"అసలు పందెం అంటూ ఏదీ లేకుండా ఆడితే స్పిరిట్ ఉండదు. ఏదయినా పందెం పెట్టండి బావగారూ!" అంది. వాల్మీకి అందుకు ఒప్పుకోలేదు.
"గెలుపుకోసం ఆడేదే ఆట! అదే నిజమయిన స్పిరిట్! పందాలు కాచుకుంటే అది జూదం అవుతుంది కాని ఆటకాదు" అన్నాడు,
"పోనీ అక్కా! నువ్వే ఏదయినా పందెం కాయి"
"వారే గెలుస్తారని వంద రూపాయలు పందెం కాస్తాను"
"ఎంత స్వార్ధం? అప్పుడే మారిపోతుందన్నమాట చరిత్ర! ప్లేట్లు తిరగబడుతున్నాయి! ఓకే! అయినా భయంలేదు. మనమీద గెలిచే వాళ్ళింకా పుట్టలేదు. నా ఆట సంగతి నీకు తెలుసుకదా! ముందు జాగ్రత్త పడాలనుకుంటే మాట మార్చుకో!"
"నేనేమీ మార్చుకోను. ఇవిగో వంద రూపాయలు. నీకు యిచ్చేద్దామని ఉంది. ఊరికే యిస్తే తీసుకోవు కదా!? అందుకని."
"చూచారా బావగారూ! అక్కకి మన తడాఖా తెలుసు!"
కోతలెందుకు ఆడి చూపించు, స్త్రయిగర్ నా చేతికి వచ్చాక మళ్ళీ నువ్వు తీసుకోలేవు. మొదటి అవకాశం నీకే యిస్తున్నాను.
చిన్న పిల్లవు కదా! తరువాత నేను గెలిస్తే మోసం చేశానంటావు"
"అంత సరుకుందా మీ దగ్గర! ఐతే చూచుకుందాం" అంటూ స్త్రయిగర్ అందుకుని చెక్ చెక్ మని ఫినిష్ చేయటం ప్రారంభించింది.
గాయత్రికి కొంత తెలుసు ఆమె ప్రతిభ!
వాల్మీకి కళ్ళు అప్పగించి చూస్తున్నాడు.
మొదటిసారి స్త్రయిగర్ విసరటమే స్ట్రాటజిక్ గా విసిరింది ఆమని! అది ఫలించింది. బోర్డు క్లియర్ అయింది. ఆఖరు కాయిన్ ఇన్ సెట్ చేసేంతవరకూ అసాధారణమయిన ఏకాగ్రతతో చూపులు నిలిచాయి.
అయిదు బోర్డ్సుతో గేమ్ పూర్తి చేసింది ఆమని!
అప్పటికింకా వాల్మీకి జీరోలో ఉన్నాడు.
"అక్కలాగే మీరూ నా దగ్గర ఆట నేర్చుకోవాలి బావగారూ! ఆడపిల్లని కాబట్టి నాకు మీసాలులేవు కాని ఈసారి పందెం కాచారంటే ఎక్కడయినా అద్దెకు తెచ్చుకుని మెలివేస్తాను! సంఝే!?" అన్నదామె స్త్రయిగర్ అందిస్తూ!
"ఛీ పాడు అవేం మాటలు మగరాయుడులాగ?" అంది గాయత్రి వందరూపాయలు అర్పించుకుని ఓటమి నెత్తిన వేసుకుంది.
"ఉంటే మెలివేస్తానంది. లేవు కాబట్టి బాధలేదు" అన్నాడు వాల్మీకి!
"ఒక పని చెయ్యవే! మీ బావగారి మీసాలు మెలివెయ్యి!"
"వాటి మీద అంతకోపం ఎందుకు అక్కా! నీకు గ్రుచ్చుకుంటాయనా?"
"యూ నాటీ గాళ్" అంటూ నవ్వాడు.
"నిన్ను కదిలించటం నాదే తప్పు! ఇక ఆట చాలించు"
"ఓ.కె. విత్ ప్లెజర్! నేను గెలిచాను. లేచి వెళ్ళిపోదామంటే నేనెందుకు కాదంటాను. ఓడిపోయిన వాళ్ళు చూచుకుంటారు ఆ వ్యవహారం"
"అదేం కాదు. మళ్ళీ ఆడాల్సిందే!" అన్నాడు వాల్మీకి! ఏమీ ఎరుగని చిన్నపిల్లలా మాటాడుతూ ఆమని కొట్టిన దెబ్బకు అది ప్రతిస్పందన.
"అయితే ఈసారి పందెం ఎంత?"
"అయిదు వందలు. నేనే యిస్తాను" అంటూ లేచి బీరువా దగ్గరకు వెళ్ళబోయాడు.
"అక్కరలేదు. మీరు మాట నిలుపుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. కూర్చోండి" అంటూ అతని చేయి పట్టుకుని ఆపేసింది ఆమని.
స్త్రయిగర్ అందించింది. క్రాస్ ఛబ్ కొట్టడంతో చిన్న మిస్సింగ్ ఎదురు అయింది. ఫలితంగా బోర్డు క్లియర్ చేయలేకపోయాడు.
మళ్ళీ ఆమె చేతులు మెరుపుల్లా కదిలాయి.
వాల్మీకి డష్ట్ అందుకునేలోగా క్లియర్ చేసింది. పులిపిల్లలాగా ఊపిరి సలపని దాడి చేసి మళ్ళీ గెలుచుకుంది ఆమని!
బావగారు అందించిన అయిదు వందలు తీసుకోలేదు.
"ఆ డబ్బు నాకు వద్దు! ఆ వంద రూపాయలు కూడ కలిపి ఫోం బెడ్ మీదికి మంచి పిల్లోస్ రెండు కొనుక్కోండి. మీరు ఆనందంగా ఉన్న సమయంలో ఈ దీనురాల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు" అన్నదామె.
వాల్మీకి షాక్ తిన్నట్లుగా అయిపోయారు.
ఆమె హృదయంలో నిర్మలత్వం పసితనం ఉన్నాయి.
కాని గుండెల్ని పిండివేసేలాగ మాటాడగలదు. పసిపిల్ల అనుకోవటం ఎలా?
"ప్రజంటేషన్ యిచ్చేందుకు యింకేమీ దొరకలేదా నీకు?" అంది గాయత్రి.
"అక్కా!" అని పిలిచి బోర్డుముందు కాయిన్స్ సెటప్ చేయటం ఆపి తలఎత్తి చూచింది ఆమని. ఆమె కళ్ళలోంచి వెలువడుతున్నవి చూపులు కావు. బలంగా గ్రుచ్చుకునే బాణాలు వెలువడ్డాయి.
"అక్కా! ఇచ్చేందుకు ప్రపంచంలో బహుమతులు వందలు వేలుంటాయి. కాని జ్ఞాపకాన్ని ఆశీస్సులుగా మార్చి అందించే బహుమతులెన్ని ఉంటాయి.
ఎక్కడో నగరంలో దూరంగా వేరు ప్రపంచంలో నేనుంటాను.
కాని మీరు ఏకాంతానికి చేరినప్పుడు మీ మధ్య ప్రత్యక్షమవుతుంటాను. అలా కోరుకోవటం తప్పు అంటావా? మీ మధ్య అడ్డుగా ఉంటాననుకుంటే అలాంటిదేమీ వద్దులే" అన్నదామె. గాయత్రి కరిగిపోయింది.
పిచ్చి అక్కా! కాలం యిచ్చే కిక్కులకు ఎవరెక్కడ వెళ్ళిపడతారో మూట కట్టుకోవల్సింది మనీపర్సులు కాదు. మంచి మంచి జ్ఞాపకాలే!
కావాలనుకున్నంత కాలం కలిసి ఉండలేము.
వద్దనుకుంటే విడిపోలేం! అంతా విధి చేతిలో ఉంది కాని మన చేతులలో ఉందా? నేను వచ్చానంటే స్వాగతం పలుకు.
వెళ్ళిపోతానంటే వీడ్కోలు చెప్పు. నిర్లిప్తంగా! కొంచెం డ్రైగా కూడా! అంతేకాని సెంటిమెంట్స్ ప్రేల్చకు తల్లీ!" అంది ఆమని.
వాల్మీకి ఈ మాటలు విని లేచి వెళ్ళిపోయాడు.
డ్రయివర్ కి డబ్బు యిచ్చి పట్నం వెళ్ళి రెండు పిల్లోస్ కొని తెమ్మని చెప్పాడు.
"మాట మర్చిపోయాను! పిల్లోస్ మీదికి అందమయిన రెండు కవర్లు తీసుకో, ఎంబ్రాయిడరీ షాపుకు వెళ్ళి, ఒకదాని మీద లవ్లీ అని కుట్టించు. రెండవదాని మీద ఆమని అని కుట్టించు! త్వరగా వచ్చెయ్" అని చెప్పి పంపించేశాడు. అతడు వెళ్ళిపోయాక తిరిగి లోనికి వచ్చాడు.
అతడు బయటకు వెళ్ళి చేసిన పనేమిటో గాయత్రి గ్రహించలేదు. కాని ఆమని వెంటనే పసికట్టేసింది.
"బావగారికున్నంత అభిమానం నీకు లేదు. నీ చెల్లెలుగా పుట్టడం నాదే బుద్ధి తక్కువ. థాంక్స్ బావగారు! ముచ్చటగా మూడవ గేమ్ ఆడుకుందాం.
"నో ప్లీజ్ ఆడుకుందాం కాదు. మాటాడుకుందాం అను" అన్నాడు.
ఆ ఇంటిలో కూడ వాల్మీకి తప్ప మరెవరూ లేకపోవటంతో వారికి అది కూడ తమ స్వంత భవనంలాగా అనిపించింది. సాయంత్రం వరకూ ఆ గది విడిచి వారు బయటకు రాలేదు. వాల్మీకితో పాటుగా బెడ్ మీద కూర్చునేందుకు అభ్యంతరపడింది గాయత్రి! ఆమెకు చెల్లి ఎదుట అలా చేయాలంటే సిగ్గుగా ఉంది. ఫోం బెడ్ మీద ఆ అంచున వాల్మీకి కూర్చున్నాడు. ఈ అంచున ఆమని కూర్చుంది, మధ్యలో కారమ్స్ బోర్డు పరచి ఉంది.
ప్రక్కనే లాన్ చెయిర్ వేసుకుని కూర్చుంది గాయత్రి.
సాయంత్రం అయిదు గంటలు అయ్యేసరికి పిల్లోస్ తీసుకుని వచ్చాడు డ్రయివర్. వాటిని చూచి సంబర పడింది ఆమని.
తలగడ వైపు వాటిని అమర్చింది.
అక్కను, బావను మంచం మీద ఊహించింది.
సంతోషకరమయిన క్షణాల్లో వారి మధ్య తన పేరు ఒక తీయని జ్ఞాపకంగా వుండాలని ఆమె కోరిక. అక్కతో అంతగా విడదీయరాని మానసిక అనుబంధం వుందామెకు. వాల్మీకి పిల్లోస్ ని ప్రత్యేకంగా ఆర్డరిచ్చి తెప్పించటం తన ఆలోచనల సాఫల్యత అని భావించింది.
బావగారు అంత మంచివారు.
ఈ కుటుంబంలో అందరూ ఒకటే. ఒకరినొకరు ప్రేమించుకుంటూ అభిమానించుకుంటూ జీవిస్తారు. అసలివి రెండు కుటుంబాలు కావు. ఓకే కుటుంబం అయిపోయింది.
తాను ఎప్పటికయినా పెళ్ళి చేసుకుంటే అది వేరు కుటుంబం అవుతుంది. ఇంత పవిత్రమయిన ఈ మనుషులందరిని తన వాళ్ళు కాకుండా చేస్తుంది అనుకున్నప్పుడు ఆ పెళ్ళి మాత్రం తనకి ఎందుకు?
కలెక్టర్ కావాలనే కోరిక ఒక్కటి తప్ప మిగిలిన ఆలోచనలు అన్నీ గడ్డిపోచల్లాగా కన్పించాయామెకు. ఆ కోరిక కూడా ఈ ప్రేమలకు అడ్డురాదు.
దిండ్లు రెండు మంచంమీద చక్కగా అమిరాయి.
వాటివల్ల ఆ మంచానికి కాదు ఆ ఇంటికే అందం వచ్చినట్లుంది.
ఇంత అందమయిన ఆలోచనా ఎలా వచ్చిందో బావగారికి మరి?
లవ్ లీ ఆమని! నేను ప్రేమమయినా?
"బావగారూ! నేనంత లవ్ లీగా వున్నానా?"
"ఎందుకు కాదు? చిన్నపిల్లలు ఎవరికయినా ముద్దొస్తారు."
"నేను మరీ అంత చిన్న పిల్లనేం కానులెండి. నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు! ఇంకా నయం ఎత్తుకుని ముద్దాడేస్తాం అనలేదు"
"మనసుకు మాలిన్యం అంటనప్పుడు వచ్చే వయసుకు గుర్తింపులేదు అన్నాడు" వాల్మీకి. ఆమని విరగబడి నవ్వింది.
"అయితే నేను బుల్లి బుల్లి పాపాయినే అంటారా?"
"మా కంటికి అలాగే కనిపిస్తావు. అవునా గాయత్రి" అంటూ తలఎత్తి ఆమె వంక చూచాడు వాల్మీకి. అప్పటికే ఆమె చెంపలు తడిసి వున్నాయి.
అతడు నిర్ఘాంతపడిపోయాడు.
"అరె ఏమయింది? ఎందుకా కన్నీరు?" అన్నాడు. ఆమని అక్క వంక చూచింది. పైట కొంగుతో కన్నీరు అద్దుకొంటోంది.
