"ఛీ! అడంగి వెధవా! ఎట్లా నా కడుపున పుట్టావో పాడుముఖంతో? ఒక్కతీ చేసుకోడానికి ఇష్టపడడంలేదు. లోపలకినడు" కొడుకును కసిరికొట్టింది కామమ్మ. పారిజాతను బయటికి త్రోసి బళ్ళున తలుపు మూసింది.
అప్పుడే పొలం నుండి వస్తున్నాడు కామమ్మ మొగుడు బసవయ్య. అరుగుమీద కూర్చొని ఏడుస్తూన్న పారిజాత నడిగి సంగతి తెలుసుకొని "కామూ, తలుపు తీయ్" అని పిలిచాడు.
తలుపు తీసి గుమ్మానికి అడ్డం నిలబడింది కామమ్మ.
"ఏమిటీ అఘాయిత్యం? రాత్రిపూట అన్నకూతురిని వెళ్ళగొడితే లోకం ఏమంటుందన్న తెలివిలేదా?" పారిజాత చెయ్యి పుచ్చుకొని కామమ్మను త్రోసుకొంటూ లోపలికి నడిచాడు బసవయ్య.
ఆ రాత్రి భార్య చెవిలో గుసగుసగా చెప్పాడిలా. "ఆ పిల్లను వెళ్ళగొడితే మనింటి లక్ష్మిని వెళ్ళగొట్టినట్టే. ఈ పిల్ల చేసుకోకపోతే మన హనుమంతుకు జన్మలో పెళ్ళి జరుగదు. మంచి మాటలతో ఎలాగో మచ్చిక చేసుకోవాలి ఈ పిల్లను. అక్కడికీ లొంగకపోతే కాళ్ళూ చేతులూ కట్టేసి వాడిచేత దాని మెడలో మూడు ముళ్ళు పడేయిస్తే సరి. కుక్కిన పేనులా పడి ఉంటుంది."
"ఒక్కోసారి మీరు నాకంటే బాగా ఆలోచిస్తారండీ!" భర్తను ప్రశంసగా చూచింది కామమ్మ. "తప్పించకు పోవాలని చూస్తుందేమో? ఈ చేతిలో చిక్కిన పిట్ట ఎక్కడికి పారి పోగలదు?" ధీమాగా అంది.
10
ఉత్తరం వచ్చిందిరా వాళ్ళ దగ్గరనుండి! కొత్తపేట వాళ్ళనుండి! జగన్నాధరావు బావమరిదిని పంపిస్తున్నాడట రేపు."
"ఎందుకు?"
"పెళ్ళిచూపులకు తీసుకుపోడానికి!"
మనోహర్ మౌనంగా తల్లి ముఖంలోకి చూడసాగాడు.
"ఈ సంబంధం పడితే నువ్వ చాలా అదృష్టవంతుడివి అవుతావురా! అంతులేని ఐశ్వర్యవంతులకు ఒకక్కగా నొక్కకూతురు! పిల్ల ఎంతో అందంగా వుంటుందని విన్నాను. బి.ఏ. దాకా చదువు కొందట."
"వాళ్ళు ఇల్లరికం అడుగుతారేమో!"
"ఆ ఉద్దేశ్యం లేదట."
"ముందు అలాగే అని తర్వాత పేచీ పెడితే?" ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగుండదని అన్నాడు.
"ఆ సంగతులన్నీ ముందు స్పష్టంగానే మాట్లాడుకుంటాంగా తర్వాత పేచీ ఎలా పెడతారు?"
పిల్ల అందంగా ఉంటుందట! హుఁ! పారిజాతకంటే అందంగా ఉంటుందా?
పారిజాత!
ఇప్పుడు ఎలా ఉందో? తండ్రిపోయి ఆ పిల్ల ఆపదలో వుంటే కనీసం సానుభూతి వాక్యాలయినా చెప్పడానికి దగ్గర లేకపోయాడు.
పెళ్ళిచూపులకు వెళ్ళాలని మనోహర్ కి లేకపోయినా తల్లి లేనిపోని రాద్దాంతం చేయగలదన్న భయంతో వెళ్ళడానికే నిశ్చయించుకొన్నాడు.
ఉత్తరంలో వ్రాసినట్టుగానే మరునాటి ఉదయానికల్లా జగన్నాధరావు బావమరిది దిగాడు. వీళ్ళను పెళ్ళిచూపులకు తీసుకుపోవడానికీ, పొడువాటి కారులో.
ఆ కారు జగన్నాధరావుదని తెలిసే సరికి మనోహర్ ముఖంలో ఏమిటో అసంతృప్తి చోటుచేసుకుంది. అంత పెద్ద శ్రీమంతుల పిల్లను భార్యగా పొంది తను సుఖపడగలడా అని! అయినా అంత గొప్ప శ్రీమంతులకు తమ సంబంధం నచ్చడం ఆశ్చర్యమనిపించింది.
ఆరోజే బయల్దేరారు పెళ్ళిచూపులకు.
* * *
కొత్తపేటలో జగన్నాధరావుగారి ఇంటిచుట్టూ ఉన్న ప్రహరీ గోడ ఒక కోటలా ఉంటుంది. లోపల చెట్ల నడుమ మూడంతస్తుల మేడ అధునాతనంగా కట్టబడివుంది.
కారు పోర్టికోలో ఆగుతూనే నౌకరొకడు పరుగున వచ్చి కారు తలుపుతీసి వినయంగా నిల్చున్నాడు.
"రండి!" లోపలికి దారితీశాడు మోహన్ రావు.
