Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 26


    చాలా సేపటికి గాని రాజారామ్ నిద్రపోలేదు.


                                      0    0    0


    తెల్లవారింది. పదిగంటలు అయ్యే సరికల్లా భవాని, రాజేశ్వరి - రాజారామ్ ఇంటికి వచ్చారు. రమణీ ముస్తాబు బాధ్యత రాజేశ్వరి తీసుకుంది. రమణిని రామచిలుకలా అందంగా అలంకరించింది.

    అంతలో చైర్మన్ గారింటి నుంచి కాంటెస్సా కారు వచ్చింది. అంతా కలిసి కారులో బయలుదేరాడు.

    వెనుక సీట్లో భవానీ, రాజేశ్వరీ, రమణీ - ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. నవ్వుతున్నారు.

    ముందు సీట్లో డ్రయివర్ పక్క కూర్చున్న రాజారామ్ కి మాత్రం మనసు మనిషిలో లేదు. కారు వెళ్తోంటే రోడ్డు మీద కనిపించిన ప్రతి మనసులోనూ అతనొక రాక్షసుడిని చూస్తున్నాడు. కనిపించని భూతం ఏదో తనని కబళించడానికి పొంచి ఉన్నట్టు....ఆందోళన పడ్తున్నాడు. ఏదో పీడకలలో తానొక పాత్రగా - అమితమయిన వేదనకి గురువుతున్న వ్యక్తిగా ఫీలవుతున్నాడు.

    రాజేశ్వరి మనోభావాలు కూడా అలాగే ఉన్నాయి. కాని వాటిని బయటికి కనిపించనివ్వకుండా మనస్సులోనే  దాచేసి గలగలా మాట్లాడేస్తోంది.

    మరి కాసేపటికల్లా కారు చైర్మన్ రాజభూషణరావు ఇల్లు చేరుకుంది. మేనేజింగ్ డైరెక్టర్ విరించి భార్య మహాలక్ష్మి కారు పోర్టికోలో నిలబడి వాళ్ళందరికీ స్వాగతం చెప్పింది. అంతా కలిసి డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు.

    "అనంతగిరి పిక్నిక్ కి అంతా రెడీ చేశాను. మెటడార్ వేన్, డ్రయివర్, తినుబండారాలు అంతా రెడీ. తీరా చూస్తే మావారికి ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయారు. మావయ్య గారికి రాత్రి నుంచి కొద్దిగా జ్వరం, అంచేత పిక్నిక్ కాన్సిల్!" అంది మహాలక్ష్మి.

    ఆ మాట వినగానే చిన్నారి రమణి మొహంలో నవ్వు మాయమైంది.

    "అయినా ఫర్వాలేదు. ఇవాళంతా మనం ఇక్కడ కలిసే కాలక్షేపం చేద్దాం. ఏం పాపా?" అంటూ రమణి వేపు చూసిందామె.

    "ఓకే ఆంటీ" అంటూ రమణి వెళ్ళి మహాలక్ష్మి ఒళ్ళో కూచుంది.

    అంతా కలిసి కాసేపు పేకాట ఆడుకున్నారు. మరి కాసేపు కేరమ్స్ ఆడారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ డ్రాయింగ్ రూంలో చేరారు.

    "అన్నట్టు మేడం. చైర్మన్ గారిని, కలుసుకోవచ్చా?" అనడిగాడు రాజారామ్.

    "ఉదయం పది గంటలకి డాక్టర్ ఆయనకి సెడేటివ్ ఇచ్చినట్టున్నారు. సాయంత్రం వరకూ డిస్టర్బ్ చెయ్యవద్దన్నారు." అంది మహాలక్ష్మి.

    "సరేలెండి" అని ఊరుకున్నాడు రాజారామ్.

    అంతలో ఫోన్ మోగింది. మహాలక్ష్మి అందుకుని - భవానీ కేసి చూసింది - "ఫోన్ మీకే!" అంటూ.

    భవాని టెలిఫోన్ రిసీవర్ అందుకుంది.

    "హలో" అంది.

    "ఈజిట్ ఇన్ స్పెక్టర్ భవానీ?"

    "ఎస్ ప్లీజ్"

    "ఇన్ స్పెక్టర్ దుర్గారావ్ హియర్"

    "గుడ్ మార్నింగ్ సర్"

    "చూడమ్మా భవానీ....నేను చెప్పేది జాగ్రత్తగా విను. సుందరి అనే అమ్మాయి ఇవాళ దొరికింది. రాజారామ్ గారు అక్కడ ఉన్నారా?

    "ఉన్నారు సర్"

    ఆయన తప్పించుకొని పోకుండా చూడూ. టేకిట్ ఫర్ గ్రాంటెడ్....దట్ హి ఈజ్ ఆల్మోస్ట్ అండర్ అరెస్ట్.అండర్ స్టాండ్?"

    "ఎస్ సర్"

    "సుందరి శవం ఇవాళ హుసేన్ సాగర్లో తేలింది."

    రిసీవర్ని క్రేడిల్ మీద ఉంచేశాక జరిగినదంతా చెప్పింది భవాని. రాజేశ్వరీ, రాజారామ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.

    అంతలో మళ్ళీ ఫోన్ మోగింది. భవాని రిసీవర్ ఎత్తింది. "భవానీ హియర్" అంది.

    "నేనే దుర్గారావుని ఓ విషయం చెప్పడం మరిచిపోయాను. సుందరి చచ్చిపోయి బహుశా వారం రోజులు అయి ఉంటుంది. శవం బైటికి తేలడానికి ఇన్ని రోజులు పట్టిందన్నమాట. చావుకి కారణం తలమీద బలమైన దెబ్బ తగలడం. తరవాత ఒక చెవికి 'ఎస్' అన్న ఆకారంలో రింగు ఉంది. రెండో చెవికి రింగు లేదు. బోసిగా ఉంది.

    "ఈ సంఘటనతో కేసు కొత్త మలుపు తిరిగినట్టే కదా సార్?" అంది భవాని.

    "అంచేత సుందరి నిన్న అప్పారావుని చంపే అవకాశం లేదు. ఎందుకంటే ఆమె అంతకు ముందే చచ్చిపోయింది కనుక! అంచేత రాజారామ్ గారిని తీసుకుని నువ్వు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి రా!"

    "ఎస్సర్" అంటూ ఫోన్ పెట్టేసింది భవాని. తరువాత రాజారామ్ వేపు తిరిగి "రాజారామ్ గారూ, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోమని నాకు ఆర్డర్స్ వచ్చాయి." అంది.

    "రమణీ నువ్వు ఆంటీతో కలిసి కాసేపు తోటలో ఆడుకోమ్మా" అన్నాడు.

    "అలాగే ఆడుకుంటాను కాని 'కస్టడీ' అంటే ఏంటి డాడీ?" అంది రమణి తండ్రి చేతిని పట్టుకుంటూ అడిగింది.

    "కస్టడీ అంటే మరేం కాదమ్మా ఓసారి పోలీస్ స్టేషన్ కు వెళ్ళిరావాలి" అన్నాడు.

    రమణి ఒక్కతే పక్కగదిలోకి వెళ్ళగానే పరిస్థితిని అందరూ చర్చించారు. సంగతేమిటో తేలేవరకూ రమణిని తన దగ్గరే ఉంచమని మహాలక్ష్మి కోరింది. ఏ ప్రమాదము రాదని, తన దగ్గర రివాల్వర్ కూడా ఉందని చెప్పింది.

    "సరే సాయంత్రం అయ్యేసరికల్లా వచ్చేస్తాను." అన్నాడు రాజారామ్. అంతలోనే మళ్ళీ ఏదో ఆలోచన వచ్చినట్టు- "నేను అప్పారావుని హత్యచేసినట్టు ఇన్ స్పెక్టర్ దుర్గారావు స్ట్రాంగ్ కేసు బనాయించగలడేమో చూద్దాం. కాని సుందరి హత్యకీ, నాకూ ఎలా ముడిపెడతాడో అర్ధం కావటం లేదు. సుందరిని చంపినా వ్యక్తి ఆ చెవి రింగుని అప్పారావు గదిలో పడేసి ఉండాలి. నేను మాత్రం ఆ పని చెయ్యలేదు. ఆ అమ్మాయెవరో కూడా నాకసలు తెలీదు." అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS