"నువ్వు ... నువ్వు.... హెల్ప్ చేస్తావా?"
"ష్యూర్!నువ్వు మంచి కధలు చెప్పగలవు... కాని ఎఫెక్టివ్ గా రాయలేవు! నేను ఆ లోపాన్ని పూడుస్తాను!" అన్నాడు సూరిబాబు.
సూరిబాబు మాటలు ప్రశాంత్ ని ఆలోచింపజేసాయి.
మాధురి గూరించి కాస్సేపు మర్చిపోయాడు.
సిన్సియర్ రైటర్స్ ఎవరో కొందరు తప్పించి, మిగతా వాళ్లంతా రాస్తున్నదంతా ఏమిటి?......
ఈ ట్రెండ్ ని బ్రేక్ చేయాలి.
ఈ పద్దతిని కొత్త మలుపు తిప్పాలి.
ఈ ప్రవాహాన్ని దారి మళ్లించాలి.
ప్రశాంత్ కళ్ళల్లో మెరుపు! తను ఒక గొప్ప రచయితగా... ఒక సాహితీ బ్రహ్మగా ..... వెలుగులోకి వస్తే?
మాధురి ఏమౌతుంది?
ఏమనుకుంటుంది?
అభిమానులు?ఎందరో?
"సూరిబాబు! నీ అయిడియా నాకు వచ్చింది?" అన్నాడు ప్రశాంత్.
15
సూరిబాబు మాటలు ప్రశాంత్ ని బాగా కన్విన్స్ చేసాయి.
మాధురి మీద కసి, పగ, అసూయ, ద్వేషం... ఇదంతా ఒక్కసారిగా డైవర్ట్ అయిపోయాయి.
పట్టుదలతో అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి.
"ఆ ఇగోని దెబ్బ కొట్టాలంటే ఏం చెయ్యాలి. ఆమెకన్నా గొప్ప వాడివి కావాలి!ఆమె కళ్ళముందే నువ్వు ఆకాశమంత ఎత్తుకి ఎదగాలి!" అన్న సూరిబాబు మాటలు అతని మస్తిష్కంలో గింగిరాలు తిరుగుతున్నాయి.
"ఏం! ఆ మాత్రం నువ్వు రాయలేవా?" అన్న ప్రశ్న ఇప్పుడు అతన్ని కాలరు పట్టి నిలదీస్తున్నట్లు అనిపించింది.
ఔను! రాయాలి.
ఆంధ్ర దేశపు సాహితీ వినీలాకాశంలో ఒక ధృవతారగా....
ఒక సంచలనాత్మక రచయితగా తెలుగు పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలంటే.... తను రాయాలి!
రాత్రంతా ఆలోచించాడు ప్రశాంత్.
తెల్లవారే సరికి అతనొక ధృఢ నిశ్చయాని కొచ్చేశాడు.
ముందు తను ప్రయత్నం చెయ్యాలి.
కాలేజీ సావనీర్లస్థాయినుండి తెలుగు పత్రికల స్థాయికి...(?) ఎదగాలి.
తెల్లకాగితాలు ముందేసుకుని కూర్చున్నాడు.
మర్నాడు ఎక్కడికీ కదలకుండా రాయటమే లక్ష్యంగా పెట్టుకుని వ్రాయసాగాడు.
నాలుగు వాక్యాలు రాయగానే అతనికి అవి అసహ్యంగా కనిపించాయి.
వెంటనే అతనికి ఒక ఫ్లాష్ లాంటి అయిడియా వచ్చింది.
పాఠకులకి తను మేధావి అని భ్రమింప జెయ్యాలి.... అటువంటి సరికొత్త శైలిని కాయిన్ చేసుకోవాలి.
తను ఎలాగూ రాయలేడు.
తన పేరు మీద.. సూరిబాబు రాస్తాడు.
అది 'ప్రశాంత్' బ్రాండ్ రచనగా పాఠకలోకం గుర్తించాలంటే కొన్ని విచిత్రమైన విన్యాసాలు చెయ్యాలి.
అంతే!
వెంటనే "నిఘంటువు" ముందు వేసుకున్నాడు. డిక్షనరీ పదాలని వాక్యాల మధ్య ఇరికించి, అక్కడక్కడా సంస్కృతమ, తెలుగో అర్దంకాని అయోమయ పదాలు పేర్చి... తానొక పండితుడినని పాఠకులని నమ్మించాలి.
కథ తనది!
ప్లానింగ్ తనది!
స్కీమింగ్ తనది!
పేరు తనది!
డబ్బు తనది!
కేవలం "రైటింగ్" ఒక్కటే సూరిబాబుది!
అతను రాస్తాడు. రాసినందుకు అతనికి అన్యాయం జరగకుండా తగిన విధంగా ప్రతిఫలం అందించాలి.
పాపం, సూరిబాబు పేదవాడు. "ఒరే ప్రశాంత్! ఒక్క పదిరూపాయలు ఇవ్వరా! ఈరోజు... ఏమీ తినలేదు..." అని తనని ఎన్నోసార్లు అడిగాడు.
తను మాత్రం లక్షాధికారా!
పది అడిగితే ఐదు ఇచ్చేవాడు....
అటువంటి సూరిబాబుకి ఇప్పుడు తను వందలు ఇస్తాడు. ఇవ్వాలి. అతన్ని రుణగ్రస్తుణ్ణి చేసుకోవాలి. తన స్నేహం వలన అతనికి ఎంతో మేలు జరుగుతుందనే భావం కలిగించాలి. చీటికీ మాటికీ అతనికి తనన స్నేహ సౌశీల్యత గుర్తు చెయ్యాలి.
అతన్ని "మోరల్" గా తనకి 'బానిస'గా మార్చుకోవాలి!
సుదీర్ఘమైన ఆలోచన ఫలితంగా... చక్కటి వ్యూహం సిద్దం చేసుకున్నాడు ప్రశాంత్.
నిఘంటువులోంచి కొన్ని విచిత్రమైన పదాలని వెతుక్కుని, వాటి ప్రక్కనే అర్దం పర్దంలేని మరికొన్ని కఠినమైన పదాలని చేర్చి.....
