"చచ్చిపోవటం కాదు. వాడు నాకు టోకరా ఇచ్చాడు. అమ్మ దొంగ లమ్డీ కొడుకు. ది గ్రేట్ ఇనస్పెక్టర్ వర్ధనరావుకే టోకరా ఇవ్వటమా! వాడికి ఎన్ని గుండెలు? ఎన్ని గుండెలు?" అంటూ గుండెలు బాదుకున్నాడు వర్ధనరావు.
"వాడు మీకు టోకరా ఇవ్వటమేమిటి సార్! మీరు నాతో హాస్యాలాడుతున్నారు" అన్నాను.
"హాస్యమా, పాడా, అసలక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా?" అక్కడ ఒక గదిలో ఒక్కడే వున్నాడు.
నేను రివాల్వర్ సూటిగా వాడికి గురిపెట్టి "మీ నాయకుడు ఎక్కడ? మీ బాస్ ఎక్కడ? నిజం చెప్పకపోతే నిన్ను షూట్ చేసి పారేస్తాను!" అని గద్దించి అడిగాను.
ఆ దెబ్బతో వాడు గబగబా వణుకుతూ, "ఈగది మూడు గదులకు అవతల తలుపు బిగించుకుని, ఆ గదిలో ఏదో, సీక్రెట్ పనిచేస్తున్నాను సార్! ఆ గదిలోకి వెళ్ళారంటే, ఏదో స్విచ్ నొక్కి బాంబుకూడా పేలుస్తాడు. అది బాస్ స్పెషల్ గది" అని చెప్పగానే. నేను నావాళ్ళలా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను.
అక్కడికి వెళ్ళి చూద్దును గదా! అప్పటికే వాడు పారిపోయాడు.
మళ్ళీ వీడి దగ్గరికివచ్చి చూద్దును కదా! వీడూ పారిపోయాడు.
ఇంక బాస్ గాడు ఎలా వుంటాడో ఎలా తెలుస్తుందయ్యా? అందువలన బాస్ రూపురేఖలు ఎలా వుంటాయో నీవు చెబితే, నేను పట్టుకుందాం కదా అని అనుకున్నాను.
ఇప్పుడు నీవు చెప్పిన దాన్నిబట్టి వాడే బాస్ అని తెలిసిపోయింది"
ఇనస్పెక్టర్ వర్ధనరావు అలా చింతిస్తూ మాట్లాడుతూ వుంటే నేను మధ్యలో అడ్డుతగిలి, "వాడు పారిపోయాడో, లేకపోతే మీ వాళ్ళ కాల్పుల్లో మరణించాడో? మీరు చనిపోయిన శవాలను పరీక్షగా చూడాల్సింది సార్!" విషయం తెలుసుకుందామని అడిగాను.
"వాడు పారిపోయాడని ఖచ్చితంగా చెప్పగలను. వాడు నాకు టోకరా ఇచ్చాడు గదా అని, గది గదీ గాలించాను. చచ్చినవాళ్ళల్లో పట్టి పట్టి చూశాను. వాడు మాత్రం లేడు. వాకిలిముందు కాపలా కూడా పెట్టాను. ఎటు మాయమయ్యాడో, ఎలా మాయమయ్యాడో కూడా నాకు తెలియదు. చేతికి చిక్కిన బాస్ పారిపోవటమన్నది నాకు అవమానం. మా డిపార్టుమెంటుకి అవమానం" అంటూ రెండు చేతుల్లో తలకాయ ఇరికించుకొని కాసేపు విచారిస్తూ వుండిపోయాడు ఇనస్పెక్టర్ వర్ధనరావు.
"వూరుకోండి సార్! తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎక్కువకాలం తప్పించుకు తిరగలేరు" ఓదార్పుగా అన్నాను.
"అసలు నువ్వు చెప్పేది ఎంతవరకూ నిజం?" వున్నట్టుండి కానిస్టేబుల్ అహోబిలం అడిగాడు.
ఇనస్పెక్టర్ వర్ధనరావు చటుక్కున తలపైకెత్తాడు.
"అవును. నువ్వు చెప్పింది ఎంతవరకూ నిజం?" అంటూ నా కళ్ళల్లోకి గ్రుచ్చి చూస్తూ అడిగాడు.
