తిరిగి అన్నారు రావుగారు; "పుష్పం ఏ జాతిదైనా మనం ఆశించవలసింది దాని పరిమళమకరందాలే."
రావుగారి సంధ్యావందనం పూర్తికావచ్చేసరికి పెరుమాళ్ళకడ నీరాజనాలలో వత్తిచమురువేసి దేవతార్చనకు సిద్ధం చేసింది కృష్ణవేణి.
అర్చన ముగుస్తూండగా సుబ్బయ్యకు కబురు వెళ్ళింది ఆరగింపు పట్టుకురమ్మని. పెద్ద స్తంబాళంలో వండిన పదార్థాలన్నీ పెట్టుకొని, నెయ్యి వాటిమీదే వేసుకొని తీసుకువచ్చాడు సుబ్బయ్య. పెరుమాళ్ళ ఆరగింపు అయింది.
హారతియిచ్చి దైవంముందు మోకరిల్లారు రావుగారు. నాలుగు మాసాల తరువాత ఆయన మనసు మహాప్రశాంతి అనుభవించిందీనాడు. మంచంలో తమకు గుర్తుచేసుకొని "భగవాన్! తిరిగి నాకాగతి ప్రాప్తింప జేయకు, కాలూ చెయ్యి స్వాధీనంలో ఉండగానే నీ పాదసేవ, నీ నామస్కరణ చేస్తూ నిన్నుచేరుకోగల వరమివ్వు!" అని ప్రార్థించారు.
తామువచ్చిన సంగతి తెల్పుతూ సూర్యదేవులను ఒకసారి వచ్చి వెళ్ళమని కబురుచేసింది కృష్ణవేణి. ఆయన వచ్చారు.
"మీ బావగారికి నయమైతై తిరుపతికి వస్తామని హుండీలో నా బంగారు వడ్డాణం వేస్తాననీ మొక్కుకొన్నాను. కాని యిప్పుడేమో ఆయనకు ప్రయాణం చేయగల ఆరోగ్యం చేకూరలేదు. మీ బావపరిస్థితిని బట్టి ఒకటి రెండు మాసాల తరువాత తిరుపతి ప్రయాణం పెట్టుకోవాలనుకొంటున్నాను. వడ్డాణం నేనేం పెట్టుకోవడంలేదు. దేవుడి దగ్గరే పెట్టాను."
వచ్చేది కార్తీక పూర్ణిమ. పూర్ణిమనాడు శ్రీ సత్యనారాయణ వ్రతం చేయాలనుకొన్నాను. పిల్లలనూ, మరదల్నీ నాన్ననూ తీసుకురావాలి నువ్వు. దేవత అంతదాకా ఇక్కడే ఉంటుంది. అప్పుడు మీరు వస్తారుకదా! మీతో పంపించేస్తాను!" అని చెప్పింది తమ్ముడితో కృష్ణవేణి.
ఆయన సరేనన్నారు. మధ్యాహ్నం భోజనం చేసుకొని సాయంత్రం వెళ్ళేముందు చెప్పారు. దేవదాసికి ఒక సంబంధం వచ్చిందని. పిల్ల మేనత్త దగ్గరున్నదని. అక్కడినుండి వచ్చాక పెళ్ళిచూపులకు రావలసిందిగా వాళ్ళకు కబురుపంపామనికూడా చెప్పాడు. దేవదాసిని భార్గవరామ్ కు యిచ్చే ఉద్దేశాన్ని మాత్రం బయటపెట్టలేదు.
కృష్ణవేణి మనసులో ఆ కోరిక ఉన్నా కొడుకు అవతారం ఆ విధంగా ఉండగా "దేవతను నా కోడల్ని చేసుకొంటా"ననడానికి ధైర్యం చాల్లేదు.
సూర్యదేవులు మాత్రం అక్కగారికి అటువంటి ఆలోచనలేమైనా ఉంటే బయటపెడుతుందేమో "నీ మరదలి కోరిక కూడా అదే" అని చెప్పాలనుకొన్నారు. కృష్ణవేణి మౌనం ఆయనకా అవకాశం కలుగనీయలేదు.
10
పొద్దుటి నుండి మీ అత్త కనిపించలేదేం దేవత తల్లీ?"
మామగారి సంధ్యావందనానికి అమర్చుతూన్న దేవదాసి మెల్లగా జవాబిచ్చింది. "రాత్రి బావతో పోట్లాడింది అత్త.
"పోట్లాడిందా, ఎందుకూ?"
"ఈ మాసంలో బావకు పెళ్ళిచేస్తానని చెప్పింది అత్త" కొంచెం సిగ్గుపడుతూ చెప్పింది. "ఆయనేమో తనకేమో అటువంటి తలుపులు లేవని, అలాంటి ఆశలేవీ పెట్టుకోవద్దని ఖండితంగా చెప్పాడు. అత్త రాత్రినుండి ఒకటే ఏడుపు ఇంకా లేవనే లేదివాళ."
"మీ అత్త ఉత్తపిచ్చిదమ్మా! విధి జీవితాన్ని నడుపుతూంటే అంతా మన ప్రతాపమే అనుకొంటుందావిడ!" నిట్టూర్చారు రావుగారు.
ధర్మపత్ని చెంతలేకుండా చేసిన నాటి దేవతారాధన నిండుదనం కోల్పోయినట్లనిపించింది. ఆయనకు ఏమిటో వెలితిగా తోచసాగింది. మనసు కుదరక "మీ అత్తను రమ్మని చెప్పానని చెప్పమ్మా, తను వచ్చాకే భోజనానికి కూర్చొంటాను" అని చెప్పారు.
వెంటనే రాలేదు కృష్ణవేణి. నిద్ర మంచం నుండి అప్పుడు లేచి ముఖం కడిగి. స్నానమాడి మడిబట్ట కట్టుకొని వచ్చింది ఏకంగా పూజామందిరంలో దేవుడిముందు తాటాకుచాపలు అలాగే కూర్చొని వున్నారు రావుగారు. దేవుడిమీద కుంకుమ ఉంచి నమస్కరించి, భర్తముందు చెయిచాచి నిల్చుంది తీర్థానికి.
"అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం...." అని పఠిస్తూ ఉద్ధరణెతో తీర్థం ఇస్తూనే సహచరిణి ముఖంలోకి చూశారు. ఆయన ఆమె కనురెప్పలు ఉబ్బి కళ్ళు చిన్నగా. ఎర్రగా అయ్యాయి. రేగిన జుట్టు సరిదిద్దుకోలేదు. ముఖాన అస్తవ్యస్తంగా దిద్దుకొంది కుంకుమరేఖ. ఆమె ఆకృతి అతి దయనీయమై కన్పడింది ఆయనకు.
