Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 26


    "నేను వివాహానికి వ్యతిరేకిని కాదు. కాని వివాహం ఆడదాని జీవితంలో ఒక భాగం కావాలిగాని, వివాహమే జీవితం కాకూడదు! వివాహిత అయిన స్త్రీ తన ప్రొఫెషన్ చూసుకొంటూ తీరికకాలాన్ని  గృహసీమను అందంగా మలుచుకోవడంలో తప్పేమీ లేదు! కాని స్త్రీకి సంసారం తరువాతే ఏదైనా అంటే మాత్రం నేను ఒప్పుకోను!"

    "నేను మాత్రం సంసారం చక్కదిద్దుకోవడం తరువాతే అంటాను ఏదైనా! సంసారం చట్టబండలు చేసుకొని ఏం చదువులు, ఏం ఉద్యోగాలు, ఏం కళాసేవలు అంటాను!"

    "మరీ వేద కాలంలో మాట్లాడాల్సిన మాట ఈ ఇరవయ్యవ శతాబ్దిలో మాట్లాడితే హాస్యాస్పదంగా వుంది మమ్మీ మనువు ఇంకా చావలేదు! ఈ ఇరవయ్యో శతాబ్దపు స్త్రీలను కూడా గట్టిగా పట్టుకు పరిపాలిస్తున్నాడనిపిస్తుంది. ఇల్లు శుభ్రంగా వుంచడం, వంటచేయడం, అంట్లు తోమడం, బట్టలుతకడం, మగపిల్లల కోసం, మంచి భర్త కోసం, ముత్తయిదుతనం కోసం నోములు వ్రతాలు చేయడం, దేవతలను ప్రార్దించడం - స్త్రీ ధర్మాలుగా చెప్పాడు మనువు. ఈ ధర్మాలను తు. చ. తప్పకుండా పాటించే నీలాంటి స్త్రీ లు వున్నంతవరకు స్త్రీ జీవితానికి మోక్షం లేదంటాను" ఆవేశపడిపోయింది హరిత.

    "మనువు చెప్పిన ధర్మాలని హేళన చేయకు. మనువు చెప్పినా, ఎవరు చెప్పినా ఆడదానికి ఇల్లు శుభ్రంగా వుంచుకోవడం, వంటా వార్పు చేసుకోవడం, భర్త పూర్ణాయుర్దాయంతో వుండాలనుకోవడం, వంశాచారంగా వచ్చే నోములు, వ్రతాలు చేసుకోవడం తప్పెలా అవుతుంది? ఆడవాళ్ళు ఇలా వుండక ఇంకెలా వుంటే బాగుంటుందంటావు?" కోపంగా అడిగింది హేమలత.

    "ఏం చేసినా పురుషుడిని సుఖపెట్టడం కోసమే నన్నదాస్యభావంతో చేయడంలోనే ఉంది తప్పు!  బార్యా భర్త అంటే సంసారంలో చెరిసగం! చెరిసగం అయినప్పుడు ఇంటి పని పాటలు చెరిసగం కావాలి. ఒక స్త్రీ మాత్రమే తన అమూల్యమైన సమయాన్ని ఇంటి చాకిరీతో వృధా చేసుకోవడం అదేం స్త్రీ ధర్మం?"

    "చదవేస్తే వున్న మతిపోయినట్టుగా వుంది! ఇదేం విపరీత ధోరణి?" విసుక్కుంది హేమలత. "రేపు పెళ్ళయ్యాక ఇలాగే మాట్లాడితే వాడు తంతాడు నిన్ను."

    "భార్యలు దాసీలు కావడానికి కారణంమ. సంపాదన లేకపోవడం, మగవాళ్లమీద పడి తినడమే, మమ్మీ! అందుకే అలాంటి పరిస్థితి తెచ్చుకొంటున్నందుకు ఆడది సిగ్గుపడాలి. చలం అన్నట్టుగా పిల్లల్ని కనే జంతువులు సైతం  తన జంట మీద ఆధారపడడం లేదు! తన బ్రతుకు తను బ్రతికి తన పిల్లల్ని తనే సాక్కుంటుంది. పక్షుల్లో సైతం  పోతుపక్షిమీద ఆధారపడడంలేదు. పెంటిపక్షి తన ఆహారం తనే సంపాదించుకొంటుంది. పశుపక్షులకంటే హీనాతి  హీన మైనదా స్త్రీ జన్మ? మగవాళ్లమీద ఆధారపడి పరాన్న భక్కులుగా జీవించడం వల్లే భార్య అంటే ఒక దాసిగా, ఒక ఉంపుడు కత్తెగా చూడబడే స్థితి తెచ్చుకుంది. నేను మాత్రం  ఉద్యోగం చేసి నా కాళ్లమీద నేను నిలబడేవరకు వివాహం చేసుకోను."

    "అయితే ఉత్తమ గృహిణులంతా నీ దృష్టిలో ఉత్తదాసీలని, ఉంపుడు కత్తెలనీ అర్దమన్నమాట!" కోపంగా అడిగింది హేమలత.

    "అదే, ఉత్తమ గృహిణి, సాధ్వీతిలకం, పతివ్రతా శిరోమణి - ఈ బిరుదుల మీది వ్యామోహమే  ఆడదాన్ని ఇంత హీన స్థితికి తెచ్చింది!  ఈ వ్యామోహమే తన ఆత్మ గౌరవాన్ని ఎక్కడ పోగొట్టుకొంటున్నదీ తెలుసుకోకుండా చేసింది."

    "చల్లటి సంసారాలకు ఇంత వికృత రూపం ఇచ్చే ఈ ధోరణి ఇక పెరగనివ్వకు!" మందలిస్తూ అంది హేమలత. "నీ పెళ్లి గురించి నీక్కాబోయే భర్త గురించి ఆలోచించాల్సింది మేము, నువ్వు కాదు! నీ పెళ్లి నువ్వు చేసుకొనేంత  పెద్ద దానివి  అయిపోయావనుకొంటున్నావా?"

    "మీ మీద నాకా నమ్మకముంది మమ్మీ! కాని నాది ఒకే ఒక షరతు! నా పెళ్ళికి కట్న ప్రసక్తి ఉండకూడదు! పైసా కట్నం తీసుకోనివాడినే నా జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నాను! ఇంకొకటి  ఏమిటంటే  నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాకే నా పెళ్లి జరగాలి!"

    ఇప్పుడే  ఈ విషయం మీద తర్కం పెట్టుకోదలచలేదు హేమలత. ఒకటి రెండు సంబంధాలు దృష్టిలో వున్నా ఇంకా ఎవరినీ కదపడం లేదు - ఈ బి. ఎ. అయిపోగానే పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకొంటున్నారు కాబట్టి. కూతురి పెళ్లికి కట్న కానుకల కోసమే బాంకులో లక్షరూపాయల వరకూ వేశారు.

    ఆరోజు రాత్రి కూతురికీ తనకూ నడిచిన వాదవివాదం గురించి భర్త కృష్ణారావుతో చెప్పింది హేమలత.

    "ఇంతవరకూ పెంచడం ఒకెత్తు. ఇప్పుడొకెత్తు అనిపిస్తూందండి! దానికి చాలా స్వతంత్ర భావాలు ఏర్పడ్డాయి."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS