Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 27


    అప్పటికే సాంబయ్య సెర్వ్ చేసి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు.


    "మీరేంటి ఉలుకూ పలుకూ లేకుండా?"


    "నేను మీలా అందంగా మాటాడలేను."


    "అదిగో మళ్ళీ 'మీలా' అంటూ బహువచనం" గుర్తు చేసింది.


    "సరే వినీలా... నీలా..." ఆగి "అందంగా మాట్లాడలేనివాడ్ని"


    "మనమిప్పుడు ఎవరు గొప్ప ఆరేటరో చెక్ చేసుకోవడం లేదు" మరోసారి శశాంక చూపుల తాకిడికి తత్తరపడుతూ తలవాల్చేసింది.


    "ఒక వస్తువు అందంగా ఎప్పుడు కనిపిస్తుంది వినీలా?"  


    ఇలాంటి ప్రసక్తిని అందులోనూ శశాంక నుంచి వూహించలేని వినీల ముందు కంగారుపడింది. "ఆ వస్తువు కావాలనుకున్నప్పుడు. ఇట్ ఈజ్ సైకో ఎనాలిసిస్"


    "అలా కావాలనుకునే 'కోరిక' ఐ మీన్ 'డిజైర్' కూడదంటారా మరి"


    "అవును... అది మంచివాళ్ళ లక్షణం కాబట్టి" పిడికిలి అంచుతో రాబోయే నవ్వును మృదువుగా ఆపుకుంది.


    "అసలు మంచంటే"


    "ఏ డిజైరూ లేకపోవడం"


    "ఆ మంచిని మాత్రం ఎందుకు కోరుకుంటాం?"


    "అది మన డిజైర్ కాబట్టి"


    "సో" భావరహితంగా చూశాడు. "అందంగా వుందని మనం దేన్నీ కోరుకోం. కాని కోరుకున్నదే అందంగా వుందనుకుంటాం"


    "ఎక్స్ లెంట్" మనసారా నవ్వేసింది వినీల. "ఎవరనగలరు మీకు మాటలు రావని"


    "నీ దగ్గర నేర్చుకుంటున్నాను."


    "సంతోషించాను" శశాంక మామూలు మనుషుల్లో పడుతున్న ఆనందం అంతర్లీనంగా. "అవునూ... హఠాత్తుగా ఈ టాపిక్కేమిటి?"


    "ఎందుకంటే నేను కోరుకోవడం లేదు కాబట్టి."


    "ఏంటీ?"


    "షూటింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనడం."


    జోవియల్ గా అంటున్నాడనుకుంది. "అందంగా లేదు ఈ నిర్ణయం."


    "ఎందుకంటే నువ్వది కోరుకోవడం లేదు కాబట్టి" శశాంక సీరియస్ గా అంటున్నాడని అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టలేదామెకు.


    "శశాంకా" అప్రతిభురాలౌతూ "మీరు... మీరు నిజంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా" అంది వినీల  "ఇట్సే రేర్ ఆపర్చునిటీ..."


    "కావచ్చు. కానీ నాకిష్టం లేదు."


    "ఎందుకు?"


    "వినీలా" పైకి లేచాడు. సోఫాలో కూర్చుని న్యూస్ పేపరందుకుంటూ అన్నాడు. "ఈ స్థితిలో నేను పొందిన ఈ అవకాశం బట్టతల అయ్యాక కొనుక్కున్న దువ్వెనలాంటిది కాబట్టి"


    అతడంత ఈజీగా తీసుకోవడం అస్సలు ఇష్టపడలేదు వినీల. "మీ కర్థం కాదు శశాంకా... దీని మూలంగా మీరెంత నష్టపోతున్నారో మీరూహించలేరు"


    "ఇంకా ఏం మిగిలిందని నేను నష్టపోవడానికి?"


    "జీవితముంది."


    "కాని అది మిగిల్చింది చేదు అనుభవాలేగా."


    "ఈ నిరాశావాడం తాత్కాలికమే శశాంకా. ప్లీజ్" అతడికి ఎలా నచ్చచెప్పాలో అర్థం కాలేదు. "మీ గెలుపులో పోగొట్టుకున్నదంతా మరిచిపోయే గొప్ప అవకాశమిది. ప్రపంచమంతా గుర్తించే షూటర్ గా మీరు నిలబడిన నాడు అనుభవపూర్వకంగా తప్పు తెలుసుకోలేనంత ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మీరూహించలేరు శశాంకా... అతి త్వరలోనే మీరు అంతర్జాతీయ స్థాయిలో మొదటివాడిగా ఈ దేశానికి ప్రతిష్ఠ తీసుకురాబోతున్నారని ఎన్ని పత్రికలు ఫోర్ కాస్ట్ చేస్తున్నదీ..."


    "వినీలా" వారించాడు అయిష్టంగా.


    "ఇది ముఖస్తుతి కాదు శశాంకా"


    "తెలుసు"


    "ఎలా?"


    "ముఖస్తుతి అంటే ముద్దు పెట్టుకోవాలనిపించిన అమ్మాయిని చూస్తూ మీ ముఖం చాలా బాగుంటుందని అభినయించడం లాంటిది. కాబట్టి అది నీకు సాధ్యం కాదని నాకు తెలుసు కాబట్టి."


    వినీల తెల్లమొహం వేసుకుని నిలబడిపోయింది.


    ఇక్కడ ఆమె కంగారుపడింది పోటీలకి వెళ్ళనన్న శశాంక తిరస్కారానికి కాదు. సంస్కారాన్ని గుంభనంగా వ్యక్తీకరించే శశాంక అలాంటి ఉదాహరణ వల్లించినందుకు.


    అదే శశాంక ఎంత మారిందీ ఆమె తెలుసుకున్న తొలి క్షణమూ. అతడేం కాబోతున్నాడూ అని భయపడిన ఆఖరి క్షణమూను.


                                                       *    *    *    *


    ఘనీభవించిన అగ్నిసరస్సు గర్భం నుంచి జారిపడిన చితాగ్ని కుండంలా ఆకాశంలో పౌర్ణమి చంద్రుడు మండిపడుతున్నాడు.


    కడుపు దహించుకుపోతున్న పడుపుకత్తె ఆకలి పల్లవిలా నగరం హోరుమంటున్న రాత్రి ఎనిమిది గంటలవేళ...


    డిసిపి అవినాశ్ తన ఆఫీసులో చాలా అసహనంగా పచార్లు చేస్తున్నాడు.


    ఎస్. ఐ. ప్రదీపు చనిపోయిన మరుసటిరోజే ఓ పశువుల కాపరి తెలియపరిచిన సమాచారం ప్రకారం బంజారాహిల్సులోని పాడుబడిన ఇంటికి చేరుకున్న అవినాశ్ పీలికలైపోయిన రెండు శవాల్ని చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS