Previous Page Next Page 
కావేరి పేజి 26

    "అలాగే వెళ్ళండి!..." అంది.

    అదే మరొకసారి అయినట్లయితే సినిమా సంగతి ఎత్తితే ఊరుకునేది కాదు! బ్రతిమాలగా, బ్రతిమాలగా ఎప్పటికో? తనకి బుద్ది పుట్టినప్పుడు యిరుగుపొరుగుని కూడేసుకుని రెండవ ఆటకి బయలుదేరేది! అది కూడా చాలా తక్కువ! యిప్పుడింక తనకేమీ భయంలేదు. రోజులతరబడి ఎవరినీ బ్రతిమాలనవసరంలేదు. హాయిగా సైకిల్ ఎక్కి ఝుమ్మంటూ పోవచ్చును!

    ట్రంకు పెట్టెలోవున్న కొత్త చీర తీసికట్టుకున్నది. అంతకు ముందు వినాయకం తెచ్చియిచ్చిన స్నోపౌడర్ రాసుకుంది. తెచ్చిన సినిమా పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంది. భోజనానికి రమ్మనమని తల్లి పిలిచినా వెళ్ళలేదు ఆకలి కావటంలేదని!

    "ఆ మూడుముళ్ళూ పడేంతవరకూ యింతలే!" నవ్వింది పార్వతి.

    ఎనిమిదిగంటలు అవుతుండగా వినాయకం సైకిల్ తో వచ్చాడు.

    ఊరు దాటేంతవరకూ యిద్దరూ నడిచారు. ఆ తరువాత సైకిల్ ఎక్కించి కావేరి. వినాయకం ముందు నెమ్మదిగా సైకిల్ తొక్కాడు. ఆ తరువాత కొంచెం స్పీడు పెంచాడు. వినాయకం ఉశ్వాస నిశ్వాసలు కావేరి మెడమీదకి పడుతున్నాయి. ఏదో చక్కలిగిలి పెట్టినట్లయింది. గతుకులు వున్నచోట తన ముఖాన్ని కావేరి భుజంమీద ఆన్చుతున్నాడు వినాయకం! మధ్య మధ్య చెవిని పెదాలతో తాకటం. సుతారంగా మెడ మీద ముద్దుపెట్టుకోవటం చేస్తున్నాడు.

    "పోబావా!..." అంది సిగ్గుపడుతూ!

    "ఇందుకోసమే నిన్ను సినిమాకని తీసుకువచ్చింది. ఎలాగూమనకీ పెళ్ళి కుదిరిపోయింది...ఏం చేసినా? ఎలా చేసినా మనలను అడిగేవాళ్ళు లేరు....అడ్డంకి పెట్టేవాళ్ళు లేరు....యిలా మనిద్దరం కలిసి దగ్గిరగా వుండాలని! నీకెన్నో చెప్పాలని? చెప్పించుకోవాలని యిలా తీసుకువచ్చాను....తెలిసిందా?"

    "ఇప్పుడు సినిమాకి వెళ్ళమా ఏమిటి?" కంగారుగా అడిగింది.

    "ఎందుకు వెళ్ళము?.... యింకా చాలా టైమువుంది....నా బంగారు చిలుకకు సినిమా చూపించకుండా తీసుకువెళ్తానా?...యిదోక్కటేనా?...నీకు యింకా ఎన్నో సినిమాలు చూపించుతాను. ఎత్తు చెప్పులు కొంటాను....స్నో-పౌడర్లు యింకా వాసనగలవి కొనితెస్తాను....పెళ్ళయ్యెంతవరకూ యిలా సినిమాకని వచ్చి కబుర్లు చెప్పుకుందాం!....ఒకరి నోకరం అర్ధం చేసుకుందాం!" వినాయకం అలా అంటూనే సైకిల్ హాండిల్ ని ఒక చేత్తోనే పట్టుకుని మరోచేత్తో కావేరి నడుంచుట్టూ చెయ్యివేసి పొట్టమీదకి రావటంతోనే ఆగిపోయి అక్కడే సుతారంగా తడమసాగాడు. అలా తడుముతుంటే యిద్దరూ మధురాను భూతులకు లోనయిపోయారు. ఏదో తమకలాంటిది కలిగింది.

    "నాకు మద్రాసు చూడాలని వుందిబావా!" అదును కనిపెట్టి అడిగింది కావేరి....

    "తప్పకుండా తీసుకెళ్తాను....యిక్కడ స్టేషనులో రైలు ఎక్కితే విజయవాడ వెళ్ళటం! అక్కడనుంచి మద్రాసు వెళ్ళే రైలు ఎక్కితే సారీ!...ఎంత బాగుంటుందట మద్రాసు! నాకూ చూడాలనివుంది.

    అలా అంటూనే తన చేతిని యింకాస్త పైకి పోనిచ్చి మృదువుగా నిమిరాడు. అలా నిమురుతుంటే ఎంత త్వరగా కావేరిని ఆక్రమించుకోవాలా? అన్నంత ఆవేశం కలిగింది వినాయకంలో!

    మరీ ఒక్కసారే అంటే కావేరి ఏమయినా అనుకుంటుంది? అన్న భావంతో అలా స్పర్సతోనే తృప్తి పడుతున్నాడు.

    కావేరి మన స్థితి కూడా అలాగేవుంది. సరే దోచేస్తుంటే అదో లోకంలో లీనమయిపోయింది. తామిద్దరూ మద్రాసు వెళ్ళినట్టు హొటల్లో వున్నట్టు-సినీ నిర్మాతలను కలుసుకున్నట్టు, వాళ్ళు తనకి ఎన్నో రకాలయిన వేషాలు ఇచ్చినట్టు, కొన్ని లక్షల డబ్బు ఇచ్చినట్టు వాటంతటినీ వినాయకం బావ బీరువాలో దాచి పెడుతున్నట్టుగా భావించుతోంది. నిజానికి తానెంతో అదృష్టవంతురాలు! బావ తనకు అన్నే చూపించుతానన్నాడు! అనుకుంది మరలాను.

    ఎదురుగా ఎడ్లబళ్ళు రావటంలో సైకిల్ ని పక్కకి తీసి ఆపి బాలన్సుకోసం చేట్లుమీద చెయ్యివేసి ఆపుకున్నాడు వినాయకం!

    బళ్ళు వెళ్ళిన తరువతః తిరిగి సైకిల్ తోక్కసాగాడు.

    సినిమాహాలు దగ్గిరకు వచ్చేసరికి బైటికి రాబోతున్న నాగులుకి సైకిల్ దిగుతున్న కావేరి కనిపించింది. ఎదురువెళ్ళాడు.

    "మీరు బాబుగారూ వచ్చారా? మీ పెళ్ళి అని మా నాన్న చెప్పాడు. చాలా సంతోషం అమ్మాయిగారూ? వినాయకంబాబూ ఎంతో మంచివారు! నేను గుర్తున్నానా బాబుగారూ? అనడిగాడు.

    "ఆఁ...ఎందుకు గుర్తులేదూ?...నువ్వే గుర్తు పట్టలేనంతగా మారిపోయావు!..."

    ఆ మాటకి నవ్వుకున్నాడు నాగులు!

    "ఎక్కడికి బయలుదేరావు నాగులూ?" అనడిగాడు వినాయకం!

    "నా రూంకి  బయలుదేరాను. భోజనంచేసి మరలా రావాలా! మీరు పిక్చర్ కేనా వచ్చింది బాబుగారూ?"

    నాగులు  మాటలమధ్యలో కొన్ని ఇంగ్లీషు మాటలు దొర్లటం కావేరి గ్రహించింది.

    "సినిమాకే వచ్చాం. నువ్వెళ్ళి భోంచేసిరా!" అన్నాడు.

    "ఇంకా టైంవుంది. అప్పటివరకూ యిక్కడదేనికి? నా రూంకి వెళ్దాంరండి! రూంలో అయితే కూర్చోవచ్చును!"

    కావేరికి చూడాలనిపించి వినాయకానికి సైగ చేసింది వెళ్దామని!

    ముగ్గురూ కలిసి బయలుదేరారు. నాగులు రూముసినిమాకి ఫర్లాంగు దూరం వుంటుంది. సైకిల్ స్టాండు వేసి నాగులు తాళం తీసి లోపలికి వెళ్ళి స్విచ్ వేసే సరికి లైటు వెలిగింది.

    "రండి లోపలికి!" అన్నాడు.

    కావేరీ లోపలికి వచ్చి ఆ గదిలో వున్న కుర్చీలను, టేబుల్ ని, టేబుల్ మీద వున్న రేడియోను చూసి ఆశ్చర్యపోయింది.

    అలమరలో కొన్ని పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు వున్నాయి. కొన్ని సినిమా పుస్తకాలు! మరికొన్ని వాల్ పోస్టర్సు కూడా క్రింద అరలో వున్నాయి. ఓ పక్కగా మంచం! తెల్లటిదుప్పటి పరిచివుంది.

    "ఏమిటీ? అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అమ్మాయిగారూ? కూర్చోండి!...కూర్చున్నాక చూడవచ్చును!..." అన్నాడు నాగులు!

    వినాయకం కావేరి కుర్చీలలో కూర్చున్నారు.

    "ఇప్పుడు ఈ సినిమా హాలుని నేనే చూస్తున్నాను బాబుగారూ! నాకే అప్పగించారు. సినిమాహాలు తెరవటం, ఆడించటం, కలక్షన్ లెక్క తీసుకోవటం, డిస్టిబ్యూటర్ కి పర్సంటేజీ యివ్వటంలాంటి బాధ్యతలన్నీ నాకే అప్పగించారు. వ్యాపారంలో కొన్ని సుళువులు కూడా నేర్చుకు'న్నాను....యింకా కొంత అనుభవం సంపాదించుకుని స్వంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. అదే యిప్పటినుంచీ ఆలోచించుతున్నాను...అప్పటికప్పుడు అంటే ఎలా? ఏదయినా మన ప్రయత్నం వుంటే సాధించలేనిది అంటూ వుండదు...ఆ ప్రయత్నంలోనే వున్నాను..."
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS