Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 27


    మిగిలిన వాళ్లంతా ఆమెను సమర్థిస్తున్నట్లు -

 

    "అవును.... అవును" అన్నారు. ఆ వేళ ఎందుకో వాళ్ళంతా గట్టిగానే అరిచారు.

 

    "నాకు ఈ శిక్ష సంతృప్తినిచ్చింది" అంది మౌనిక. కైవల్య ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకుని ఊదుతోంది. ఆమెవైపు ఆప్యాయతతో చూస్తూ తన చేతిని లాక్కుంది. మెల్లగా డయాస్ దిగింది.

 

    బరువెక్కిన హృదయంతో అమ్మాయిలంతా అక్కడ నుంచి బయల్దేరారు.

 

    చలికాలం కావడంతో అప్పటికే చీకట్లు ముసురుకున్నాయి. చలిగాలి ఒంటినంతా ఎత్తి కుదేస్తోంది. ఆకాశంలో చంద్రవంక కొక్కానికి తగిలించిన మల్లెపూల దండలా వేలాడుతోంది.

 

    ధ్యానమందిరంలో జరిగే కార్యక్రమం గురించి తెలియని తరుణ్, మౌనిక ఎక్కడికి పోయిందో తెలియక గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు.

 

    గతరాత్రి తల్లో పెట్టుకున్న సన్నజాజుల దండను కిటికీ ఊచల మీదకు ఇల్లాలు గిరవాటేసినట్లు చంద్రవంక కిటికీని అతుక్కుపోయి కనిపిస్తోంది. అయినా ఇదంతా అతను గమనించడం లేదు. మౌనిక ఎప్పుడొస్తుందో తెలియక, మాట్లాడే తోడు లేక అతను బోర్ గా ఫీలవుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు.   

 

    అదిగో - అప్పుడు వినిపించింది అతనికి ఓ కేక. అలనాడు గజేంద్ర మోక్షంలో తనని మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగు అరిచిన అరుపుకంటే హృదయ విదారకంగా వుంది ఆ కేక.

 

    శరీరంనుంచి తన్నుకు పోతున్న ప్రాణాన్ని గొంతులో అదిమిపెట్టి పెట్టిన ఆ కేక ఎవరిదో, ఏమిటో అతనికి అంతుపట్టలేదు. కానీ ఆ కేకలోని వేదన హృదయాన్ని కలిచి వేయడంతో అతను తలుపు తోసుకుని బయటికి ఉరికాడు. 

 

    తను అజ్ఞాతవాసంలో వున్నానని, అలా బయటకు రావడం ప్రమాదమన్న ఆలోచనే ఆ సమయంలో అతనికి రాలేదు. దూరంగా ఎవరో అమ్మాయి కిందకు పడిపోతున్నట్లనిపించి అతను అటువైపుకి కంగారుపడుతూ పరుగెత్తాడు.  

 

    కింద పడిపోతున్న అమ్మాయి మౌనికేనని చాలా దూరం నుంచే పసికట్టాడు తరుణ్. అలా అనిపించగానే కాళ్ళు మరింత వేగాన్ని పుంజుకున్నాయి. అతను అక్కడికి వెళ్ళేటప్పటికి సదన్ లోని అమ్మాయిలంతా మౌనిక చుట్టూ మూగిపోయి వున్నారు.

 

    "ఏమైంది?" తరుణ్ తన ముందున్న అమ్మాయిని పక్కకు నెట్టి ముందుకు వెళ్ళి అడిగాడు. మౌనికకు ఏం జరిగిందోనన్న ఆదుర్దా తప్ప మరేమీ పట్టడం లేదు అతనికి. అతను పక్కకి నెట్టిన అమ్మాయి అతను తరుణ్ అని పసిగట్టింది. ఇప్పుడు అతను తాకడం వల్ల సాయంకాలం ఆత్మ ప్రక్షాళనా కార్యక్రమంలో ఏం శిక్ష వేసుకోవాలో అని ఆలోచిస్తోంది.

 

    మౌనిక తన ఎడమ పాదాన్ని పట్టుకుని "పాము కరిచినట్లుంది" అంది. ఆమె తన బాధనంతా పళ్ళ మధ్య బిగిస్తోంది. అక్కడ గుమిగూడిన అమ్మాయిలంతా "ఆఁ" అని మాత్రం అనగలిగారు.

 

    ఇప్పుడు ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు. వాళ్ళు ప్లాట్ గా తరుణ్ వైపు చూశారు. అంతకుముందు జరిగినదంతా మౌనిక చెప్పడం వల్ల వాళ్ళకు అతనెవరో తెలిసిపోయింది. లేకుంటే అక్కడ ఓ యువకుడు కనపడగానే జడుసుకుని పరుగెత్తేవాళ్ళు.

 

    పాము తననే కరిచినట్లు విలవిల్లాడిపోయాడు తరుణ్. చప్పున కిందకు వంగి ఆమె చేతిని పక్కకు నెట్టి చూశాడు. ఎర్రటి రంగుతో గుర్తులు పెట్టినట్లు రెండు గాట్లు కనపడుతున్నాయి.

 

    అప్పటికే విష ప్రభావం కనపడుతోంది.

 

    భయంవల్ల ఒళ్ళంతా వణుకుతోంది.

 

    "పాముల్లో తొంభైశాతం ప్రాణాపాయం కలిగించనివే. ఇదీ ఏదో నీళ్ళపాము అయి వుంటుంది" మొదట ఆమె భయం తగ్గించాలి. అతను చేస్తున్నది అదే. కానీ అతనికి తెలుస్తోంది కరిచింది త్రాచుపాము అని.

 

    పాములవల్ల పెద్ద ప్రమాదం లేదని అంటూ తనకు తెలిసిన ప్రాధమిక వైద్యం ప్రారంభించాడు. పాము కరిచిన చోటుకంటే పైభాగాన టవల్ తో కట్టాడు. విషం పైకెగబాకకుండా ఆ కట్టు అడ్డుకుంటుంది.   

 

    "ఇక్కడ డాక్టర్ వున్నాడా?" అనడిగాడు తరుణ్ అమ్మాయిల వైపు చూస్తూ.

 

    "లేడు" ఎవరో ఓ అమ్మాయి చెప్పింది.

 

    "మీకేదైనా అనారోగ్యం వస్తే ఏం చేస్తారు?"

 

    "వైద్యం చేయించకూడదు. దేహం మీద ఎంత అభిమానం వదిలేస్తే అంత మంచిది"

 

    మామూలుగా అయితే ఏదో చిన్నపాటి జ్వరం, జలుబులాంటివి వస్తాయి. వాటికోసం డాక్టర్ దగ్గరికి వెళ్లడం వుండదు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు.

 

    "దేహం మీద అభిమానం చూపించకపోతే విసుగుపుట్టిన దేహం మిమ్మల్ని వదిలిపోతుంది" అతను కోపంగా అన్నాడు. వాళ్ళ మూర్ఖత్వం చూస్తుంటే అతనికి చికాకుగా వుంది.

 

    "అన్నావారి సత్రంలో ఓ డాక్టరున్నాడు" మరో అమ్మాయి చెప్పింది.

 

    అతను ఏమీ మాట్లాడలేదు.

 

    విష ప్రభావం ఎక్కువవుతూ వుంది.

 

    "చిన్నపాటి కత్తి ఇస్తారా?"

 

    కైవల్యానంద పరుగెత్తింది. పండ్లు కోసుకునే చాకులాంటిది తెచ్చి యిచ్చింది. అతడు గాట్ల దగ్గర కొద్దిగా చర్మాన్ని కోసి నోటితో విషం లాగి, వూయడం ప్రారంభించాడు.

 

    మౌనికకు అతని స్పర్శ తెలుస్తోంది.

 

    అతను తన మీద చూపిస్తున్న అభిమానానికో, మనుషుల మీద అతనికున్న ప్రేమ తెలిసో ఆమెకు ఏడుపొచ్చింది. అయితే ఆమె బాధతో ఏడుస్తోందని అక్కడున్నవాళ్ళందరూ అనుకున్నారు.

 

    అతను అయిదు నిమిషాలపాటు అలా విషాన్ని లాగేశాడు. విషం లాగి, తిరిగి వూసేటప్పుడు నల్లటి ద్రవం వస్తోంది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి.

 

    "ఇక ఆలస్యం చేస్తే ప్రమాదం - చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి. డాక్టర్ దగ్గరికి వెళదాం."

 

    "డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు" వెనకనున్న అమ్మాయి చిన్నగా చెప్పింది.

 

    "అంటే ఇంతకాలం మీతో వున్న అమ్మాయిని చంపేసుకుంటారా?" అతడు తీక్షణంగా ప్రశ్నించాడు.

 

    అమ్మాయిలెవరూ మాట్లాడలేదు.

 

    "మనిషికి ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పిన మీ విమలాబాయికి జలుబుచేసినా విక్స్ రాసుకుంటుంది. ఈ ప్రపంచమంతా మిధ్య అనే చాలామంది స్వాములు కార్లలో తప్ప ప్రయాణించరు. మీ విమలాబాయి కథ నాకు తెలియదు. కానీ ఆమె వాళ్ళకంటే ప్రత్యేకం అని నేననుకోను. మనం బతికినందుకే ఆనందించాలంటాడు స్పార్టకస్. ప్రాణం విలువ అలాంటిది."

 

    అమ్మాయిలు కిక్కురుమనలేదు.

 

    మౌనిక వెనక్కి వాలిపోతోంది. ఆమెని పట్టుకున్న అమ్మాయి పళ్ళ బిగువున ఆమెని మోస్తోంది.

 

    "వెంటనే ఈమెని అన్నావారి సత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. పట్టండి" అతడు లేచి తొందరచేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS