Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 26

                                                          మమ్మల్నెవరు చేస్కుంటారోచ్
    "హేవండీ!..."
    భార్యపెట్టిన కేకకి ఉలిక్కిపడి చూశాడు పరంధామయ్య.
    ఎదురుగా భార్య సీతారత్నమ్మ నిలబడి ఉంది. ఆమె మొహంలో కంగారు స్పష్టంగా కనిపిస్తుంది.
    "ఏమైందే?..." ఆతృతగా అడిగాడు పరంధామయ్య.
    "మనమ్మాయి... మనమ్మాయి.... మనమ్మాయి..."నసుగుతూ నిల్చుంది. ఆమె నోటివెంట మాట రావడంలేదు.
    "ఏంటా నసుగుడూ ?... ఏమైందో త్వరగా చెప్పు... మనింట్లో దొంగలు గానీ పడ్డారా?..."కంగారుగా అడిగాడు పరంధామయ్య.
    "దొంగలు పడినా బాగుండును... కానీ అది కాదండి..."కొంగు నోట్లో దోపుకుంటూ అంది సీతరత్నమ్మ.
    "మరి?... మనవాడు ఇంటిమీదికి దెబ్బలాటేమైన తెచ్చాడా?..."
    కాదు.
    "ముందు నోట్లోంచి కొంగు తీసి మాట్లాడు... చెప్పు... మనవాడు ఇంటి మీదికి దెబ్బలాటలు తెచ్చాడా?"
    "కాదు..."
    "మరి నీ దిగులుకి కారణం ఏమిటి?... ఓ... అర్ధం అయింది! నువ్వు ఇంతిదిగా బాధపడ్తున్నానంటే తప్పకుండా పక్కింటావిడో ఎదురింటావిడో ఖరీదైన పట్టుచీర కొనుక్కుని ఉంటుంది... అవునా? నువ్వెంత బాధపడినా నీకిప్పుడు, పట్టుచీర కొనేది లేదు... నా దగ్గర డబ్బులున్నప్పుడే కొంటాను....అంతే"చిందులు వేశాడు పరంధామయ్య.
    "అబ్బబ్బా.... నేను చెప్పేది వినకుండా మీ మట్టుకు మీరు అలా ఊహించేస్కుంటే ఎలా?...
    "విసుక్కుంటూ అంది సీతారత్నమ్మ.
    "ఏంటో చెప్పు!... అంతకంటే ఎక్కువగా విసుక్కుంటూ అన్నాడు పరంధామయ్య.
    సీతారత్నమ్మ అటూ ఇటూ చూసి పరంధామయ్య చెవిలో రహస్యంగా చెప్పింది.
    "మనమ్మాయి వారపత్రికలు చదువుతుందండీ..."
    పరంధామయ్య అయోమయంగా మొహం పెట్టాడు.
    "ఏంటలా చూస్తారు?.... ఇలారండి..."అంటూ భర్త చేయిపట్టుకుని వాళ్ళమ్మాయి ప్రేమలత గది దగ్గరకు లాక్కెళ్ళింది.
    "చప్పుడు కాకుండా గదిలోకి తొంగి చూడండి.
    పరంధామయ్య మెల్లగా వంగి గదిలోకి తొంగిచూశాడు.ప్రేమలత మంచం మీద బోర్లాపడుకుని కళ్ళు పెద్దవి చేసుకుని ఓ వారపత్రిక చదువుతుంది.
    "చూశారా... వారపత్రికని ఎంత శ్రద్దగా చదువుతుందో?" భర్తని పక్కకి లాక్కెళ్ళి అడిగింది సీతారత్నమ్మ.
    "అందులో విశేషం ఏముందీ?..."ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య.
    "ఖర్మ ఖర్మ..."నెత్తి కొట్టుకుంది సీతారత్నమ్మ "మీరు పత్రికలు చదవరు కాబట్టి మీకేమీ తెలీదు... అమ్మాయ్ పత్రికలు చదువుతుందంటే అమ్మాయ్ పెద్దదైపోయిందన్నమాట... అమ్మాయికి పెళ్ళీడు వచ్చేసింది..."
    "అదేం లెక్క?... పత్రికలు చదివితే పెళ్లీడు రావడమేంటి??" దేభ్యం మొహం పెట్టాడు.
    "హయ్యోఖర్మ!" మళ్లీ నెత్తికొట్టుకుని పరంధామయ్యని చెయ్యిపట్టుకుని బరబరా బెడ్రుములోకి లాక్కెళ్ళి మంచం పరుపు కింద నుండి ఓ వారపత్రిక తీసి అతని చేతికి ఇచ్చి "ఈ పుస్తకంలోనిది మీ ఇష్టం వచ్చిన పేజీ చదవండి... తెలుస్తుంది!!" అంది సీతారత్నమ్మ.
    పరంధామయ్య గట్టిగా చదవడం మొదలుబెట్టాడు."అప్పుడు మోహన్ రాధని..."
    "కాస్త మెల్లగా చదవండి... ఎవరైనా వింటే పరువుపోతుంది..."పరంధామయ్య బుగ్గమీద పొడుస్తూ అంది సీతారత్నమ్మ.
    "హమ్మో...హమ్మో... ఏంట్రా నాయనో ఈ కథలు?..."
    "ఆ... మరేమనుకున్నారు?... ఇంకా పేజీలు తిప్పండి...మరీ పచ్చిబూతులుంటాయ్ ..."కళ్ళు ఎగరేస్తూ అంది సీతారత్నమ్మ.
    "ఆ... అలాగా?...మరి చెప్పవేం??..."గబగబా పేజీలు తిప్పబోయాడు పరంధామయ్య హుషారుగా.
    "చాల్లెండి... ఇలా తెండి"కళ్ళు చిట్లించి పుస్తకం లాక్కుంది సీతారత్నమ్మ.
    "ఏం... నన్ను చూడనివ్వవేం? నువ్వయితే పరుపుల కింద దాచుకుని చదవొచ్చేం?"ఉక్రోష పడిపోతూ అన్నాడు పరంధామయ్య.
    "నేనేం నా కోసం దాచలేదు... పిల్లల కంట కనబడకూడదని దాచాను..."
    "ఇంతకీ బూతు వారపత్రికలు మనమ్మాయి అంతింట్రెస్టుతో చదూవుతుందంటే మరి మనమ్మాయికి వయసొచ్చేసినట్టే కదండీ?"
    "అవును మరి..."తల ఊపాడు పరంధామయ్య.
    "అలా గంగిరెద్దులా తల ఊపడం కాదు.ఓ మాంచి సంబంధం వెతికి అమ్మాయికి త్వరగా పెళ్లి చేసెయ్యాలి! లేకపోతే ఈ వారపత్రికలు చదివీ చదివీ అమ్మాయి కాల్జారినా జారొచ్చు!!!...."
    "అలాగే అలాగే..."మళ్లీ గంగిరెద్దులా తల ఊపాడు పరంధామయ్య.
    "ఆ రోజు మొదలుకొని పరంధామయ్య కూతురు ప్రేమలత కోసం చాలా సంబంధాలు చూశాడు.ఒక్కటీ కుదిరి చావడంలేదు. అన్నీ బాగుంటే అబ్బాయి బాగుండడు,అబ్బాయి బాగుంటే అబ్బాయికి వీళ్లిచ్చే కట్నం బాగుండదు. అబ్బాయికి అన్నీ నచ్చితే వీళ్లకి అబ్బాయే నచ్చడు.
    పరంధామయ్యకి విసుగొచ్చేసింది.చివరికి అతనికి అతని స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు.
    "ఎందుకోయ్ పరంధాం కాళ్లరిగేలా సంబంధాల కోసం అలా తిరుగుతావ్?నా మాట విని పత్రికల్లో మేట్రిమోనియల్ కాలంలో పడ్తాయ్ చూడూ ... వాళ్లలో మంచివాళ్ళని ఎన్నుకుని సంప్రదించు... చాలా సులభంగా కుదిరిపోతుంది.మా ఆఫీసులో ఒకతను మొన్నీమధ్య వాళ్లమ్మాయి పెళ్లి ఇట్టానే చేశాడు"అని చెప్పాడు.
    పరంధామయ్యకి స్నేహితుడు ఇచ్చిన సలహా నచ్చింది. వెంటనే అతను మార్కెట్లో అప్పుడే రిలీజైన "సాహిత్య మసాళా"అనే వారపత్రికని కొనుక్కుని ఇంటికెళ్ళాడు.
    గబగబా పేజీలు తప్పి"కళ్యాణం కక్కు"శీర్షిక తీసాడు. ఆ శీర్షిక కింద ఆ పేజీలో పెళ్ళికావలసిన అమ్మాయిల,అబ్బాయిల వివరాలు ఇచ్చారు.అంటే అది మేట్రిమోనియల్ కాలం అన్నమాట!!
    పరంధామయ్య గబగబా వరుల వివరాలు చదవసాగాడు. అతను చదివిన వరుల వివరాలు ఇవి:
    "సంగారెడ్డిలో దిబ్బకులానికి చెందిన ముప్పయి ఏళ్ల అబ్బాయికి వధువు కావలెను.అబ్బాయి అదే ఊళ్లో కూరగాయలు సైకిల్ మీద అమ్ముకుంటూ ఉంటాడు.నెలకి మూడొందలు పైనే ఆదాయం.అమ్మాయి మంచి సాంప్రదాయకుటుంబం నుండి వచ్చినదై ఉండాలి.అబ్బాయిలా కారునలుపుగా ఉండకుండా తెల్లగా పాల్రాయిలా మెర్సిపోవాలి!అమ్మాయి బ్యాంకులో ఆఫీస్ ఉద్యోగం చేస్తే మంచిది.నచ్చినవారు బాక్సునెంబరు నూట పదకొండుకి ఉత్తరం రాయవలెను."

              మరో ప్రకటన:

        "బేవార్సుపురానికి చెందిన నలభై ఏళ్ల బేకార్రాయుడుకి వధువు కావలెను.వధువు తుప్ప కులానికి చెందినదై ఉండాలి! బేకార్రాయుడుకి ఉద్యోగం లేదు.ప్రస్తుతం రోడ్లమ్మట తిరుగుతున్నాడుగానీ దివ్యమైన ఉద్యోగం దొరుకుతుందనే ఆశ ఉంది.పదో తరగతి ఫెలైన బేకార్రాయుడికి ఉద్యోగం వధువు తరుపు వాళ్ళే ఇప్పించాలి.లేదా ఏదైనా వ్యాపారానికి పెట్టుబడి పెట్టాలి.వధువు రంభలా ఉండాలి.లేదా మేనకలా ఉన్నా ఫరవాలేదు. మిగతా కండిషన్లకి క్రింది చిరునామాని సంప్రదించండి.
    కింద బాక్స్ నెంబరుతో అడ్రసు ఉంది.
    పరంధామయ్య మరో ప్రకటన చదివాడు.
    "కుప్పల పెంటకి చెందిన పదారేళ్ల కుంకాయ్ కి వధువు కావలెను.కులం,మతంతో సంబంధం లేదు.ఎవరైనా సరే అతన్ని డాక్టరీ చదివించి పై చదువులకి అమెరికాకు పంపిస్తే అక్కడ చదువు పూర్తి చేస్కుని ఇండియాకి వస్తేగిస్తే ఆ తరువాత చదివించినాళ్ల అమ్మాయిని చేస్కుంటాడట!వివరాలకు..."
    కుంకాయ్ బాక్స్ నెంబర్ తో అడ్రసు ఉంది.
    పరంధామయ్య ఓసారి గట్టిగా"ఈ..."అని అరిచి జుట్టు కసిగా పీక్కుని మరో వివాహ ప్రకటన చదివాడు.
    "మడ్డి కులానికి చెందిన,పిచ్చికపాడు గ్రామవాసి అయిన ముప్పయి సంవత్సరాల కుర్రాడికి వధువు కావలెను.ఆమె అందగత్తెయు,ఇంటిపనీ,వంటపనీ అన్నియూ చక్కగా చేయగలిగినదై ఉండవలెను.వరుడుకి ఒక కలులేదు.అయిననూ కర్రలతో చక్కగా నడవగల నేర్పు ఉంది.అమ్మాయికి ఏ అవలక్షణమూ లేని పక్షంలో కింద చిరునామాని సంప్రదించండి..."
    పళ్లు కరకరా నూరి చివరి ప్రకటన మీదికి దృష్టిని పోనిచ్చాడు పరంధామయ్య.
    "ముక్కు మూలుగుల పాలెం నివాసి అయిన డెబ్బయి ఏళ్ల వయోవృద్ధుడికి వధువు కావలెను.వధువు వయసు పద్దెనిమిది సంవత్సరాలకి మించి ఉండరాదు.అందగత్తె అయి ఉండవలెను.వృద్ధుడికి మొన్నీ మధ్యనే భార్యా వియోగం అయింది.అతనికి కాబోయే భార్య ఆయనకీ,ఆయన పిల్లలకీ, మనవలకీ రుచికరమైన వంటలు వండిపెడ్తూ ఇంటిని చక్కదిద్దుకోగల సమర్డురాలై ఉండవలెను.వృద్ధుడైన భర్త నడ్డినొప్పి, కీళ్లవాతం మొదలైన బాధలు పడేప్పుడు ఆయనగార్కి సేవలు ఎంతో ఉత్సాహంగా చేయగల ఆదర్శవంతురాలైన యువతల తల్లిదండ్రులు క్రింది చిరునామాని సంప్రదించండి..."
    పరంధామయ్య"హా!..." అని అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు.
                                                                  *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS